-
-
Home » Prathyekam » up lucknow wedding interfering groom girlfriend commotion compromise police crime
-
కల్యాణమండపం నుంచి వధువును తీసుకుపోయిన ప్రియుడు
ABN , First Publish Date - 2020-12-10T13:26:26+05:30 IST
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక పెళ్లి వేడుక జరుగుతుండగా హఠాత్తుగా వధువు ప్రియుడు ప్రత్యక్షమయ్యాడు.

లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక పెళ్లి వేడుక జరుగుతుండగా హఠాత్తుగా వధువు ప్రియుడు ప్రత్యక్షమయ్యాడు. పెళ్లిని ఆపించి వధువును తనతో పాటు కారులో తీసుకువెళ్లిపోయాడు. దీంతో వరుడు పెళ్లి జరగకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఉన్నావ్ జిల్లాకు చెందిన వరుడు తన బంధువర్గంతో సహా లక్నోలోని కల్యాణమండపానికి చేరుకున్నాడు. పెళ్లి తంతు కొనసాగుతోంది.
సరిగ్గా దండలు మార్చుకునే సమయానికి సినీస్టయిల్‌లో వధువు ప్రియుడు ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు. అతనిని చూడగానే వధువు వణికిపోయింది. అతను నేరుగా వధువు దగ్గరకు వచ్చి ఆమెను తీసుకునివెళ్లి కారులో కూర్చోబెట్టుకుని వెళ్లిపోయాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది. వరుడు తన పక్కన వధువు లేకుండానే ఇంటికి తిరుగుముఖం పట్టాడు. ఈ ఘటనపై స్పందించిన వధువు తండ్రి రామేశ్వరం తన కుమార్తెకు ఆ యువకునితోనే వివాహం జరిపించాలనుకుంటున్నామని తెలిపారు. కాగా ఈ ఉదంతంపై వరుని తరపువారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదు. ఈ ఘటనపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.