దిగులు తీరేనా?
ABN , First Publish Date - 2020-05-09T11:09:25+05:30 IST
నిర్మల్ జిల్లాలో పెద్ద ఎత్తున సాగు చేసిన పసుపు పంట కరోనా కారణంగా సంక్షోభంలో చిక్కుకుంది. గత 40 రోజుల
లాక్‌డౌన్‌తో మహరాష్ట్రలోని సాంగ్లీ, నిజామాబాద్‌లో నిలిచిపోయిన కొనుగోళ్లు
ఇప్పటికే 50శాతం అమ్ముకున్న రైతులు
ఫలించిన మంత్రి అల్లోల చొరవ
కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిన ఓ వ్యాపారి
ప్రస్తుతం తీరిపోనున్న కొనుగోలు సమస్య
అయినా ఇది తాత్కాలిక పరిష్కారమే అంటున్న రైతన్న
స్థానిక మార్కెట్‌లను అభివృద్ధి చేయాలని వినతి
నిర్మల్, మే 8 (ఆంధ్రజ్యోతి) : నిర్మల్ జిల్లాలో పెద్ద ఎత్తున సాగు చేసిన పసుపు పంట కరోనా కారణంగా సంక్షోభంలో చిక్కుకుంది. గత 40 రోజుల నుంచి పసుపు కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఆ పంటను పండించిన రైతులు తీవ్రంగా ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రతియేటా జిల్లాలో సాగు చేసిన పసుపు పంటను రైతులు మహారాష్ట్రలోని సాంగ్లీ తో పాటు నిజామాబాద్, జగిత్యాల్, ధర్మాబాద్ లాంటి ప్రాంతాలకు తీసుకువెళ్లి విక్రయిస్తుంటారు. అయితే ఇలా ఇప్పటికే 50శాతం మేరకు పంటను మహారాష్ట్రలోని సాంగ్లీతో పాటు నిజామాబాద్ మార్కెట్‌లకు తరలించి రైతులు ఆ పంటను అమ్ముకున్నారు.
స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడం, అలాగే ఇక్కడి వ్యాపారులు సైతం పసుపు పంట ను కొనుగోలు చేయకపోవడంతో వారు వ్యయ ప్రయాసల కోర్చి ఇతర ప్రాంతాల్లో పంటను విక్రయిస్తుంటారు. లేబర్, రవాణా చార్జీలు, అలాగే పొరుగు రాష్ర్టాల్లోని వ్యాపారుల చేతివాటంతో పసుపు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే పసుపుపంట కొనుగోళ్లు కొనసాగుతుండగా కరోనాసంక్షోభం తలెత్తడంతో రైతాంగం ఉక్కిరిబిక్కిరయ్యింది. స్థానికంగా కొనుగోలు సౌకర్యం లేకపోవడం, అలాగే పసుపుపంటను నిల్వ చేసే గోదాంలు అందుబాటులో లేని కారణంగా వారు ఆ పంటనంతా అతి భద్రంగా భద్రపర్చుకోవాల్సి వచ్చింది. కొంత మంది మాత్రం ఆర్మూర్, జగిత్యాల్ లాంటి ప్రదేశాల్లో ఉన్న కోల్డ్ స్టోరేజీల్లో పసుపుపంటను భద్రపర్చుకున్నారు. సాధారణ రైతులు మాత్రం కోల్డ్‌స్టోరేజీల వ్యయాన్ని భరించలేక తమ ఇండ్లలోనే నిల్వ చేసుకోవాల్సి వచ్చింది.
