వాయిస్‌ ఓవర్‌ ఐపి కాల్స్‌ ఇలా మాట్లాడొచ్చు!

ABN , First Publish Date - 2020-10-24T07:12:05+05:30 IST

ఇటీవల కాలంలో చాలా మంది మామూలు ఫోన్‌ కాల్స్‌ బదులుగా ‘వాయిస్‌ ఓవర్‌ ఐపి’ అప్లికేషన్స్‌ ఉపయోగించి మాట్లాడుతున్నారు. ఉదాహరణకు ఇటీవల కిడ్నాప్‌ కేసులో నిందితుడు ‘డింగ్‌టోన్‌’ అనే వాయిస్‌ ఓవర్‌ ఐపి మొబైల్‌ అప్లికేషన్‌ అధారంగా ఫోన్‌ కాల్స్‌ చేశాడు...

వాయిస్‌ ఓవర్‌ ఐపి కాల్స్‌  ఇలా మాట్లాడొచ్చు!

ఇటీవల కాలంలో చాలా మంది మామూలు ఫోన్‌ కాల్స్‌ బదులుగా ‘వాయిస్‌ ఓవర్‌ ఐపి’ అప్లికేషన్స్‌ ఉపయోగించి మాట్లాడుతున్నారు.   ఉదాహరణకు ఇటీవల కిడ్నాప్‌ కేసులో నిందితుడు ‘డింగ్‌టోన్‌’ అనే  వాయిస్‌ ఓవర్‌ ఐపి మొబైల్‌ అప్లికేషన్‌ అధారంగా ఫోన్‌ కాల్స్‌ చేశాడు. ఇంతకీ ఈ టెక్నాలజీ ఏమిటో వివరంగా పరిశీలిద్దాం.


మామూలు ఫోన్‌ కాల్స్‌లో మనం మాట్లాడే శబ్దాలు అనలాగ్‌ ఆడియో సిగ్నల్స్‌ రూపంలో ప్రసారం అవుతూ ఉంటాయి. గమ్యాన్ని చేరుకున్న తరవాత అవి తిరిగి శబ్ద రూపంలో అవతలి వ్యక్తికి వినిపిస్తాయి. అయితే వాయిస్‌ ఓవర్‌ ఐపి టెక్నాలజీలో అనలాగ్‌ రూపంలో ఉండే ఆడియో డేటా మొత్తం డిజిటల్‌ రూపంలోకి మారి ఇంటర్నెట్‌ ఆధారంగా గమ్యాన్ని చేరుకుంటుంది. ఇక్కడ మరో విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈ మధ్య కాలంలో మనం వాడుతున్న ‘వాయిస్‌ ఓవర్‌ ఎల్టీఈ’ టెక్నాలజీ కూడా మనం మాట్లాడే మాటలను డిజిటల్‌ డేటాగా మార్చి ప్రసారం చేస్తుంది. మన సంభాషణలు అన్నీ 4G LTE  మొబైల్‌ నెట్‌వర్క్‌ ద్వారా ప్రసారం అవుతాయి. అయితే రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ వంటి సంప్రదాయ టెలికాం సంస్థలు ఈ VoLTE సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అందుకే ఈ కాల్స్‌ మధ్యలో మొబైల్‌ టవర్‌ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే VoIP కాల్స్‌ విషయంలో మాత్రం ఒకవేళ కమ్యూనికేషన్‌ VoIP ప్రోటోకాల్‌ వాడుతున్న రెండు డివైస్‌ మధ్య జరుగుతున్నప్పుడు మధ్యలో ఏమాత్రం మొబైల్‌ టవర్ల, సంప్రదాయ  మొబైల్‌ నెట్‌వర్క్‌ల అవసరం కలుగదు. దీనికి చక్కని ఉదాహరణగా మనం అనునిత్యం చేసుకునే వాట్సాప్‌ కాల్స్‌ని చెప్పుకోవచ్చు. వాట్సాప్‌ కూడా VoIP టెక్నాలజీ ఆధారంగానే ఒక డివైస్‌ నుంచి మరో డివైస్‌కి తన అప్లికేషన్‌ ఆధారంగా కాల్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తుంది. VoIP కాల్స్‌ కొన్ని సందర్భాల్లో ఒక అప్లికేషన్‌ నుంచి ప్రారంభమై డిజిటల్‌ డేటాగా SIP సర్వర్‌ (సెషన్‌ ఇనీషియేషన్‌ ప్రొటోకాల్‌) ద్వారా రూట్‌ అవుతుంది. ఎవరికైతే ఫోన్‌ చేస్తున్నారో ఆ వ్యక్తి మామూలు మొబైల్‌ నెట్వర్క్‌ వాడుతున్నట్లయితే, సంప్రదాయ టెలికం నెట్వర్క్‌లకు రూట్‌ అవుతుంది. అంటే పైన మనం చూసిన ఉదాహరణలో వరంగల్‌ నిందితుడు డింగ్‌టోన్‌ అనే VoIP యాప్‌ ఉపయోగించాడు. దానిద్వారా మామూలు మొబైల్‌ నెంబర్‌కి కాల్‌ చేశాడు. ఈ సందర్భంలో వాయిస్‌ ఓవర్‌ ఐపి గేట్‌వేల ద్వారా ఓ ఐపి నెట్‌వర్క్‌కి PSTN (పబ్లిక్‌ స్విచ్డ్‌ టెలిఫోన్‌ నెట్వర్క్‌)కి మధ్య అనుసంధానం ఏర్పాటై ఉంటుంది. 


