చందమామపైకి తొలి మహిళ.. తీసుకెళ్లే రాకెట్ ఇంజిన్ ఇదేనట!

ABN , First Publish Date - 2020-12-10T14:02:08+05:30 IST

చందమామను చూడాలని, దాన్ని చేరుకోవాలని..

చందమామపైకి తొలి మహిళ.. తీసుకెళ్లే రాకెట్ ఇంజిన్ ఇదేనట!

చందమామను చూడాలని, దాన్ని చేరుకోవాలని చాలామంది కలలు కంటారు. కానీ అవి కల్లలుగానే మిగిలిపోతాయి. చాలా కొద్ది మంతికి మాత్రమే ఈ కోరిక తీరుతుంది. ఇలా ఈ కోరిక తీర్చుకున్న వారిలో ప్రముఖంగా వినపడే పేరు.. అమెరికన్ ఆస్ట్రోనాట్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్‌లవే. ఆ తర్వాత కొంత మంది కూడా ఈ ఫీట్ సాధించారు. కానీ ఈ జాబితాలో ఒక్క మహిళ పేరు కూడా లేదు. అందుకే ఈ బాధ్యతను తాము తీసుకుంటున్నట్లు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు చెందిన ‘బ్లూ ఆరిజిన్’ కంపెనీ ప్రకటించింది. ఇలా మహిళలను చందమామపైకి తీసుకెళ్లే రాకెట్‌లో ఉపయోగించడం కోసం ఈ కంపెనీ ఓ సరికొత్త ప్రయోగం చేసింది.


చందమామపైకి వెళ్లడం ప్రతి ఆస్ట్రోనాట్ కల. అంతరిక్షంలో విహరించాలని ఎంతగా కోరుకుంటూరో.. చందమామపై అడుగు పెట్టాలని కూడా వారు అంతే బలంగా కోరుకుంటారు. ప్రస్తుతం అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ సంస్థలు కూడా దూసుకొస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే పలు అంతరిక్ష సంస్థలు, వెబ్‌సైట్లు ప్రారంభమయ్యాయి కూడా. ఈ క్రమంలోనే అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కూడా ‘బ్లూ ఆరిజిన్’ పేరిట ఓ స్పేస్ సంస్థను నెలకొల్పాడు. ప్రఖ్యాత బిలియనీర్ ఎలన్ మస్క్ కూడా ‘స్పేస్‌ఎక్స్’ పేరుతో ఓ కంపెనీ స్థాపించి రాకెట్లు ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘బ్లూ ఆరిజిన్’ సంస్థ కూడా తన వేగాన్ని పెంచాలని నిర్ణయించుకుంది. అలాగే ప్రత్యర్థి కంపెనీలకు హెచ్చరిక కూడా చేయడానికి సిద్ధమైంది.


స్పేస్ రంగంలో తాము అందరికన్నా ముందు ఉన్నామని బ్లూ ఆరిజిన్ చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే తొలి మహిళను చందమామపైకి పంపడం కోసం బ్లూ ఆరిజిన్ కంపెనీ ప్లాన్ చేస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ రాకెట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ రాకెట్‌కు సంబంధించిన ఇంజిన్ సామర్ధ్యాన్ని కొందరు పరీక్షించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ పరీక్షలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయంటూ కంపెనీ అధినేత జెఫ్ బెజోస్ ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ ఇంజిన్‌ను ఉత్తర అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)కు చెందిన హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్ (హెచ్ఎల్ఎస్)లో ఉపయోగించే అవకాశం ఉంది. అమెరికా ప్రభుత్వం చేపట్టిన ఆర్టిమెస్ ప్రాజెక్టులో భాగంగా బ్లూ ఆరిజిన్ కంపెనీ ఈ ల్యాండర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ల్యాండర్.. 2024 నాటికి మానవులను చందమామపైన దింపుతుందట.

Updated Date - 2020-12-10T14:02:08+05:30 IST