-
-
Home » Prathyekam » Vice President Venkaiah Naidu Hails Bjd Mla Of Odisha Who Devotes His Two Months To Farming Every Year
-
వ్యవసాయానికి ఏడాదిలో రెండు నెలలు కేటాయిస్తున్న ఎమ్మెల్యే!
ABN , First Publish Date - 2020-08-20T12:59:42+05:30 IST
ఒడిశాకు చెందిన బీజేడీ ఎమ్మెల్యే మనోహర్ రంధారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రశంసించారు. ఈ ఎమ్మెల్యే తన పొలాన్ని స్వయంగా దున్ని, కూలీలతో కలసి...

భువనేశ్వర్: ఒడిశాకు చెందిన బీజేడీ ఎమ్మెల్యే మనోహర్ రంధారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రశంసించారు. ఈ ఎమ్మెల్యే తన పొలాన్ని స్వయంగా దున్ని, కూలీలతో కలసి వరి నాటారు. ఈ విషయం తెలుసుకున్న ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి ఆ ఎమ్మెల్యేకు వ్యవసాయంపై గల అంకితభావాన్ని చూసి, ఎంతగానో మెచ్చుకున్నారు. మనోహర్ నవరంగపూర్ జిల్లాలోని దబుగావ్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేస్తూ... స్ఫూర్తిదాయకం... ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే మనోహర్ రంధారి సంవత్సరంలో రెండు నెలలు వ్యవసాయం కోసం కేటాయిస్తున్నారు. యువత పొలాల్లో పనిచేయడానికి వెనుకాడకూడదని, సిగ్గుపడకూడదని... పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి ట్వీట్‌ను కోట్‌చేస్తూ, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇలా ట్వీట్ చేశారు... ఎమ్మెల్యే మనోహర్ రంధారి ఒక ఉదాహరణగా మన ముందున్నారు. వ్యవసాయంపై ఆయనకు ఉన్న అంకితభావం అభినందనీయం.... అని పేర్కొన్నారు. కాగా ఎమ్మెల్యే మనోహర్ తన భార్యతో పాటు ఉదయం 5 గంటలకు పొలంలో పనిచేయడం ప్రారంభిస్తారు. అతని భార్య ప్రభుత్వ ఉద్యోగి. పది గంటలకు ఆమె కార్యాలయానికి బయలుదేరుతారు. ఈ ఎమ్మెల్యే మధ్యాహ్నం వరకు తమ పొలాల్లో పని చేస్తుంటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా మారకముందు నుంచే వ్యవసాయం చేసేవాడినని. తండ్రి కన్నుమూశాక వ్యసాయ బాధ్యతలను తానే చూసుకుంటున్నానని తెలిపారు. తాను రాజకీయ నాయకుడినైనప్పటికీ, వ్యవసాయం తన వృత్తి అని, ఇదే తన ఆదాయ వనరు అని తెలిపారు. నవరంగ్‌పూర్ జిల్లాలోని మజిగుడ గ్రామంలో ప్రతి సంవత్సరం రెండు నెలల పాటు వ్యవసాయం చేస్తుంటానని ఎమ్మెల్యే తెలిపారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో వ్యవసాయం మాత్రమే చాలామందికి ఉపాధితో పాటు ఆహారం అందిస్తున్నదని ఆయన అన్నారు. అందుకే యువత వ్యవసాయంపై దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.