మహిళా.. వందనం...

ABN , First Publish Date - 2020-03-08T06:22:36+05:30 IST

మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. గతంలో పలు కుట్టబాట్లతో ఇంటికి పరిమితమయ్యేవారు. బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటి దురాచారాలతో ...

మహిళా.. వందనం...

  • అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు
  • కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్న మహిళా సమాజం
  • పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాలి
  • నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

శ్రీరాంపూర్‌/కోటపల్లి,  మార్చి 7 : మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. గతంలో పలు కుట్టబాట్లతో ఇంటికి పరిమితమయ్యేవారు. బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటి దురాచారాలతో మహిళలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.  చాలా మంది వంటింటికే అంకితం కాగా కొందరు కుట్లు, అల్లికలు, చిత్రకళ, సంగీతం మొదలైన లలిత కళలు నేర్చేవారు. సమాజంలో వస్తున్న మార్పులతో వారికి రిజర్వేషన్లు కల్పించారు. పోలీస్‌, ఫారెస్ట్‌, విద్య, వైద్య ఇలా అన్ని రంగాల్లో ప్రస్తుతం దూసుకుపోతున్నారు. పురుషులతో దీటుగా విధులు నిర్వర్తిస్తూ అడవులను సంరంక్షించడంలో అతివలు దూసుకెళ్తున్నారు.


కచ్చితమైన విధుల నిర్వహణ, సమయపాలనతో పాటు స్మగ్లర్మ బారి నుంచి అడవులను, వేటగాళ్ళ నుంచి వన్యప్రాణులను కాపాడుతూ, అటవీ సంరక్షణను బాధ్యతగా చేపడుతున్నారు. అక్రమ కలప రవాణాను నిరోఽధించడంలో మహిళ అధికారులు చేస్తున్న కృషి చెప్పుకోదగినది. కోటపల్లి మండలంలోని ప్రాణహిత సరిహద్దు ప్రాంతంలో వాహనాలను తనిఖీలు చేస్తూ కలప రవాణా చెక్‌ పెట్టడంలో సఫలమవుతున్నారు. హరితహారం, వన్యప్రాణుల సంరక్షణపై గ్రామాల్లో ప్రజలను చైతన్యపరుస్తున్నారు.


మరోవైపు ఇటీవల మండలంలో పులి కదలికలు ఎక్కువగా కావడంతో దాని కదలికలపై నిత్యం పర్యవేక్షణ జరుపుతూ, వాగుల్లో వంకల్లో తిరుగుతూ పులి అడుగుల గుర్తులను సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నారు.  నేటి మహిళలు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని పలు రంగాల్లో రాణిస్తున్నారు.  ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, సేవా ఇలా ఏ రంగంలోనైనా తమదైన ముద్ర వేసున్నారు.  కుటుంబానికి, వృత్తికి ప్రాధ్యానతనిస్తూ ముందుడుగు వేస్తున్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా కథనం....


మహిళా దినోత్సవ నేపథ్యం...

పని గంటల తగ్గింపు, పురుషులతో సమానంగా వేతనాలు, ఓటు హక్కు కోసం న్యూయార్క్‌ సిటీలో 15 వేల మంది మహిళలు 1908లో ప్రదర్శన నిర్వహించారు. మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909లో ఫిబ్రవరి 28వ తేదీన మహిళా దినోత్సవం నిర్వహించింది. మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలనే ఆలోచన క్లారా జెట్కిన్‌ చేశారు. కోపెన్‌హెగన్‌ నగరంలో 1910లో జరిగిన ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఉమెన్‌ సదస్సులో ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన మహిళలు క్లారా జెట్కిన్‌ ప్రతిపాదనను అంగీకరించారు. 1911  మార్చి 8న ఆస్ర్టియా, డెన్మార్క్‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాల్లో లక్షలాదిగా మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. 1917లో ఆహారం, శాంతిని కోరుతూ రష్యా మహిళలు హార్తాల్‌ కార్యక్రమం చేపట్టారు. తమ సాధికారతను పొందే క్రమంలో యేటా మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.


