అంతటా ఆన్‌లైన్ క్లాసులు... అక్కడ చెట్టు కింద తరగతులు!
ABN , First Publish Date - 2020-07-19T16:53:14+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో విద్యార్థులకు పలు పాఠశాలలో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే కర్ణాటకలోని...

బెంగళూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో విద్యార్థులకు పలు పాఠశాలలో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే కర్ణాటకలోని ఒక గ్రామానికి చెందిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తన వినూత్న ఆలోచనతో తరగతులు నిర్వహిస్తున్నారు. అతను గ్రామంలోని విద్యార్థుల కోసం బహిరంగ ప్రదేశంలో చెట్టుకింద ఒక పాఠశాల ఏర్పాటు చేశారు. గ్రామంలోని విద్యార్థుల దగ్గర స్మార్ట్‌ఫోన్లు లేని విషయాన్ని గ్రహించిన ఆ ప్రధానోపాధ్యాయుడు తన వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కర్ణాటకలోని నీల్‌ఖెడ గ్రామంలో చెట్టు కింద ఈ పాఠశాల ప్రారంభమయ్యింది. ఇందుకోసం బీఢా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిధరామప్ప బిరాదార్ చొరవ తీసుకున్నారు. దీనికి గ్రామస్తుల మద్దతు లభించింది. తమ పిల్లలను పాఠశాలకు క్రమంతప్పకుండా పంపిస్తున్నారు.