మాతా వైష్ణోదేవి ప్రసాదం.. ఇంటికే!

ABN , First Publish Date - 2020-09-30T00:25:48+05:30 IST

మాతా వైష్ణోదేవి.. జమ్మూకశ్మీరులో ఉన్న ఈ ఆలయం దేశంలోని అతిపురాతన శక్తి పీఠాల్లో ఒకటి. కరోనా కారణంగా ఐదునెలలపాటు మూతపడిన ఈ ఆలయం తలుపులు ఇటీవలే తెరుచుకున్నాయి.

మాతా వైష్ణోదేవి ప్రసాదం.. ఇంటికే!

జమ్మూకశ్మీర్: మాతా వైష్ణోదేవి.. జమ్మూకశ్మీరులో ఉన్న ఈ ఆలయం దేశంలోని అతిపురాతన శక్తి పీఠాల్లో ఒకటి. కరోనా కారణంగా ఐదునెలలపాటు మూతపడిన ఈ ఆలయం తలుపులు ఇటీవలే తెరుచుకున్నాయి. నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో ఆలయంలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఆలయబోర్డు చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఆలయ ప్రసాదాన్ని దేశమంతటా హోండెలివరీ చేయాలని నిర్ణయించింది.


జమ్మూకశ్మీరులోని మాతా వైష్ణోదేవి ఆలయానికి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. మరీ ముఖ్యంగా నవరాత్రుల సమయంలో అయితే ఆలయం కిక్కిరిసిపోతుంది. దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడి త్రికూట పర్వతంపై వైష్ణోదేవి ఆలయం ఉంది. ఏటా ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. త్రికూట పర్వతంపై ఉన్న ఈ ఆలయం ఆగస్టు 16న తెరుచుకుంది. అప్పటి నుంచి గుళ్లోకి అనుమతించే భక్తుల సంఖ్యను నియంత్రిస్తూ వచ్చింది ఆలయబోర్డు.


కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తోంది. రోజుకు కనీసం లక్ష కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్యను తగ్గించాలని మాతావైష్ణోదేవి ఆలయబోర్డు భావించింది. ఈ క్రమంలోనే ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాలను సోషల్ మీడియాలో లైవ్‌ స్ట్రీమ్ చేయబోతున్నట్లు ఆలయ బోర్డు ఇటీవలే ప్రకటించింది.


అక్టోబరు 17న దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇక్కడ చేసే పూజలను లైవ్‌స్ట్రీమ్ చేయనున్నట్లు ఆలయబోర్డు ప్రకటించింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య కూడా పెరుగుతోందని బోర్డు తెలిపింది.


ఈ కష్టకాలంలో భక్తులకు చేరువ అవడం కోసం ప్రసాదాన్ని డోర్ డెలివరీ చేస్తే బాగుంటుందని బోర్డు మీటింగులో ఆలయ నిర్వహణ కమిటీ నిర్ణయించింది. దీని ప్రకారమే, ప్రసాదాన్ని స్పీడ్ పోస్ట్‌లో దేశంలో ఎక్కడికైనా పంపే విధంగా పోస్టల్ శాఖతో అవగాహనకు వచ్చింది. ఈ పూజా ప్రసాదం హోం డెలివరీ కావాలనుకున్న భక్తులు.. ఆలయ వెబ్‌సైట్లో ఆర్డర్ ఇవ్వొచ్చు. 


ఆర్డర్ చేసిన చేసిన 72గంటల్లోపే పూజ చేసి, ప్రసాదాన్ని స్పీడ్ పోస్టులో భక్తులకు అందజేసేలా చర్యలు తీసుకున్నట్లు ఆలయ బోర్డు ప్రతినిధులు చెప్పారు. కరోనా కారణంగా ఆలయ దర్శనానికి రాలేకపోయిన భక్తులు కూడా ఈ ప్రసాదం డెలివరీతో సంతృప్తి చెందుతారని వారు భావిస్తున్నారు.

Updated Date - 2020-09-30T00:25:48+05:30 IST