యాప్స్‌ ఇలా!

స్కైప్‌, వాట్సాప్‌, టెలిగ్రామ్‌, లైన్‌ మెసెంజర్‌, సిగ్నల్స్‌ వంటి అన్ని రకాల వాయిస్‌ ఓవర్‌ ఐపి అప్లికేషన్స్‌ ఇంతకు ముందు చెప్పిన ‘సిప్‌ ప్రొటోకాల్‌’ ఆధారంగా పనిచేస్తాయి. సదరు అప్లికేషన్‌ ఉన్న ఏ మొబైల్‌ ఫోన్‌, కంప్యూటర్‌ అయినా నెట్‌వర్క్‌లో ఎండ్‌ పాయింట్‌గా రిజిస్టర్‌ చేసుకుని ఇంటర్నెట్‌ ఆధారంగా ఫోన్‌ కాల్స్‌ చేసుకునే సదుపాయం పొందుతుంది. సంప్రదాయ టెలిఫోన్‌ నెట్‌వర్క్‌ల ద్వారా మనకు ఫోన్‌ కాల్‌ వచ్చినప్పుడు కాలర్‌ ఐడిలో సంబంధిత మొబైల్‌ నెంబర్‌ కనిపిస్తుంది. ఆ మొబైల్‌ నెంబర్‌ కచ్చితంగా కాల్‌ చేసిన వ్యక్తిదై ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో కాల్‌ స్ఫూఫింగ్‌ టెక్నిక్స్‌ ద్వారా కాలర్‌ ఐడీ స్ర్కీన్‌లో వేరే నెంబర్‌ కనిపించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు అనుకోండి. అయితే VoIP ద్వారా ఏదైనా దేశంలోని నెంబర్‌కి కాల్‌ చేసినప్పుడు, ఆ దేశానికి సంబంధించి ఆ VoIP సంస్థ స్వాధీనంలో ఉన్న కొన్ని వేర్వేరు నెంబర్లు కాల్‌ రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి స్ర్కీన్‌ మీద కనిపిస్తాయి. ఆ నెంబర్‌ ఆధారంగా సైబర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ చేయడం కొద్దిగా కష్టం.
పోలీసులు ఎలా ఇన్వెస్టిగేట్‌ చేస్తారు?

వాయిస్‌ ఓవర్‌ ఐపి కాల్స్‌ మాటున నేరస్తుడు దాక్కుని ఉంటే అనేక కోణాల్లో పోలీస్‌ విభాగం విచారణ చేపడుతుంది. ముఖ్యంగా ప్రముఖ వాయిస్‌ ఓవర్‌ ఐపి అప్లికేషన్స్‌, నెట్‌వర్క్‌లను గుర్తించి వాటితో అధికారికంగా సంప్రదింపులు జరుపుతాయి. ఆ అప్లికేషన్లలో మన దేశంలో ఒక నిర్దిష్టమైన నెంబర్‌కి, ప్రాంతానికి చేసిన కాల్స్‌ని ఆయా సంస్థల వద్ద ఉండే డేటాబేస్‌లో వెదికి, ఆ కాల్స్‌ ఏ యూజర్‌ చేశాడు అన్నది తెలుసుకుని, అతని రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌, ఐపీ అడ్రస్‌ వంటి ఇతర కీలకమైన వివరాలను సేకరిస్తారు. మామూలు ఫోన్‌ నెంబర్ల నుంచి నేరస్తుడు కాల్‌ చేసినప్పుడు ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో వంటి టెలికామ్‌ సంస్థల నుంచి సిడిఆర్‌  (కాల్‌ డీటైల్‌ రికార్డ్స్‌), కాల్‌ హిస్టరీలను ఎక్సెల్‌ షీట్‌లో తెప్పించుకుని వాటిని విశ్లేషించడం ద్వారా నేరస్తుడిని పట్టుకుంటారు. ఇటీవల కాలంలో ఈ సిడిఆర్‌ డేటాని ఎక్సెల్‌ ఫార్మేట్‌తో కుస్తీ పడాల్సిన పని లేకుండా చాలా సులభంగా విశ్లేషించే కొన్ని శక్తిమంతమైన టూల్స్‌ కూడా వచ్చాయి. నేర పరిశోధన మరింత వేగవంతంగా జరగటానికి ఇది ఉపయోగపడుతుంది.

