పప్పు దినుసుల సాగేది?

ABN , First Publish Date - 2020-03-08T06:42:07+05:30 IST

జనాభా అవసరాలకు అనుగునంగా ఆహారోత్పత్తి పెరగడం లేదు. పలు పోషకాలను అందించే పప్పుదినుసుల సాగు గణనీయంగా తగ్గింది. జిల్లాలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తిలో...

పప్పు దినుసుల సాగేది?

  • భారీగా తగ్గిన అపరాల సాగు విస్తీర్ణం
  • ఆహారభద్రతకు ముప్పు
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు
  • జిల్లాలో రబీలో సాగైంది 751 ఎకరాలే
  • పట్టించుకోని ప్రభుత్వం


నెన్నెల, మార్చి 7: జనాభా అవసరాలకు అనుగునంగా ఆహారోత్పత్తి పెరగడం లేదు.  పలు పోషకాలను అందించే పప్పుదినుసుల సాగు గణనీయంగా తగ్గింది. జిల్లాలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తిలో పప్పుదినుసుల శాతం తక్కువగా ఉంది.  వాణిజ్యపంటలు సంప్రదాయ సాగును వెనక్కు నెట్టేస్తున్నాయి. చాలా ఏళ్లు స్థిరంగా ఉన్న పప్పుదినుసుల దిగుబడులు కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తున్నాయి. జిల్లాలో యాసంగి పంటలన్నీ కలిసి 68,246 ఎకరాల్లో సాగవుతుండగా పప్పుదినుసులు 751 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు. అపరాల సాగు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఆహారభద్రతపై ప్రభావం చూపుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


మంచిర్యాల జిల్లాలో పప్పు దినుసుల సాగు విస్తీర్ణం

శనగలు: 193 ఎకరాలు

మినుములు: 9 ఎకరాలు

పెసరు: 199 ఎకరాలు

కందులు: 350 ఎకరాలు

మొత్తం: 751 ఎకరాలు


భారీగా తగ్గిన సాగు విస్తీర్ణం

పప్పు దినుసుల సాగులో గతంలో మంచిర్యాల జిల్లా అగ్రభాగాన ఉండేది. పదేళ్ల కిందట దాదాపు 40 వేల ఎకరాల్లో సాగయ్యే పప్పుదినుసుల సాగు ప్రస్తుతం వెయ్యి ఎకరాల లోపు  పడిపోయింది. ఒకప్పుడు జిల్లాలోని ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాల్లో సాగైన పప్పుదినుసుల పంట క్రమంగా తగ్గుతూ వచ్చింది. పత్తి, మిరప, పొద్దు తిరుగుడు తదితర వాణిజ్య పంటల వైపు రైతులు మొగ్గుచూపడంతో పప్పుదినుసుల సాగుపై తీవ్ర ప్రభావం పడింది.  జిల్లాలో గతంలో కంది, శనగ, పెసర, మినుము పంటలు సాగుచేసేవారు. ప్రస్తుతం అవసరానికి సరిపడ ఉత్పత్తి లేకపోవడంతో పప్పు దినుసులను దిగుమతి చేసుకోక తప్పడం లేదు. మినుము, పెసర, శనగ సాగుకు సమయం, పెట్టుబడి తక్కువ ఉన్నప్పటికీ సాగు పెరగడంలేదు. వాణిజ్య పంటలతో పోల్చుకుంటే రైతులకు లాభాలు తక్కువగా వస్తుండడంతో పప్పు దినుసుల సాగు తగ్గిపోయింది.  యేటా జిల్లాలో పప్పు దినుసుల ఉత్పత్తి తగ్గిపోతుండటంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


పట్టించుకోని ప్రభుత్వం

పప్పుదినుసులు పండించడంలో ఉన్న ఇబ్బందులతో రైతులు సాగుకు అంతగా మొగ్గు చూపడం లేదు. మార్కెట్‌ పరంగా పంటకు ప్రోత్సాహకాలు అందిస్తేనే సాగు పెరుగుతుందని నిపుణులంటున్నారు. ఆహార భద్రత కోసం తీసుకువచ్చిన హరిత విప్లవం  వ్యవసాయ విధానంలో భాగమైన పప్పుదినుసులను దూరం చేసింది. భారీ ప్రాజెక్టులు, చెరువులు నిర్మించిన తరువాత భూములన్నీ వరి సాగుకు మారిపోయాయి. పప్పు దినుసులకు ప్రాముఖ్యం లేకుండాపోతోంది. పరిశోధన, సాంకేతిక విషయాల్లో ప్రోత్సాహం  కనిపించడం లేదు. అపరాల్లో సైతం జీవవైవిద్యం తగ్గి పోతోందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. కనీసం 30 శాతం వృద్ధి పెంచడానికి  అవకాశం ఉన్నప్పటికి ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. 


