చిరుతను కాపాడాలని.. బావిలోకి దిగిన అధికారి! కానీ..

ABN , First Publish Date - 2020-07-20T19:23:27+05:30 IST

అసలే అది 100 అడుగులోతైన బావి.. ఎండిపోయింది. అందులో చిరుత చిక్కుకుందని గ్రామస్థుల అనుమానం. దీంతో అటవీశాఖ అధికారి సిద్దరాజు..అసలు విషయం ఏంటో తెలుసుకోవాలనుకున్నారు. కుదిరితే దాన్ని రక్షించాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా బావిలోకి దిగారు.

చిరుతను కాపాడాలని.. బావిలోకి దిగిన అధికారి! కానీ..

మైసూరు: అసలే అది 100 అడుగుల లోతైన బావి.. ఎండిపోయింది. అందులో చిరుత చిక్కుకుందని గ్రామస్థుల అనుమానం. దీంతో అటవీశాఖ అధికారి సిద్దరాజు..అసలు విషయం ఏంటో తెలుసుకోవాలనుకున్నారు. కుదిరితే దాన్ని రక్షించాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా బావిలోకి దిగారు. చిరుత దాడి చేసే అవకాశం ఉందని తెలిసీ ఆయన ఈ సాహసం చేశారు. ఇందుకోసం ఆయన అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. చిరుతకు ఛేదించడం సాధ్యం కాని ఓ పెద్ద బోనులో కూర్చుని తాడు సాయంతో నూతిలోకి దిగారు. కానీ అందులో చిరుత లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


మైసురుకు సమీపంలోని కొటే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తొలుత కెమెరా ద్వారా చిరుత ఉందీ లేనిదీ తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. కానీ ఈ ప్రయత్నం విఫలమైంది. బావిలో ఎటువంటి చడీ చప్పుడూ వినిపించలేదు. కానీ చిరుత బావిలోనే ఉందంటూ గ్రామస్థులు బలంగా వాదించారు. దీంతో విషయం తేల్చుకునేందుకు సిద్ధరాజు.. ఏకంగా బావిలోకి దిగి.. చిరుత లేని విషయాన్ని రూఢీ చేసుకున్నారు. గ్రామస్థుల సందేహాన్ని నివృత్తి చేశారు. 

Updated Date - 2020-07-20T19:23:27+05:30 IST