చైనా స్టోర్ నుంచి 29,800 యాప్‌లను తొలగించిన యాపిల్!
ABN , First Publish Date - 2020-08-01T23:59:23+05:30 IST
చైనీస్ యాప్‌స్టోర్ నుంచి శనివారం యాపిల్ ఇంక్ ఏకంగా 29,800 యాప్‌లను తొలగించింది. వీటిలో 26

న్యూఢిల్లీ: చైనీస్ యాప్‌స్టోర్ నుంచి శనివారం యాపిల్ ఇంక్ ఏకంగా 29,800 యాప్‌లను తొలగించింది. వీటిలో 26 వేలకుపైగా గేమ్స్ ఉన్నట్టు రీసెర్చ్ సంస్థ కీమై తెలిపింది. లైసెన్స్ లేని గేమ్స్‌పై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో వీటి తొలగింపు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇన్-యాప్ పర్చేజ్‌ల కోసం వినియోగదారులు వీలు కల్పించాలంటే జూన్ నెల చివరి నాటికి ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్ నంబరును సమర్పించాలంటూ ఈ ఏడాది మొదట్లో గేమ్ పబ్లిషర్లకు ఆపిల్ గడువు విధించింది. చైనా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ చాలా కాలంగా ఈ నిబంధనలు పాటిస్తున్నా, యాపిల్ ఈ ఏడాదే ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తోందన్న విషయం తెలియరాలేదు.
జులై మొదటి వారంలో యాపిల్ 2500కుపైగా టైటిల్స్‌ను యాప్‌స్టోర్ నుంచి తొలగించింది. వీటిలో జింగ్యా, సూపర్‌సెల్ వంటివి కూడా ఉన్నాయి. సున్నితమైన కంటెంట్‌ను తొలగించేందుకు చైనా ప్రభుత్వం తన గేమింగ్ పరిశ్రమపై కఠినమైన నిబంధనలను అమలు చేయాలని చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. ఇన్-యాప్ కొనుగోళ్ల కోసం ఆమోద ప్రక్రియకు ఎదురుచూడడం గేమ్స్‌కు చాలా సుదీర్ఘ, సంక్లిష్టమైన ప్రక్రియ. పెద్ద పెద్ద గేమ్ డెవలపర్లకు తప్ప ఇది అందరినీ ఇబ్బందులకు గురిచేస్తుందని పరిశ్రమకు చెందిన వ్యక్తులు చెబుతున్నారు.
"ఇది చిన్న, మధ్య తరహా డెవలపర్ల ఆదాయాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అయితే, వ్యాపార లైసెన్స్‌ను పొందడంలో ఇబ్బందులు ఉన్నందున, ఇది చైనాలోని మొత్తం ఐఓఎస్ గేమ్ పరిశ్రమకు వినాశకరమైనది" అని చైనాలోని యాపిల్ ఇంక్ మార్కెంటింగ్ మేనేజర్ టాడ్ కుహ్న్ అభిప్రాయపడ్డారు.