నేటితో ముగియనున్న పట్టణ ప్రగతి

ABN , First Publish Date - 2020-03-04T10:56:25+05:30 IST

నేటితో ముగియనున్న పట్టణ ప్రగతి

నేటితో ముగియనున్న పట్టణ ప్రగతి

 తొమ్మిది రోజుల కార్యక్రమాలపై నేడు సమీక్ష 

(ఆంధ్రజ్యోతి, మంచిర్యాల)
పట్టణ ప్రగతి కార్యక్రమం బుధవారంతో ముగియనుంది. పది రోజులపాటు పట్టణ ప్రగతి కార్యక్రమానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి, మంచిర్యాల, నస్పూర్‌, లక్షెట్టిపేట, చెన్నూర్‌, క్యాతనపల్లి మున్సిపాలిటీలలోని మొత్తం 182 వార్డులలో  పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం ప్లాస్టిక్‌ వాడకంపై అందరికి అవగాహన కల్పించడంతో పాటు తడి, పొడి చెత్తబుట్టల వాడకంపై పరిశీలన, అవగాహన కొనసాగింది. ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేయడం, మూత్ర శాలల కోసం స్థలం ఎంపిక, వార్డు కమిటీల సమావేశం, వార్డు అభివృద్ధి ప్రణాళికలను తయారు చేశారు.  కలెక్టర్‌ భారతి హొళికేరి, ఎమ్మెల్యేలు ఎన్‌. దివాకర్‌రావు,  దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్‌,  ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌ నేతతో పాటు జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి ఓదెలు,  జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ ఆయా మున్సిపాలిటీల కౌన్సిలర్లు, చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. తొమ్మిది రోజుల పట్టణ ప్రగతిపై  కలెక్టర్‌ ఆధ్వర్యంలో బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. పారిశుధ్యంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు.   డంప్‌యార్డులు, శ్మశాన వాటికలు, మూత్రశాలల కోసం స్థలాల ఎంపిక చేపట్టారు. మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా రూ.3.18 కోట్ల నిధులను కేటాయించగా ఇందులో మంచిర్యాలకు రూ.75.54 లక్షలు, నస్పూర్‌కు రూ.68.01 లక్షలు, బెల్లంపల్లికి రూ.47.89 లక్షలు, లక్షెట్టిపేటకు రూ.20.02 లక్షలు, మందమర్రికి రూ.48.85 లక్షలు, చెన్నూర్‌కు రూ.23.08 లక్షలు, క్యాతనపల్లికి రూ.34.93 లక్షలు నిధులను కేటాయించారు. నిధులను ఏ మేరకు ఖర్చు చేయడం జరిగిందనే విషయంపై  సమీక్ష జరగనున్నది. పలు వార్డులలో కలెక్టర్‌ పర్యటించి అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. వార్డుకొక ఇన్‌చార్జిని నియమించారు. రెండు రోజుల్లో 40 వేల మొక్కలను నాటాలని లక్షెట్టిపేట మున్సిపల్‌ అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మున్సిపాలిటీలలో ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేయని వారిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 

నేటి కార్యక్రమాలు...
పట్టణ ప్రగతి చివరి రోజు బుధవారం ప్రభుత్వ పథకాలను గోడలపై రాయడం, బొమ్మలు గీయడం, పందుల నిర్మూలన మీద విస్తృత ప్రణాళికలను సిద్ధం చేయడం, వార్డు కమిటీల సమావేశం ఏర్పాటు చేసి ప్రణాళిక తయారు చేస్తారు. ఏడు మున్సిపాలిటీలు 182 వార్డులలో జరిగిన పట్టణ ప్రగతిపై కలెక్టర్‌ భారతి హొళికేరి సమీక్ష జరపనున్నారు. 

Updated Date - 2020-03-04T10:56:25+05:30 IST