బాత్‌టబ్‌లో పులి జలకాలాటలు.. ట్వీట్‌పై జైరామ్ తాజా వివరణ

ABN , First Publish Date - 2020-12-15T21:35:23+05:30 IST

కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ సోషల్ మీడియాలో మాంచి యాక్టివ్. రాజకీయాంశాలే కాదు, అప్పుడప్పుడు ఇంట్రస్టింగ్ టాపిక్స్ మీద కూడా పోస్టులు, ట్వీట్లు పెడుతుంటారు.

బాత్‌టబ్‌లో పులి జలకాలాటలు.. ట్వీట్‌పై జైరామ్ తాజా వివరణ

ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ సోషల్ మీడియాలో మాంచి యాక్టివ్. రాజకీయాంశాలే కాదు, అప్పుడప్పుడు ఇంట్రస్టింగ్ టాపిక్స్ మీద కూడా పోస్టులు, ట్వీట్లు పెడుతుంటారు. ఆయన ఈ నెల 7న ఓ ఫన్నీ వీడియోని ట్విటర్లో షేర్ చేశారు. ఓ పులి జలకాలాడుతున్న వీడియో అది. కర్ణాటకలోని కూర్గ్ అటవీ ప్రాంతంలోనంటూ ఆయన ట్వీట్ చేశారు. ఓ స్నేహితుడు వాట్సాప్‌లో పంపాడని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  


అటవీ పరిసరాల్లో తిరుగుతున్న ఓ పులి కంటికి నీళ్లతో ఉన్న టబ్బు కనపడింది. దాని దగ్గరకి వచ్చి కాసేపు పరీక్షగా చూసిన పులి.. సరదా పుట్టిందో ఏమో టబ్బులో చేరి కాసేపు స్నానం చేసింది. నిమిషన్నరకు పైగా ఉన్న ఈ వీడియోని జైరామ్ రమేశ్ అలా పెట్టగానే ఇలా రీట్వీట్లు మొదలయ్యాయి. ఈ వీడియో చాలా బావుందంటూ చాలామంది కామెంట్లు పెట్టారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర అయితే ఈ వీడియో చూసి తెగ ముచ్చటపడిపోయారు. పులి ఇలా చేయడం తనెప్పుడూ చూడలేదని ట్వీట్ చేశారు. కర్నాటకలోని అదే కొడుగులో తన బాల్యం గడచిందని పనిలోపనిగా గుర్తుచేసుకున్నారు. 


తాజాగా ఈ వీడియోకి సంబంధించి జైరామ్ మరో ట్వీట్ చేశారు. ఈ వీడియో మన దేశానికి సంబంధించినది కాదని, ఆ పరిసరాల్లో ఉన్న చెట్లను పరిశీలించిన తర్వాత విదేశాలకు చెందినదిగా తన మిత్రులు కొందరు తెలిపారని ఆయన అన్నారు. గత ట్వీట్‌ను సరిచేసుకున్నందుకు సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-12-15T21:35:23+05:30 IST

Read more