ఏఐతో కరోనా పేషెంట్ల గుర్తింపు

ABN , First Publish Date - 2020-04-05T22:45:02+05:30 IST

కరోనా బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని, వెంటిలేటర్ అవసరమైనవారిని గుర్తించేందుకు సైంటిస్టులు ఏఐని ఉపయోగించనున్నారు. దీని సాయంతో..

ఏఐతో కరోనా పేషెంట్ల గుర్తింపు

న్యూఢిల్లీ: కరోనా బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని, వెంటిలేటర్ అవసరమైనవారిని గుర్తించేందుకు సైంటిస్టులు ఏఐని ఉపయోగించనున్నారు. దీని సాయంతో అత్యవసర చికిత్స అవసరమైన పేషెంట్లలో సాధారణంగా ఉండే లక్షణాలును గుర్తించవచ్చని కోపెన్‌హెగన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతే కాకుండా దీనివల్ల ఎవరికి వెంటిలేటర్లు అవసరం, ఏ సమయంలో వారికి అవసరమౌతాయి.. అనే విషయాలను డాక్టర్లు అంచనా వేయగలుగుతారని, దీంతో తమ వద్ద ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకునే వీలు కలుగుతుందని వివరించారు.


సాధారణంగా కరోనా సోకిన వారిలో అనేక లక్షణాలు కనిపిస్తాయని, వాటన్నింటినీ కంప్యూటర్లు పరిగణలోకి తీసుకుని ప్రాణాపాయ స్థితికి కారణమవుతున్న అంశాలను గుర్తిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ట్రీట్‌మెంట్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న పేషెంట్లకు సంబంధించిన ఎక్స్‌రేలు, పరీక్షల రిపోర్టులు, ఇతర నివేదికలను పరిశీలించి, వాటి ఆధారంగా కొత్తగా కరోనా బారిన పడినవారి రిపోర్టులతో పోల్చి చికిత్స అందించవచ్చని వారు చెప్పుకొచ్చారు. ఈ పరిజ్ఞానాన్ని అతి త్వరలో డెన్మార్క్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు శస్త్రవేత్తలు చెబుతున్నారు.


దీనిపై డెన్మార్క్‌లోని బిస్పెబ్‌జర్గ్, ఫెడరిక్స్‌బర్గ్ హాస్పటల్స్ చీఫ్ ఫిజీషియన్ ఎప్సన్ సోలెమ్ మాట్లాడుతూ ‘కరోనా ఎవరిపైన తీవ్ర ప్రభావం చూపుతుందో మాకు తెలుసు. ముఖ్యంగా వయసు మీద పడినవారిపై, పొగ తాగే అలవాటు ఉన్నవారిపై, అలాగే ఆస్తమా, గుండె సంబంధింత వ్యాధులతో బాధపడుతున్న వారిపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే ఇవే కాకుండా మరి కొన్ని కారణాలు కూడా వ్యక్తి శరీరంలో కోవిడ్-19 విస్తృత వ్యాప్తికి తోడ్పడతాయి’ అని తెలిపారు. 


‘ఇప్పటికే మనం గమనిస్తున్నాం. కరోనా బారిన పడినవారిలో కొందరు యువకులు వెంటిలేటర్లపై ప్రాణాల కోసం పోరాడుతున్నారు.. అయితే కొందరు వయసు మీద పడినవారు మాత్రం ఎటువంటి వెంటిలేటర్ సాయం లేకుండానే చికిత్స తీసుకుంటున్నారు. దీనికి కారణాలును మనంత మనం గుర్తించలేకపోతున్నాం కనుక కంప్యూటర్ల సాయం తీసుకుందాం’ అని సోలెమ్ అన్నారు. 

ఇదిలా ఉంటే ఇప్పటికే చైనాలో ఇలాంటి పరిజ్ఞనం అందుబాటులో ఉంది. అక్కడ పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో చాలావరకు ఈ విధానం ద్వారానే కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు.

Updated Date - 2020-04-05T22:45:02+05:30 IST