 

ఈ అంశాలు కీలకం

సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఒక నేరం జరిగిన తరవాత -  దానికి సంబంధించిన స్వరూపాన్ని, అందులో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మొదట అర్థం చేసుకోవాలి. సాధ్యమైనన్ని ఎక్కువ ఆధారాలు సేకరించాలి. నేరంలో పరోక్షంగా ఉపయోగించిన క్లౌడ్‌ ఆధారిత, ఆఫ్‌లైన్‌ అప్లికేషన్లని, హార్డ్‌డిస్కులు, ఫోన్లు, ఇతర సర్వీసులను విశ్లేషించాలి. వెబ్‌ సర్వీసుల నుంచి అవసరమైన సమాచారాన్ని పొంది నేరాన్ని చేధించడం కచ్చితంగా అతి పెద్ద సవాలు. అధికశాతం వెబ్‌ సర్వీసులు, సోషల్‌ మీడియా సంస్థలు యుఎస్‌లో, వాయిస్‌ ఓవర్‌ ఐపి సంస్థలు యుఎస్‌లో సర్వర్లని కలిగి ఉన్నాయి. దీంతో పనివేళలు వేరు వేరుగా ఉండటం, సకాలంలో సమాచారం అందక పోవడం, కొన్ని సందర్భాల్లో సదరు సంస్థలు చాలా ఆలస్యంగా స్పందించటం, ఇంకొన్నిసార్లు అసలు నేర పరిశోధన సంస్థల ఆదేశాలను ఖాతరు చేయకపోవడం వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. దీనికి పరిష్కారంగా ఇటీవల వివిధ దేశాలు టెక్నాలజీ సంస్థల మీద ఎన్ర్కిప్షన్‌ విధానం, ఇతర అంశాల విషయంలో మరింత ఒత్తిడి తీసుకురావడానికి ఓ కూటమిగా ఏర్పడ్డాయి. నేర పరిశోధనకు ఉపకరించేలా టెక్నాలజీ వనరులను కొంతమేరకు సరళతరం చేయాలని ఆయా దేశాలు వివిధ టెక్నాలజీ కంపెనీలపై ఒత్తిడి తీసుకురాబోతున్నాయి. ఆ కూటమిలో భారతదేశం కూడా తన వాణిని విన్పిస్తోంది. ఈ ప్రయత్నాలు సఫలీకృతమైతే సైబర్‌ నేరాలకు మెరుగైన పరిష్కారం లభిస్తుంది. సైబర్‌ నేరాల ఇన్వెస్టిగేషన్‌ వేగవంతమవుతుంది.


కాల్‌ స్ఫూఫింగ్‌ కూడా!

కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన కాల్‌ స్ఫూఫింగ్‌ అప్లికేషన్స్‌ వాడటం ద్వారా తమ అసలు నెంబర్‌ కనిపించదు. వేరే నెంబర్లు కాలర్‌ ఐడిలో కనిపించే విధంగా నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిని గుర్తించే వ్యవస్థ కూడా సైబర్‌ క్రైమ్‌ విభాగం దగ్గర ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో నేరస్తుడి ఆనవాళ్ళు కనుగొనే లోపలే ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు. మరోవైపు ఇటీవల వస్తున్న మెషిన్‌ లెర్నింగ్‌ ప్రాజెక్టులను ఆసరాగా చేసుకుంటున్నారు. కావలసిన వ్యక్తి వాయిస్‌ ఆధారంగా మెషిన్‌ లెర్నింగ్‌ మోడల్‌ తయారు చేసుకుని, నేరాలు చేసే  సమయంలో అవతలి వ్యక్తికి అదే వాయిస్‌ వినిపిస్తూ కూడా నేరాలు చేస్తున్నారు. ఇది కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఇలాంటి వాటిని కూడా విశ్లేషించి నేరస్తులను పట్టుకునే విధానం ఫోరెన్సిక్‌ విభాగం దగ్గర ఉంటుంది. 


-నల్లమోతు శ్రీధర్

fb.com/nallamothusridhar

Updated Date - 2020-10-24T07:12:05+05:30 IST