విమానంలో కరోనా రోగి ఉన్నాడనే అనుమానంతో పైలట్ ఏం చేశారంటే...

ABN , First Publish Date - 2020-03-23T13:48:51+05:30 IST

కరోనా వైరస్ అనుమానిత రోగి విమానం ముందు సీటులో కూర్చున్నారనే భయంతో విమానం పైలెట్ కాక్‌పిట్ నుంచి దిగకుండా అక్కడే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న ఉదంతం....

విమానంలో కరోనా రోగి ఉన్నాడనే అనుమానంతో పైలట్ ఏం చేశారంటే...

న్యూఢిల్లీ : కరోనా వైరస్ అనుమానిత రోగి విమానం ముందు సీటులో కూర్చున్నారనే భయంతో విమానం పైలెట్ కాక్‌పిట్ నుంచి దిగకుండా అక్కడే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న ఉదంతం పూణే -ఢిల్లీ ఎయిర్ ఏసియా విమానంలో వెలుగుచూసింది. ఈ నెల 20వతేదీన పూణే నుంచి న్యూఢిల్లీకి వచ్చిన 15-732 ఎయిర్ ఏసియా విమానంలో కాక్ పిట్ సమీపంలోని ముందు సీటులో కరోనా వైరస్ లక్షణాలతో ఓ ప్రయాణికుడు కూర్చున్నారని విమాన పైలెట్ గుర్తించారు. దీంతో పైలెట్  విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో మారుమూలన దూరంగా ల్యాండింగ్ చేశారు. అనంతరం అనుమానిత ప్రయాణికుడికి కరోనా పరీక్షలు చేయించగా అతనికి నెగిటివ్ అని పరీక్షలో వచ్చింది.


అనంతరం విమాన సిబ్బంది ప్రయాణికులను ముందు ద్వారం నుంచి కాకుండా వెనుక ద్వారం గుండా దించారు. అనంతరం విమానంలో స్ప్రేయింగ్ చేసి శుభ్రం చేశారు. అప్పటివరకు విమాన పైలెట్ దిగకుండా కరోనా భయంతో క్యాబిన్ లోనే సెల్ఫ్ క్వారంటైన్ విధించుకున్నారు. విమానాన్ని శానిటైజ్ చేశాక పైలట్ విమానం నుంచి కిందకు దిగారు. కరోనా లక్షణాలున్న ప్రయాణికులు కనిపిస్తే తాము అన్ని రకాల ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎయిర్ ఏసియా అధికార ప్రతినిధి చెప్పారు. 

Updated Date - 2020-03-23T13:48:51+05:30 IST