వారు పాండవ వంశస్థులట... ముళ్ల గులాబీలపై పడుకుని...

ABN , First Publish Date - 2020-12-27T12:15:44+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని బైతూల్ గ్రామంలో భక్తి పేరుతో ఒక వికృత క్రీడ జరుగుతుంటుంది. తాము...

వారు పాండవ వంశస్థులట... ముళ్ల గులాబీలపై పడుకుని...

బైతూల్: మధ్యప్రదేశ్‌లోని బైతూల్ గ్రామంలో భక్తి పేరుతో ఒక వికృత క్రీడ జరుగుతుంటుంది. తాము పాండవ వంశస్థులమని చెప్పుకునే రజ్జడ్ సమాజానికి చెందినవారంతా తమ కోర్కెలు తీరేందుకు అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ఉద్దేశంతో ముళ్లమీద పడుకుని, తమను తాము శిక్షించుకుంటారు. సేహ్రా గ్రామంలో ప్రతీ ఏటా డిసెంబరు నెలలో రజ్జడ్ సమాజానికి చెందిన వారంతా ఈ ఆచారాన్ని పాటిస్తారు. తమ వంశస్థులైన పాండవులు ఇదే మాదిరిగా ముళ్లపై నడిచి సత్య పరీక్షను ఎదుర్కొన్నారని వీరు చెబుతుంటారు. అందుకే వీరు కొన్నేళ్లుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ముళ్ల పరీక్ష కారణంగా తమలో భక్తి పెరుగుతుందని, సత్యసంధత వృద్ధి చెందుతుందని అంటారు. ఇలా చేయడం వలన అమ్మవారి అనుగ్రహం తమపై కురుస్తుందని చెబుతుంటారు. రజ్జడ్ సమాజానికి చెందిన వారంతా ఈ పరీక్షకు ముందు అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. తరవాత ముళ్ల గులాబీ మొక్కలను తీసుకువచ్చి నేలపై పరుస్తారు. తరువాత ఒక్కొక్కరుగా ఆ ముళ్ల మొక్కలపై పడుకుని తమను తాము పరీక్షించుకుంటారు. వీరు ఇలా చేయడం వెనుక ఒక కథనాన్ని కూడా వీరు చెబుతుంటారు. పూర్వకాలంలో అడవుల్లో ఉన్న పాండవులు ఒకసారి తాగునీటి కోసం అన్వేషిస్తుండగా, వారికి ఒక వ్యక్తి ఎదురవుతాడు. అతనిని నీరు ఎక్కడ దొరుకుతుందని పాండవులు అడుగుతారు. దానికి సమాధానంగా అతను నీరు ఎక్కడ ఉందో చెబుతాను.


అయితే మీ సోదరితో తనకు వివాహం జరిపిస్తానంటేనే చెబుతానంటాడు. పాండవులకు సోదరి లేకపోవడంతో వారు ఒక యువతిని ఎంపిక చేసి, ఆమెను తమ సోదరిగా చెప్పి, అతనితో వివాహం జరిపిస్తారు. అయితే అతను ఈమె మీ సోదరే అయితే మళ్లపై పడుకుని సత్య పరీక్షను ఎదుర్కోవాలని చెబుతాడు. పాండవులు దానికి సరేనంటూ ఆ పరీక్షను పూర్తిచేసి, సోదరిని అతనితో పంపిస్తారు. ఈ కథను ఆధారంగా చేసుకుని రజ్జడ్ సమాజానికి చెందిన వారంతా ఈ పరీక్షను ఎదుర్కొంటుంటారు.  

Updated Date - 2020-12-27T12:15:44+05:30 IST