రికార్డు కోసం రిక్వెస్ట్‌

ABN , First Publish Date - 2020-12-06T18:09:48+05:30 IST

మన దేశంలో అత్యంత పొడగరి ఎవరంటే ధర్మేంద్ర ప్రతాప్‌ సింగ్‌ అంటారెవరైనా.

రికార్డు కోసం రిక్వెస్ట్‌

మన దేశంలో అత్యంత పొడగరి ఎవరంటే ధర్మేంద్ర ప్రతాప్‌ సింగ్‌ అంటారెవరైనా. ఇప్పటిదాకా రికార్డుల్లో ఉన్న సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌ఘర్‌కు చెందిన ధర్మేంద్ర 8 అడుగుల 1 అంగుళం పొడవుతో దేశంలోనే అందరికన్నా పొడవైన వాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన కన్నా పొడవైనవాడు మా గ్రామంలో ఉన్నాడని అంటున్నారు కర్ణాటకవాసులు. అనడమే కాదు... ఆయనతో ఫొటో దిగి రికార్డును సరిచేయాల్సిందిగా రిక్వెస్టులు కూడా పంపుతున్నారు. 


ఇక్కడ మీరు చూస్తున్న పొడగరి పేరు మారుతి. కర్ణాటకలోని బీదర్‌ జిల్లాకు చెందిన చింతకి గ్రామవాసి. 36 ఏళ్ల ఈయన ఎత్తు 8 అడుగుల 5 అంగుళాలుగా చెబుతున్నారు. అంటే ధర్మేంద్ర కన్నా 4 అంగుళాలు ఎక్కువే ఉన్నాడన్నమాట. ఇదే విషయాన్ని చెబుతూ రికార్డును మారుతి పేరిట తిరగరాయాల్సిందిగా బీదర్‌ జిల్లా వాసులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల మారుతితో స్థానికులు దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో కూడా పెట్టారు. ఈ విషయాన్ని వైరల్‌ చేయాల్సిందిగా రిక్వెస్టులు పెడుతున్నారు. రికార్డు మాటెలా ఉన్నా మారుతికి మాత్రం తన పొడవే శాపంగా మారింది. ఆయన పొడవును చూసి ఎవరూ ఉద్యోగంలో పెట్టుకోవడం లేదు. దాంతో సంపాదన లేక తమ్ముడి మీద ఆధారపడాల్సి వస్తోంది. పెళ్లి చేసుకుందామన్నా పిల్లను కూడా ఎవరూ ఇవ్వడం లేదని మారుతి వాపోతున్నాడు. ఉండటానికి ఇల్లు, చేయడానికి కొలువు కూడా లేకపోవడంతో కర్ణాటక ప్రభుత్వమే ఏదో ఒక విధంగా తనను ఆదుకోవాలని కనిపించిన అధికారిని విజ్ఞప్తి చేస్తున్నాడు. మరోవైపు కనీసం ఈ పొడగరి పేరిట రికార్డు నమోదైతే ఏదోరకంగా ఆయనకు సాయం అందుతుందని స్థానికులు భావిస్తున్నారు. రికార్డు సంగతి పక్కనపెడితే ప్రస్తుతం మారుతి రోడ్డు మీద నడుస్తుంటే, జనాలు వింతగా చూస్తూ ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. తన బాధను గుండెల్లోనే దాచుకుని ఏమాత్రం విసుగు చెందకుండా అడిగిన వారితో సెల్ఫీలు దిగుతూ వారికి వినోదాన్ని పంచుతున్నాడు మారుతి.  

Read more