మహిళలకు ఆదర్శనం  సారమ్మ

మాతృమూర్తులకు ఆదర్శంగా నిలుస్తోంది శ్రీరాంపూర్‌కు చెందిన దుర్గం సారమ్మ.  ఆమె భర్త  కత్తెరశాల రన్నింగ్‌ ద్వారా ఉద్యోగం సాధించారు.  అనంతరం కత్తెరశాల మరణించడంతో ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కుమారుల బాధ్యత ఆమెపై పడింది. సింగరేణిలో ఆరోగ్య విభాగంలో జనరల్‌ మజ్దూర్‌గా విధులు నిర్వహిస్తూ పిల్లలకు చక్కని విద్య నేర్పి ఉన్నత స్థానాల్లో నిలబెట్టింది. ఒక కూతురు రెవెన్యూ డిపార్టుమెంట్‌లో డీటీగా, కుమారులు ఆంధ్రాబ్యాంక్‌లో క్యాషియర్‌గా, మరొకరు ఎస్‌ఐగా కొలువులు సాధించారు. 


మాటల్లో చెప్పలేను. 

మా అమ్మ కష్టంవల్లే ఇప్పడు ఈ స్థితిలో ఉన్నాం. ఆమె కష్టం మాటల్లో చెప్పలేను. మా గురించి ఆమె పడ్డ తపన అంతా ఇంతా కాదు. మాపై ప్రత్యేక శ్రద్ద చూపడం వల్లనే మా కుటుంబం ఈ స్థాయిలో ఉంది.  మా చిన్న తనంలోనే నాన్న చనిపోయాడు. మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన లేని లోటు తెలియకుండా అమ్మే చూసింది.

 - దుర్గం విజయ డీటీమహిళల హక్కులపై బాల్యదశ నుండే అవగాహణ. 

మహిళల హక్కులు బాధ్యతలపై అవగాహన కల్పించడానికి పాఠశాల స్థాయి నుంచే బాలికల్లో అవగాహన కల్పిస్తున్నాం. మహిళల సాధికారికత విద్యతోనే సాధ్యమవుతుందని విద్యావంతులుగా ఎదుగడానికి కృషి చేస్తున్నాం. బాలికలు విద్యావంతులైతే సర్వతోముఖాభివృద్ధి చెంది బాధ్యత గల మహిళలుగా వివిధ రంగాల్లో రాణిస్తారు.

 - గుండ అరుణ స్పెషల్‌ ఆఫీసర్‌ కేజీబీవీ. 


మహిళల సాధికారికత లక్ష్యంగా 

మహిళలు సాధికారికత లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. 74 రకాల వృత్యంత్తర శిక్షణలు ఇస్తూ స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. మహిళలల్లోను స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం శిక్షణ ఇస్తున్నాం. మహిళలు తయారు చేసిన పలు ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేయడానికి హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్‌ మేళాలు పెట్టి ప్రోత్సహిస్తున్నాం. ఖాధీ గ్రామీణ ఉద్యోగ్‌ సంస్థ ద్వారా శిక్షణ, ఉపాధి కల్పిస్తున్నాం. 

 - కే. సరళాదేవి సింగరేణి సేవా అధ్యక్షురాలు. 


ప్రకృతిపై ప్రేమతో...

ప్రకృతిపై ప్రేమతో అడవిని కాపాడేందుకు ఈ ఉద్యోగానికి ముందుకు వచ్చాను. ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేసి అటవీ ఉద్యోగాలపైనే దృష్టి సారించా. 2008లో అటవీ సెక్షన్‌ అధికారిగా ఎంపికై నిర్మల్‌, ఆదిలాబాద్‌, కడెం ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాను. ప్రస్తుతం కోటపల్లి డిప్యూటీ రేంజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నా. 

- ఎం. లావణ్య, డిప్యూటీ రేంజర్‌ కోటపల్లి


నాన్న ఆశయం నెరవేర్చేందుకే... 

నాన్న లక్ష్మినారాయణ అటవీశాఖలోనే బంగ్లా వాచర్‌గా పనిచేశారు. మేము ఐదుగురం అక్కాచెల్లెళ్ళం. అటవీ శాఖలో ఒకరికైనా ఉద్యోగం రావాలని, యూనిఫాం వేసుకోవాలని తపనపడేవారు. 2016లో బీట్‌ అధికారిగా ఎంపికయ్యాను. కఠినమైన విధులు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రజలకు, ప్రకృతికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నా.

- ఎం. స్వప్న, బీట్‌ అధికారికి, కోటపల్లి 

Updated Date - 2020-03-08T06:22:36+05:30 IST