ఆ రోజు గూగుల్‌కు ఏమైంది?

ABN , First Publish Date - 2020-12-20T02:08:00+05:30 IST

గత సోమవారం ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. గూగుల్ కీలక సేవలైన జీమెయిల్, యూట్యూబ్

ఆ రోజు గూగుల్‌కు ఏమైంది?

న్యూఢిల్లీ: గత సోమవారం ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. గూగుల్ కీలక సేవలైన జీమెయిల్, యూట్యూబ్ వంటివి ఒక్కసారిగా ఆగిపోవడంతో ఏం జరిగిందో తెలియక యూజర్లు అల్లాడిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య తలెత్తింది. 47 నిమిషాల తర్వాత సేవలు గూగుల్ తిరిగి అందుబాటులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఆ 47 నిమిషాల్లో ఏం జరిగిందనేది ఎవరికీ అంతుబట్టకుండా పోయింది. తాజాగా ఆ మిస్టరీ బయటకు వచ్చింది. 


గూగుల్‌లో లాగిన్ అయిన వినియోగదారులను ధ్రువీకరించేందుకు, ట్రాక్ చేసేందుకు దాని మాతృసంస్థ అల్ఫాబెట్ ఇంక్ వద్ద బోల్డన్ని టూల్స్ ఉంటాయి. ఈ ఏడాది అక్టోబరులో ఈ టూల్స్‌ను కొత్త పైల్ స్టోరేజీ సిస్టంలోకి మార్చడం మొదలుపెట్టింది. ఈ ప్రక్రియలో డేటా భాగాలను తప్పుగా నివేదించింది. ఫలితంగా గూగుల్ అందిస్తున్న పలు సర్వీసులకు సోమవారం ఉదయం 47 నిమిషాలపాటు అంతరాయం కలిగింది. ఇలా జరగడం చాలా అరుదని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.


సైబర్ సెక్యూరిటీ ముప్పు వార్తల నేపథ్యంలో గూగుల్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ సోలార్‌విండ్స్ కార్ప్ హ్యాక్‌కు గురైంది. ఫలితంగా మైక్రోసాఫ్ట్ సహా అమెరికా ప్రభుత్వ ఏజెన్సీలపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే గూగుల్ సోమవారం నాటి ఘటన వెనక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించింది. సోలార్‌విండ్స్ హ్యాకింగ్‌ ప్రభావం అల్ఫాబెట్ పైన కానీ, గూగుల్ సిస్టమ్స్‌పైన కానీ పడినట్టు ఎటువంటి ఆధారాలు లేవని గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.


సోమవారం సేవల్లో జరిగిన అంతరాయం కారణంగా గూగుల్ క్లౌడ్ స్టోరేజ్‌కు పంపిన దాదాపు 15 శాతం అభ్యర్థనలు దెబ్బతిన్నట్టు కంపెనీ తెలిపింది. కాగా, జీమెయిల్ సేవల్లో మంగళవారం మళ్లీ సమస్య తలెత్తింది. డేటా మైగ్రేషన్‌లో సమస్య వల్లే ఇలా జరిగిందని గూగుల్ పేర్కొంది. 


Read more