ఇది మాయ కాదు.. నిజంగా నిజమే!
ABN , First Publish Date - 2020-12-30T02:49:08+05:30 IST
కొద్దిపాటు చలికే మనం వణికిపోతాం. ఉష్ణోగ్రతలు కాస్తంత పడిపోతే అల్లాడిపోతాం. అలాంటిది ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఎలా ఉంటారో
న్యూఢిల్లీ: కొద్దిపాటు చలికే మనం వణికిపోతాం. ఉష్ణోగ్రతలు కాస్తంత పడిపోతే అల్లాడిపోతాం. అలాంటిది ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఎలా ఉంటారో ఎప్పుడైనా ఆలోచించారా? చలికాలంలో వారి బాధలు ఎలా ఉంటాయోనన్న ఆలోచన మీ మదిలోకి ఎప్పుడైనా వచ్చిందా? లేదంటే, ఈ ఫొటో చూడండి.. మీకే అర్థం అవుతుంది. గాలిలోనే గడ్డకట్టుకుపోయిన నూడుల్స్, గుడ్డుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గడ్డకట్టుకుపోయి గాలిలోనే ఉండిపోయిన నూడుల్స్, గుడ్డుకు సంబంధించిన ఫొటోను ఓ ట్విట్టర్ యూజర్ పోస్టు చేశాడు. సెర్బియాలోని నోవోసిబిర్‌స్క్‌లో అతడు ఈ ఫొటోను తీశాడు. ఇప్పుడు ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 45 డిగ్రీలుగా ఉందంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ తగిలించాడు.
‘‘సెర్బియాలో వాతావరణం ఎలా ఉందనేది మీరు అర్థం చేసుకోలేరు. రోజు క్రితం ఇక్కడ మైనస్ 45 డిగ్రీలుగా ఉంటే, ఇప్పుడు ప్లస్ నాలుగు డిగ్రీలుగా ఉంది. యాహూ చెబుతున్న వాతావరణ వివరాల ప్రకారం ఇది ప్లస్ 12 డిగ్రీలకు పెరగొచ్చు. ఆ తర్వాత ఇది క్రమంగా మైనస్ 23 డిగ్రీల నుంచి తిరిగి మైనస్ 30 డిగ్రీలకు చేరుకోవచ్చు’’ అని అతడు రాసుకొచ్చాడు. మరోవైపు, ఈ ఫొటో ట్విట్టర్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే వేలాది లైకులు, రీట్వీట్లు వచ్చాయి. ‘‘అబ్బో.. మా ప్రాంతంలో అయితే 23 డిగ్రీలకే వణికిపోతాం’’ అని ఒకరంటే.. ఉష్ణోగ్రత 17 డిగ్రీలు ఉంటే స్నానం కూడా చేయడం మానేస్తామని మరో యూజర్ కామెంట్ చేశాడు.