పెట్టిన పెట్టుబడుల కోసం చేసిన అప్పులభారం పెరిగిపోతుండడం, మార్కెట్ సౌకర్యం గల మహారాష్ట్రలోని సాంగ్లీలో లాక్‌డౌన్ కొనసాగుతున్నందున పసుపు రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. అయితే స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి పసుపు పంట కొనుగోలు విషయాన్ని వివరించారు. కొనుగోలు సమస్యను పరిష్కరించాలని వారు మంత్రిని కోరారు. దీంతో మంత్రి రంగంలోకి దిగి సమస్య పరిష్కారానికి పలువురు వ్యాపారులతో చర్చించారు. స్థానికంగా జిన్నింగ్ వ్యాపారం చేసే పడిగెల కేధార్‌నాథ్ మంత్రి చేసిన సూచనకు అంగీకరించారు. పసుపు కొమ్ము క్వింటాల్‌కు రూ. 4700 , అలాగే మండ క్వింటాల్‌కు రూ. 4500 చెల్లిస్తానని తూకంలో గాని, నాణ్యత పేరిటా గాని రైతులను ఇబ్బందులకు గురి చేయనంటూ ఆయన బహిరంగంగా ప్రకటించారు. 23వేల ఎకరాల్లో పసుపు పంట సాగు జిల్లా వ్యాప్తంగా రైతులు 23వేల ఎకరాల్లో ఈ సారి పసుపు పంటను సాగు చేశారు.
మొత్తం 4 లక్షల 60 వేల క్వింటాళ్ల పసుపు దిగుబడిని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే రైతులు ఇందులో నుంచి లాక్‌డౌన్‌కు ముందుగానే 50శాతం మేరకు పంటను విక్రయించారు. అలాగే మరికొంతమంది రైతులు నిజామాబాద్ , ఆర్మూర్‌లలోని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచుకున్నారు. కొంతమంది మేట్‌పల్లి మార్కెట్‌కు కూడా తరలించి అమ్ముకున్నారు. అయితే లాక్‌డౌన్‌తో రవాణా వ్యవస్థ స్థంభించిపోవడం , పంట కొనుగోలు ప్రక్రియ నిలిచిపోవడంతో పసుపు రైతులు ఒక్కసారిగా కష్టాల పాలయ్యారు. పసుపు పంట కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఎకరానికి దాదాపు 20 క్వింటాళ్ళ పసుపు దిగుబడి వస్తుంటుంది. ప్రకృతి వైఫరీత్యం , సాగునీరు అందనట్లయితే దిగుబడులు తగ్గే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఈ సారి దిగుబడి పెరిగినప్పటికీ కరోనా కారణంగా కొనుగోలు జరగక రైతులు నష్టాల పాలయ్యారు.
అభివృద్ధి చెందని స్థానిక మార్కెట్‌లు
దక్షిణ భారతదేశంలో తమిళనాడులో ఈరోడ్, కర్నాటకలోని మైసూరు, ఆంధ్రప్రదేశ్‌లోని దుగ్గిరాల, మహారాష్ట్రలోని సాంగ్లీ, ధర్మాబాద్ మార్కెట్‌లు బాగా అభివృద్ధి చెందాయి. అయితే తెలంగాణాలో నిజామాబాద్, హైదరాబాద్, జగిత్యాల్, వికారాబాద్ మార్కెట్‌లు ఉన్నప్పటికీ పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమవుతున్నాయి. పసుపు ఆధారిత పరిశ్రమలు స్థానికంగా అభివృద్ధి చెందకపోవడం, పసుపుబోర్డు లేకపోవడం వల్ల రైతులకు మార్కెట్ సౌకర్యం, గిట్టుబాటు ధర కొరవడుతున్నాయి.
మన రాష్ట్రంలో వాడుతున్న కుంకుమ పసుపు ఆధారంగా తయారు కావడంలేదు. తమిళనాడు, కర్నాటకలలో పసుపు ద్వారా తయారు చేసిన కుంకుమనే స్థానికంగా తయారు చేసి విక్రయిస్తారు. రాష్ట్రంలోకి వచ్చే కుంకుమ కూడా ఎక్కువ శాతం ఇతర రాష్ట్రాల నుంచే వస్తోంది. పసుపుపొడి తయారు చేసి మార్కెటింగ్ చేసే సంస్థలు కూడా స్థానికంగా పండే పసుపునకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఽరైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు.