ఐదేళ్ల క్రితం ఆన్‌లైన్ కోచింగ్ షురూ...ఏడాదికి కోటి రూపాయల టర్న్ఓవర్!

ABN , First Publish Date - 2020-12-28T15:05:54+05:30 IST

చదువు పూర్తిచేసుకున్న విద్యార్థులు వివిధ పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతుంటారు. ఇందుకోసం...

ఐదేళ్ల క్రితం ఆన్‌లైన్ కోచింగ్ షురూ...ఏడాదికి కోటి రూపాయల టర్న్ఓవర్!

తిరువనంతపురం: చదువు పూర్తిచేసుకున్న విద్యార్థులు వివిధ పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతుంటారు. ఇందుకోసం కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. కేరళకు చెందిన ఆశా బినీష్ వివిధ పోటీ పరీక్షలకు ఆన్ లైన్‌లో శిక్షణ అందిస్తూ, మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఇద్దరు విద్యార్థులతో ప్రారంభమైన ఈ ఆన్‌లైన్ కోచింగ్‌లో ప్రస్తుతం ఐదు వేల మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఆమె నిర్వహిస్తున్న యూట్యూబ్ చానల్‌కు 2.5 లక్షలకు మించిన సబ్‌స్క్రై‌బర్లు ఉన్నారు. ఆమె ఈ ఆన్‌లైన్ కోచింగ్ ద్వారా ఏడాదికి కోటి రూపాయలకుపైగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.


34 ఏళ్ల ఆశ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. 2006లో ఇంజినీరింగ్ పూర్తి చేశాక ఆమె ఒక కంపెనీలో కొన్నేళ్లు పనిచేశారు. వివాహమై కుమారుడు పుట్టాక ఉద్యోగం వదిలివేయాల్సి వచ్చింది. అప్పటి తన అనుభవాలను ఆమె వివరిస్తూ... ఇంట్లో ఉంటూ ఏదో ఒక క్రియేటివ్ వర్క్ చేసేదానిని. ఈ నేపధ్యంలోనే కొన్ని విద్యా సంబంధిత వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను. రెండు మూడు వీడియోలకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఆ తరువాత అప్‌లోడ్ చేసిన వీడియోలకు మంచి ఆదరణ దక్కింది. కొంతమంది ఫోన్ చేసి ఆన్‌లైన్ క్లాసులు చెబితే బాగుంటుందని సలహాలిచ్చారు. దీంతో ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించానని తెలిపారు. ఆశా కొత్త తరహాలో ట్యూషన్ చెబుతుండటంతో విద్యార్థులకు ఆయా సబ్జెక్టులపై అవగాహన ఏర్పడేది. ఈ నేపధ్యంలో కొందరు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తూ వచ్చారు. ఇంతలో ఆశా బ్యాంకింగ్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. అయితే పోస్టింగ్ వేరే ప్రాంతంలో రావడంతో ఆమె ఆ ఉద్యోగాన్ని వదులుకుని, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు సిద్ధమయ్యే అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 2016లో కాంపిటీటివ్ క్రాకర్ పేరుతో ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించారు. ఇందుకోసం ల్యాప్‌టాప్,  ఇతర పరికరాలు కొనుగోలు చేసేందుకు ఆశా రూ. 35 వేల వరకూ ఖర్చు చేశారు. కేరళలోని ఎర్నాకులం కేంద్రంగా ఆమె ఆన్‌లైన్ కోచింగ్ ప్రారంభించారు. ఆమె క్లాసులు నిర్వహించే తీరు బాగుండటంతో విద్యార్థుల సంఖ్య మరింతగా పెరుగుతూ వచ్చింది. దీనికితోడు కరోనా కాలంలో విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులపై మొగ్గు చూపడం కాంపిటీటివ్ క్రాకర్‌కు కలసి‌ వచ్చింది. 


Updated Date - 2020-12-28T15:05:54+05:30 IST