కేవలం పది శాతమే అధికారిక ఆమోదం పొందిన విత్తనాలు వాడుతున్నారు. విత్తన సంస్థలు పప్పు దినుసుల హైబ్రీడ్‌ రకాలను ఉత్పత్తి చేయడం లేదు. కందికి మాత్రమే హైబ్రీడ్‌ రకాలున్నాయి.  సర్కారు పప్పు దినుసుల  ఉత్పత్తిని పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. 20 ఏళ్లుగా హెక్టారుకు ఆరు క్వింటాళ్ల సగటు దిగుబడి మాత్రమే వస్తోంది.  పప్పుదినుసులకు మార్కెట్‌ నుంచి సరైన  రక్షణ లేదు. రిటైల్‌ మార్కెట్లో ఉన్న ధరకు హోల్‌సేల్‌ మార్కెట్లో ఉన్న ధరలకు   పొంతన లేకుండా ఉంటోంది.  ఆ విషయాన్ని పాలకులు పట్టించుకోవడం లేదు. ఖరీఫ్‌ పంట కోతల తరువాత పొలాల్లోని తేమ పప్పు దినుసుల సాగుకు ఉపకరిస్తోంది. కాని అధికారులు రైతులను చైతన్య పర్చడం లేదనే ఆరోపణలున్నాయి. 


తీసుకోవల్సిన జాగ్రత్తలు

  • వరికి ఇచ్చిన ప్రాధాన్యం పప్పుదినుసుల సాగుకు ఇవ్వాలి.
  • గరిష్ట మద్దతు ధరకు మార్కెట్‌ రిటేల్‌ ధరకు అంతరాన్ని తగ్గించాలి.
  • కొనుగోళ్ల పర్యవేక్షణకు ఉన్నతస్థాయి కమిటీని నియమించాలి
  • పప్పుదినుసుల సాగుకు రైతులు దూరంగా ఉండటానికి కారణం ఉత్పత్తి తక్కువగా ఉండటమే. అధిక దిగుబడలు సాధించే వంగడాలను అభివృద్ధి చేయాలి.
  • దిగుబడులను పెంచడం సహా స్వల్పకాలిక రకాలను రూపొందించడంపై దృష్టి సారించాలి.
  • ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటనతోనే ఆగి పోకూడదు. వరి, గోధుమలాగా భారత ఆహార సంస్థ వీటిని  సేకరించాలి.
  • నాణ్యమైన  విత్తనాలు సరఫరా చేయాలి. 
  • వర్షాధార వరి సాగు చేసే ప్రాంతాల్లో పప్పుదినుసులను ప్రోత్సహించాలి.
  • పత్తిలో అంతర పంటగా సాగు చేసేలా చూడాలి.

నాడు పుట్ల కొద్ది పండేటివి

 నాడు కందులు, పెసలు, శనగలు పుట్ల కొద్ది  పండేటివి. ఇప్పుడు తిందామంటే దొరుకుత లేవు. చెరువులు, కుంటల శిఖాల్లో ఊరంత ఒకటై శనగలు వేసేటోల్లు. అట్ల పప్పు దినుసులు పండించే కాలం పోయింది. అందరు పత్తి పంటకు ఎగబడ్డరు. ఏడ చూసిన పత్తే కనిపిస్తున్నది. ఇంటి పెరళ్లల్లో కూడా పత్తి పెడుతున్నరు. పైసల కోసం పండించే పంటలు ఎప్పటికి మంచిది కాదు.

  • - కాల్వ బీరయ్య, రైతు నందులపల్లి, నెన్నెల మండలం

రైతులకు అవగాహన కల్పిస్తున్నాం

పత్తికి ప్రత్యమ్నయంగా పప్పు దినుసుల సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేసి చైతన్య పరుస్తున్నాం. చీడపీడలను తట్టుకోవడంతోపాటు తక్కువ కాల పరిమితి గల రకాలను పరిచయం చేస్తున్నాం. యూనివర్సిటీ అభివృద్ధి చేసిన మేలు రకాల కంది, పెసర విత్తనాలను రైతులకు అందించాం. 160 రోజుల్లో చేతికి వచ్చే కందితోపాటు, 60 రోజుల్లో చేతికి వచ్చే పెసర కూడా అందుబాటులో ఉంది.

ఈ రకాలు సాగు చేస్తే 5-6 క్వింటాళ్ల దిగుబడిని తప్పకుండా సాధించవచ్చు. బెల్లంపల్లి మండలంలోని మాలగురిజాలలో సంతోష్‌ అనే రైతుతో ప్రయోగాత్మకంగా రెండేసి ఎకరాల్లో పత్తి, కంది సాగు చేయించాం. పత్తికి పెట్టుబడిగా రూ. 42 వేలు, కందికి రూ. పదివేలు ఖర్చు అయింది. పత్తిలో రూ. 4 వేలు మాత్రమే మిగులగా.. కందిలో రూ. 38 వేలు లాభం వచ్చింది. పత్తికి స్ర్పే చేసే రసాయనాలతో భూమి దెబ్బతింటుంది. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది. రైతులు ఈ విషయాలను గమనించి పప్పు దినుసుల సాగు చేయడమే శ్రేయస్కరం.

-డాక్టర్‌ రాజేశ్వర్‌నాయక్‌, సీనియర్‌ శాస్త్రవేత్త, ప్రోగ్రాం కోఆర్డినేటర్‌, కేవీకే బెల్లంపల్లి

Updated Date - 2020-03-08T06:42:07+05:30 IST