కిరాక్ ఆఫర్: రెస్టారెంట్ బిల్లులో సగం ప్రభుత్వమే చెల్లిస్తుంది!
ABN , First Publish Date - 2020-07-09T02:45:14+05:30 IST
కరోనా దెబ్బకు కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వాలు అనేక వ్యూహాలను అమలు చేస్తున్నాయి, ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి. ప్రభావితమైన రంగాలను బట్టి వివిధ చర్యలను తీసుకుంటున్నాయి. అయితే బ్రిటన్ ప్రభుత్వం మాత్రం ఓ అడుగు ముందుకేస్తూ మునుపెన్నడూ చూడని రీతిలో ఓ ఆఫర్‌ను ప్రకటించింది.

లండన్: కరోనా దెబ్బకు కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వాలు అనేక వ్యూహాలను అమలు చేస్తున్నాయి, ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి. ప్రభావితమైన రంగాలను బట్టి వివిధ చర్యలను తీసుకుంటున్నాయి. అయితే బ్రిటన్ ప్రభుత్వం మాత్రం ఓ అడుగు ముందుకేస్తూ మునుపెన్నడూ చూడని రీతిలో ఓ ఆఫర్‌ను ప్రకటించింది.
ఇందులో భాగంగా.. బ్రిటన్‌లోని రెస్టారెంట్లు, డైనర్లలో భోజనం చేసేవారికి బిల్లులో 10 పౌండ్లకు మించకుండా 50 శాతం వరకూ డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. అంటే.. డిస్కౌంట్ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్న మాట. అయితే కేవలం సోమవారం నుంచి బుధవారం వరకూ మాత్రమే కస్టమర్లు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చనేది ఈ స్కీమ్‌కు సంబంధించి మరో ఆసక్తికర ట్విస్ట్. ఆగస్టు నెలంతా ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. రెస్టారెంట్లే కాకుండా పబ్బులకూ ఈ స్కీమ్ వర్తించనుంది.
కుదేలైన పర్యటక హాస్పటాలిటీ రంగాలను ఆదుకునే క్రమంలో చాన్సలర్ ఫర్ ఎక్స్‌చెకర్ రిషీ సునక్ ఈ ఐడియాతో ముందుకు వచ్చారు. కరోనా దెబ్బుకు బ్రిటన్ ప్రజలు ఇప్పటికీ బయట తినాలంటేనే భయపడిపోతున్నారు. డిమాండ్ లేక దేశంలోని అనేక రెస్టారెంట్లు మూతపడ్డాయి. వాటిల్లోని సిబ్బంది బతుకుతెరువు కోల్పోయి రోడ్డున పడ్డారు. దీంతో ఈ రంగంలో మళ్లీ డిమాండ్ పెంచి, ఉద్యోగాలను సృష్టించి, గత వైభవాన్ని తిరిగి పొందేందుకు బ్రిటన్ ఈ స్కీమ్‌ను ప్రకటించింది. దీనితో పాటు ఈ రంగంపై విధించే వ్యాట్ పన్నును 20 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. వచ్చే ఆరు నెలల పాటు ఈ తగ్గింపు అమల్లో ఉంటుందని తెలిపింది.