‘ఎప్పటికైనా జైలు పాలవ్వాలి‘ ఇదే ఆ మహిళ కోరిక, దీంతో ఆమె..

ABN , First Publish Date - 2020-03-08T21:31:24+05:30 IST

ఒక్క రోజు.. కనీసం ఒక్క రోజైనా జైల్లో గడపాలి.. ఇదే ఆమెకున్న బలమైన కోరిక. యవ్వనంలో ఈ అభిలాష నెరవేరనప్పటికీ వృద్ధాప్యంలో ఆమె.. తను అనుకున్నది సాధించుకుంది.

‘ఎప్పటికైనా జైలు పాలవ్వాలి‘ ఇదే ఆ మహిళ కోరిక, దీంతో ఆమె..

నార్త్‌ కెరొలైనా: ఒక్క రోజు.. కనీసం ఒక్క రోజైనా జైల్లో గడపాలి.. ఇదే ఆమెకున్న బలమైన కోరిక. యవ్వనంలో ఈ అభిలాష నెరవేరనప్పటికీ వృద్ధాప్యంలో ఆమె.. తను అనుకున్నది సాధించుకుంది. ఇటీవల జరిగిన తన నూరో పుట్టిన రోజు సందర్భంగా ఆమె జైలు పాలైంది. ప్రస్తుతం స్థానికంగా సంచలనం సృష్టింస్తున్న ఆ వృద్ధురాలి పేరు రూత్ బ్రయాంట్.


పూర్తి వివరాల్లోకి వెళితే.. నార్త్ కెరోలినాకు(అమెరికా) చెందిన రూత్ ఓ వృద్ధాశ్రమంలో నివసిస్తుంటుంది. ఇటీవల ఓ రోజు రూత్ తన మనసులో మాటను బయటపెట్టింది. ఆమె కోరిక గురించి తెలుసుకున్న పర్సన్ కౌంటీ పోలీసులు.. రూత్ అభిలాష నెరవేర్చేందుకు ఆమె నూరో పుట్టిన రోజును ఎంచుకున్నారు.  ఆ రోజు.. రెండు పోలీసు కార్లలో పోలీసుల బృందం వృద్ధాశ్రమానికి చేరుకుంది. నలుగురు పోలీసులు.. వడివడిగా నడుచుకుంటూ ఆమె ఉన్న గదికి వెళ్లారు.


‘రూత్.. నలుగురిలో అసభ్యకరంగా ప్రవర్తించిన నేరంపై నిన్ను అరెస్టు చేస్తున్నాం. నీకు మౌనంగా ఉండే హక్కు ఉంది. నీవు చెప్పే విషయాల్ని కోర్టులో సాక్ష్యాలుగా వినిగించే హక్కు మాకుందని మర్చిపోకు’ అంటూ అమె చేతికి బేడీలు వేశారు. ఆమెను వృద్దాశ్రమం వెలుపలకు తీసుకొచ్చారు. రూత్ కూడా అచ్చు నిజమైన నేరస్తురాలిలాగానే నటిస్తూ అరెస్టును ప్రతిఘటించింది. సరదాగా పోలీసులను కాలితో తన్నింది. కేవ్వు మని అరిచాడో పోలీసు. ‘వద్దు.. నేను తట్టుకోలేను. నాకు ఓ కాలు సరిగా పనిచేయట్లేదు’ అంటూ ఓ ఫన్నీ కామెంట్ చేశాడు. హాహా.. నాకు రెండు కాళ్లూ సరిగా పనిచేయట్లేదు’ అంటూ రూత్ అదే స్థాయిలో రిటార్టించింది.


ఆ తరువాత ఆమెను కారులో కూర్చోపెట్టి జైలుకు తరలించారు. అక్కడ నిబంధన ప్రకారం ఆమె వివరాలు తీసుకున్నారు. ఆమె ఫోటోతో పాటూ ఈ వివరాలను పోలీసు రికార్డుల్లో చేర్చారు. ఆ తరువాత ఆమెను సెల్‌లోకి నిర్భంధించారు. అసలైనా నేరస్తుల విషయంలో ఎలా జరుగుతుందో రూత్ విషయంలోన అలాగే జిరిగేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇదంతా చూసిన రూత్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ‘వావ్.. ఎట్టకేలకు నేను జైలుపాలయ్యా’ అంటూ ఆమె ఉబ్బితబ్బిబైపోయింది. కొద్ది క్షణాల తరువాత పోలీసులు ఆమెను విడుదల చేశారు. జీవిత చరమాంకంలోనైనా తన కోరిక తీరినందుకు రూత్ తృప్తిగా వృద్ధాశ్రమానికి తిరుగు ప్రాయాణమైంది. అక్కడ కూడా తన స్నేహితులతో జరిగిదంతా చెబుతూ ఆ మధుర క్షణాలన్ని మరోసారి నెమరేసుకుంది. 

Updated Date - 2020-03-08T21:31:24+05:30 IST