చలి గుప్పిట్లో ఆదిలాబాద్‌..

ABN , First Publish Date - 2020-12-27T05:39:02+05:30 IST

గత వారం రోజులుగా జిల్లాను చలి వణికి స్తోంది. రోజురోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో చలి తీవ్రత మరింత పెరుగుతోంది.

చలి గుప్పిట్లో ఆదిలాబాద్‌..
చలి మంటలు కాగుతున్న ప్రజలు

జిల్లాను వణికిస్తున్న శీతల గాలులు

రోజురోజుకూ పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

రాత్రివేళ అమాంతం పెరిగిపోతున్న చలి తీవ్రత 

బేల మండలంలో 6.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు

జిల్లాపై మరిన్ని రోజులు ప్రభావం

ఆదిలాబాద్‌, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): గత వారం రోజులుగా జిల్లాను చలి వణికి స్తోంది. రోజురోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. శనివారం జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రత 28.8 డిగ్రీలు కాగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 8.2 డిగ్రీలుగా నమోదయ్యింది. కాగా అత్యధిక కనిష్ఠ ఉష్ణోగ్రతలు బేల మండలంలో 6.7 డిగ్రీలు కాగా, భీంపూర్‌ మండలం అర్లి(టి) గ్రామంలో 6.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదవు తు న్నాయి. కాగా, జిల్లావ్యాప్తంగా నల్లరేగడి నేలలు ఉండడమే దీనికి ప్రధాన కారణమని సంబంధిత  వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతియేడు డిసెంబర్‌ నెలలోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో చలి గాలుల ప్రభావం కనిపిస్తోంది. దాదాపుగా నైరుతి రుతుపవనాల తిరోగమనంతో రాత్రివేళల్లో చలి తీవ్రత పెరిగిపోతుంది. మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో దట్టమైన అడవులు, వాగులు, వంకలు, పంట చేన్లు ఉండడంతో చలి తీవ్రత మరింత కనిపిస్తోంది. అంతేకాఉండా చలి తీవ్రత నుంచి తట్టుకునేందుకు ప్రజలు రాత్రివేళల్లో ఇళ్లలోనే చలి మంటలు వేసుకుని వెచ్చదనం పొందుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల ఆరోగ్యంపై ఈ చలి గాలులు ఇబ్బందికరంగా మారాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా చలి తీవ్రత ఉండడంతో ప్రజలు వెచ్చని దుస్తులను ధరిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు చలి తీవ్రతో ఇబ్బందులకు గురవుతున్నారు. మాటిమాటికి బయటకు వస్తు ఎండలో నిలబడుతూ వెచ్చదనం పొందే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, సాయంత్రం 3గంటల నుంచే చలి తీవ్రత మొదలవ్వడంతో ప్రజలు సాయంత్రం 5గంటల లోపే ఇంటికి చేరుకునే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చాలామంది ఇంటికే పరిమితమవుతున్నారు. ఉదయం 11గంటల వరకు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. మరికొన్నాళ్ల పాటు జిల్లాపై చలిగాలుల ప్రభావం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు చలికి తోడు కొత్త కరోనా భయం ప్రజలను వెంటాడుతోంది.

Updated Date - 2020-12-27T05:39:02+05:30 IST