అంత ప్రేమను భరించలేను.. నా భర్త నుంచి విడాకులిప్పించండి: కోర్టుకెక్కిన భార్య
ABN , First Publish Date - 2020-08-23T01:13:04+05:30 IST
భర్త తనపై కురిపించే ప్రేమను భరించలేని ఓ భార్య కోర్టుకెక్కింది. అతడి అతి ప్రేమ వల్ల ఒక్కసారి కూడా గొడవ పడే
లక్నో: భర్త తనపై కురిపించే ప్రేమను భరించలేని ఓ భార్య కోర్టుకెక్కింది. అతడి అతి ప్రేమ వల్ల ఒక్కసారి కూడా గొడవ పడే అవకాశం రాలేదని, అంత ప్రేమను భరించడం తన వల్ల కాదని, కాబట్టి విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది. ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో జరిగిందీ ఘటన. గత 18 నెలలుగా భర్తతో ఒక్కసారి కూడా గొడవ పడలేకపోయానని, దీంతో తాను విసుగు చెందానని పిటిషన్‌లో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఇంటి పనులతోపాటు, వంటపనిలోనూ తన భర్త తనకు సాయం చేస్తున్నాడని, అతడు తనను ఎప్పుడూ కోప్పడలేదని, తనపై ఎప్పుడూ విసుగు ప్రదర్శించలేదని పేర్కొంది. ఈ వాతావరణం తనను ఊపిరాడనివ్వకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. తానెప్పుడైనా తప్పుచేస్తే క్షమించేస్తాడని, కానీ తనకు మాత్రం అతడితో వాదనకు దిగాలని ఉంటుందని పేర్కొంది. ప్రతీదానిని అంగీకరించే భర్త ఉండే జీవితాన్ని తాను కోరుకోవడం లేదని తెలిపింది.
విడాకుల కారణం తెలుసుకున్న షరియా కోర్టు మతాధికారి విస్తుపోయారు. ఆమె అభ్యర్థనను తిరస్కరించారు. విడాకులకు ఇది సరైన వాదన కాదని, మరేదైనా కారణం ఉంటే చెప్పాలని కోరారు. విడాకులకు మతాధికారి నిరాకరించడంతో ఆమె స్థానిక పంచాయతీని ఆశ్రయించగా, అక్కడా ఆమెకు నిరాశే ఎదురైంది.
భార్య విడాకులకు దరఖాస్తు చేయడంపై స్పందించిన భర్త మాట్లాడుతూ.. తానేమీ తప్పు చేయలేదని, పరిపూర్ణ భర్తగా ఉండాలని మాత్రమే కోరుకున్నానని పేర్కొన్నాడు. పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాల్సిందిగా తన భార్యకు చెప్పాలని షరియా కోర్టును అభ్యర్థించాడు. దీంతో ఆమె అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు.. సమస్యను ఇద్దరూ కలిసి పరిష్కరించుకోవాల్సిందిగా సూచించింది.