‘ఉపాధి’కి భరోసా

ABN , First Publish Date - 2020-03-13T11:47:26+05:30 IST

‘ఉపాధి’కి భరోసా

‘ఉపాధి’కి భరోసా

పెంచిన వేసవి భత్యంతో ఈజీఎస్‌ కూలీలకు ఊరట

జిల్లాలో 1,16,789 జాబ్‌కార్డులు 

గైర్హాజరు తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు

వడదెబ్బ తగలకుండా క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లు


కలెక్టరేట్‌, మార్చి12: ఉపాధిహామీ కూలీలకు ప్రభుత్వం వేసవి భత్యం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్ర వరి నుంచి జూన్‌ వరకు 20శాతం నుంచి 30శాతం కూలి మొత్తాన్ని అధికంగా చెల్లించనున్నారు. దీంతో ఉపాధి కూలీల కష్టాలు తీరనున్నాయి. ప్రధానంగా వ్యవ సాయ కూలీలకు పనుల్లేని రోజుల్లో ఈజీఎస్‌ కింద వచ్చే కూలి డబ్బులే వారి ఆర్థిక కష్టాలను తీరుస్తున్నాయి. గతంలో ఈ శాఖ పరిధిలో   కాలువల్లో పూడికతీతలు, సేద్యపు కుంటలు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, వంట గదులు, పాఠశాల గదులు, శ్మశాన వాటికల నిర్మాణం, చిన్న పాటి బావులు, చెరువులను తవ్వడంలో కూలీలు గణనీ యమైన ప్రగతిని సాధించి రికార్డు స్థాయిలో వేతనాలు అందుకున్నారు. వేసవి కాలంలో కూలీలకు ఎండ దెబ్బతో ఆరోగ్య సమస్యలు పొంచి ఉండే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ముందుచూపుతో ఒక వైపు ఆర్థికంగా భత్యం పెంచుతూనే మరోవైపు వసతుల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు విడుదల చేస్తోంది. 


జిల్లాలో మొత్తం 2,51,421 మంది కూలీలు ఉండగా 1,16,789 మందికి జాబ్‌కార్డులు ఉన్నాయి. వీటిలో 82,071 జాబ్‌ కార్డులకు సంబంధించి 1,62,972 మందికి పని కల్పించి రూ.40కోట్లను ఖర్చు చేశారు. సంవత్సరంలో సగటు కూలి ఒక్కరికి రూ.164.51 ఉండగా 40 పనిదినాలు కల్పించారు. అదే కాకుండా జిల్లాలో గత సంవత్సరం వంద రోజుల పని కల్పించిన కుటుంబాలు 3,534 ఉన్నాయి. ప్రస్తుతం గరిష్ఠంగా ఒక్క రోజుకు రూ.211, కనిష్ఠంగా రూ.140 వరకు చెల్లిస్తున్నారు. ఈ వేసవిలో నాలుగు నెలల పాటు ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉండడంతో పని సమయం తగ్గుతుంది. తక్కువ సమయం పని చేసినా పూర్తి స్థాయి వేతనం చెల్లించనున్నారు. 


గైర్హాజరు తగ్గింపునకు చర్యలు

ఎండకాలంలో ఉష్ణోగ్రతలు జిల్లాలో ఎక్కువగా ఉండడంతో వడదెబ్బ తగిలి చాలా మంది కూలీలు అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం కూలీలకు వెసులుబాటు కల్పించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. క్షేత్రస్థాయిలో ఉపాధి కూలీలు పనిచేసే ప్రాంతాల్లో షామియానాలు, చలువ పందిళ్లు, పరిశుభ్రమైన తాగునీరు, ప్రాథమిక చికిత్స కిట్లు ఏర్పాటు చేస్తుంది. వేసవిలో ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే కూలీలు పని చేస్తుండటం, మధ్యాహ్న వేళల్లో విరామం తీసుకుంటూ ఉండడంతో కూలీ మొత్తం తగ్గడం, పనులు ముందుకు సాగక పోయే పరిస్థితులు వచ్చేవి. ఈ క్రమంలోనే ఎండల తీవ్రతను బట్టి 20 నుంచి 30 శాతం వరకు కూలీలకు అదనపు భత్యం చెల్లించేలా సర్కారు చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి గత ఫిబ్రవరి 20న ప్రభుత్వం సర్క్యులర్‌ జారీ చేసింది. ఫిబ్రవరి నెలలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్‌, మే నెలల్లో 30 శాతం, జూన్‌ నెలలో 20 శాతం కూలి పెంచుతూ జీవో జారీ చేసింది. ఇదిలా ఉండగా ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ప్రతి కుటుంబానికి కచ్చితంగా 40 పని దినాలు కల్పించాలని ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. దానికంటే తక్కువ పని దినాలు కల్పించిన ఎఫ్‌ఏలకు జీతంలో కోత విధిస్తూ జీవోను విడుదల చేశారు. దీనిని ఉపసంహరించాలని కోరుతూ జిల్లాలోని 14 మండలాల్లోని ఎఫ్‌ఏలు గురువారం నుంచి సమ్మెలో పాల్గొంటున్నారు. కాగా పెంచికలపేట మండలంలో మాత్రం కూలీలు విధుల్లో ఉన్నారు. ఎఫ్‌ఏల సమ్మెతో ఉపాధిహామీ పనుల్లో కొంత జాప్యం జరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. 


కూలీల గైర్హాజరు తగ్గుతుంది -వెంకటశైలేష్‌, డీఆర్‌డీఓ

ప్రభుత్వం వేసవి భత్యాలు పెంచడం వల్ల ఎండకాలం ఉపాధి పనుల్లో కూలీల గైర్హాజరు శాతం తగ్గుతుంది. పెరుగుతున్న ఎండల దృష్ట్యా కూలీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతో పని వేళల్లో మార్పులు చేస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు భత్యం చెల్లిస్తాం. అలాగే పని ప్రదేశాల్లో మంచినీరు అందించడం కోసం కూలీల భత్యంలో రూ.5 అదనంగా చెల్లిస్తున్నాం. పని ప్రదేశాల్లో షామియానాలు, ప్రథమ చికిత్స కిట్లు ఏర్పాటు చేస్తున్నాం. 

Updated Date - 2020-03-13T11:47:26+05:30 IST