ఆమె 8 నెలల గర్భిణి.. అయినా నక్సల్స్ ప్రభావిత దంతెవాడలో విధులు
ABN , First Publish Date - 2020-03-08T18:05:20+05:30 IST
సృష్టి మనుగడకు ‘ఆడదే ఆధారం’ అని అంటుంటారు. మనుగడకే కాదు ఈ మగువ తెగువ గురించి తెలిస్తే...

సృష్టి మనుగడకు ‘ఆడదే ఆధారం’ అని అంటుంటారు. మనుగడకే కాదు ఈ మగువ తెగువ గురించి తెలిస్తే ధైర్యవంతులమని విర్రవీగే లక్షణాలున్న ఎంతటి మగాళ్లైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. దంతెవాడ.. ఈ పేరు వింటేనే ఈ ప్రాంతానికి దగ్గరగా ఉన్న సరిహద్దు గ్రామాల ప్రజలకు వెన్నులో వణుకు పుడుతుంది. ఎప్పుడు.. ఏం జరుగుతుందో తెలియదు. నిత్యం ఖాకీల నీడలో బతికే ఇక్కడి ప్రజలు ప్రశాంతత కోసం పరితపిస్తుంటారు. పచ్చని అడవులతో పరుచుకుని ఉండే దంతెవాడ జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు సర్వ సాధారణం.
ఎన్‌కౌంటర్‌లో ఏ మావోయిస్టు ప్రాణం పోతుందో తెలియదు. ఎదురుకాల్పుల్లో ఏ పోలీసు కుటుంబం అనాథగా మిగిలిపోతుందో అర్థం కాదు. అలా ప్రతినిత్యం తూటాల మోతమోగే భయానక అటవీ ప్రాంతంలో సునయనా పటేల్ అనే ఓ మహిళా పోలీసు విధులు నిర్వర్తిస్తోంది. అంతేకాదు.. ఆమె ప్రస్తుతం 8 నెలల గర్భిణి. ఆమె రెండు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు విధుల్లో చేరింది. అప్పటి నుంచి ఈ క్షణం వరకూ విధే పరమావధిగా గడుపుతోంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పనిచేస్తోంది.
8 నెలల గర్భిణి అయి ఉండి కూడా తుపాకీ భుజానా వేసుకుని విధులు నిర్వర్తించడంపై దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్‌ను సంప్రదించగా ఆయన చెప్పిన విషయం విస్తుగొలిపేలా చేసింది. ఆమె గతంలో పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఒకసారి ‘అమ్మ’ అని పిలిపించుకునే అదృష్టాన్ని కోల్పోయిందని, ఇప్పుడు కూడా విధులను పక్కనపెట్టేందుకు ఆమె సిద్ధంగా లేదని అభిషేక్ పల్లవ్ చెప్పారు. సునయనా పటేల్ ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచిందని, ఆమె కమాండర్‌గా విధుల్లో చేరిన తర్వాత మహిళ కమాండోల సంఖ్య రెట్టింపు అయిందని దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ధైర్య లక్ష్మికి ఓసారి సలాం చేద్దాం.