మంచులో ఇరుక్కున్న కారు.. 10 గంటలు అలాగే..

ABN , First Publish Date - 2020-12-20T13:55:26+05:30 IST

మంచులో ఇరుక్కున్న కారు.. 10 గంటలు అలాగే..

మంచులో ఇరుక్కున్న కారు.. 10 గంటలు  అలాగే..

చలికాలం వచ్చేసింది. సాయంత్రం ఆరు దాటిందంటే చాలు చలిగాలులు వణికిస్తున్నాయి. సమశీతోష్ణ మండలమైన మన దేశంలో పరిస్థితి ఇలా ఉంటే.. మంచు కురిసే దేశాల పరిస్థితి ఏంటి? అదే సమయంలో మంచు తుఫాన్ వస్తే? ఇక అంతే సంగతులు. అమెరికాలో సరిగ్గా ఇదే జరిగింది. ప్రముఖ నగరం న్యూయార్క్‌లో భారీ మంచు తుఫాను చెలరేగింది. దీంతో రాత్రికి రాత్రే ఈ నగరం మంచు దుప్పటిలో మునిగిపోయింది. ఇక్కడ భారీగా మంచు కురవడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడమే కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో ఓ వ్యక్తికి భయంకరమైన కష్టం వచ్చింది. 


కెవిన్ క్రేసెన్ అనే వ్యక్తి న్యూయార్క్‌లోని కండోర్ ప్రాంతంలో నివశిస్తుంటాడు. ఏదో పని మీద కారులో బయటకు వచ్చిన 58 ఏళ్ల కెవిన్.. మంచు కురిసిన రోడ్డుపై సరిగా డ్రైవింగ్ చేయలేకపోయాడు. దీంతో అతని కారు అదుపు తప్పింది. రోడ్డుపై నుంచి జారి పక్కనే ఉన్న మంచు గుట్టలో పడిపోయింది. అక్కడి నుంచి కారు కదిలించడం అతని వల్ల కాలేదు. ఇది జరిగిన చాలా సేపటి తర్వాత స్థానిక టియోగా కౌంటీలోని పోలీసు స్టేషన్‌కు కాల్స్ మీద కాల్స్ వచ్చాయి. ఓ డ్రైవర్ కారు అదుపు తప్పి పడిపోయిందని, అతనికి సాయం అవసరం ఉందని ఆ కాల్స్‌‌లో అధికారులు చెప్పారు. అయితే సదరు డ్రైవర్ ఎక్కడున్నదీ లొకేషన్ మాత్రం గుర్తించలేక పోయారు.


మంచు తుఫాను కురిసిన తర్వాతి రోజు ఉదయం.. స్థానిక పోలీసు అధికారి జేసన్ కాలీ ఘటన జరిగిన ప్రాంతంలో గస్తీ తిరిగాడు. కెవిన్‌ను కారు పడిపోయిన ప్రాంతాన్ని గుర్తించే ప్రయత్నం చేశాడు. కానీ అతనికి ఎటువంటి క్లూస్ కనిపించలేదు. ఓ చోట మంచు కప్పేసిన పోస్టు బాక్సులా కనిపించడంతో.. అక్కడ పోస్టు బాక్సు ఉండటం జేసన్‌కు అనుమానం కలిగించింది. అడ్రస్ కోసం పోస్టు బాక్సు పూర్తిగా చూడక తప్పదు. దీంతో దాని చుట్టూ మంచు తవ్వేయడం ప్రారంభించాడు. అదిగో అప్పుడే మంచులో కూరుకుపోయిన ఓ కారు విండ్ షీల్డ్‌ అతని చేతికి తగిలింది. దీంతో వేగం పెంచిన జేసన్.. దగ్గరలోని ఆస్పత్రికి ఫోన్ చేసి కారులోని కెవిన్‌ను అక్కడకు పంపించాడు. దాదాపు 10 గంటలపాటు అలా మంచులో కూరుకుపోయిన కారులోనే ఎటువంటి హీటర్ లేకుండా ఉండటంతో.. 58 ఏళ్ల కెవిన్‌ ఫ్రాస్ట్ బైట్‌కు గురయ్యాడు. అంటే చలి ఆయన చర్మం కొరికేసిందన్నమాట. కానీ ఆస్పత్రిలో చేరిన తర్వాత ఆయన కోలుకున్నారు. ఈ ఘటన గురించి వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్న పోలీసు డిపార్ట్‌మెంట్.. కెవిన్‌ను ఆస్పత్రిలో కలిసిన జేసన్‌ ఫొటోను షేర్ చేసింది.

- పి.ఫణీంద్ర

Updated Date - 2020-12-20T13:55:26+05:30 IST