పార్ట్‌నర్ బ్రేకప్.. తనను తానే పెళ్లాడిన యువకుడు!

ABN , First Publish Date - 2020-11-07T00:04:03+05:30 IST

ప్రేమ పెళ్లిళ్లు ఇప్పుడు సర్వసాధారణం. ప్రేమికులిద్దరూ చాలాకాలం చెట్టపట్టాలేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం, పెద్దలు అంగీకరించకుంటే

పార్ట్‌నర్ బ్రేకప్.. తనను తానే పెళ్లాడిన యువకుడు!

న్యూఢిల్లీ: ప్రేమ పెళ్లిళ్లు ఇప్పుడు సర్వసాధారణం. ప్రేమికులిద్దరూ చాలాకాలం చెట్టపట్టాలేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం, పెద్దలు అంగీకరించకుంటే ఇంటి నుంచి పారిపోయి వెళ్లి మరీ పెళ్లి చేసుకుంటున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగు చూస్తున్నాయి. ప్రేమించుకుని పెళ్లి వరకు వచ్చేసరికి ఎవరో ఒకరు హ్యాండిచ్చిన ఘటనలు కూడా కోకొల్లలు. ఇది ఏ ఒక్క దేశానికో, ప్రాంతానికో పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ప్రతి రోజూ ఏదో ఓ మూల జరుగుతూనే ఉన్నాయి. అయితే, ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం కొంచెం వెరైటీ. ఇంకా చెప్పాలంటే బహుశా ఇలాంటి ఘటన ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు కూడా. ప్రేమికురాలు బ్రేకప్ చెప్పిందని తనను తానే పెళ్లాడాడో యువకుడు.


బ్రెజిల్‌కు చెందిన డియాగో రేబెలో, విటర్ బ్యూనోలు ఇద్దరూ చాలాకాలం పాటు ప్రేమించుకున్నారు. గతేడాది నవంబరులో పెళ్లి కోసం నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. గత నెలలో వారు పెళ్లి చేసుకుని ఒక్కటి కావాల్సి ఉండగా ఇద్దరి మధ్య చెడింది. ఈ వేసవిలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు పొడసూపాయి. ఫలితంగా వాదులాట మొదలైంది. దీంతో మనసు విరిగిపోయిన విటర్ జులైలో డియాగోకు బ్రేకప్ చెప్పేసి అతడి నుంచి దూరం జరిగింది. 


ప్రియురాలి బ్రేకప్‌తో డియాగో వివాహం ఆగిపోతుందని అందరూ భావించారు. అయితే, డియాగో మాత్రం అలా అనుకోలేదు. ‘ఆమె పోతే పోయింది.. నన్ను నేనే పెళ్లాడతా. నన్ను నాకెంటే గొప్పగా ప్రేమించేవాడు ఎవడున్నాడు’ అని మనసులో అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన వివాహానికి ఏర్పాట్లు చేశాడు. గత నెల 16న బాహియాలోని ఇటాకేర్ పట్టణంలో ఓ రిసార్ట్‌లో తనను తానే పెళ్లాడాడు. ఈ పెళ్లికి 40 మంది అతిథులు హాజరయ్యారు. గాళ్‌ఫ్రెండ్ విటర్, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం గైర్హాజరయ్యారు. 


వివాహం అనంతరం ‘‘నేను సాధించాను’’ అంటూ డియాగో పోస్టు చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ‘‘ఈ రోజు నా జీవితంలో అత్యంత మధురమైనది, సంతోషకరమైనది’’ అని చెప్పుకొచ్చాడు.  ఈ జీవితంలో తాను ఎంతో ఇష్టమైన వ్యక్తులతో ఉన్నానని పేర్కొన్నాడు. ఈ వేడుక ఓ విషాదమే అయినా, తాను దానిని కామెడీగా మార్చానని ఆవేదన వ్యక్తం చేశాడు.


నెల రోజులపాటు ఏం చేయాలా అని ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెప్పాడు. 50 మంది అతిథుల్లో 40 మంది తన వివాహానికి హాజరయ్యారని వివరించాడు. ‘‘సంతోషంగా ఉండడానికి నేను పెళ్లిపై ఆధారపడబోను. నేను ఎవరో ఒకర్ని పెళ్లి చేసుకుంటాను. పిల్ల్లల్ని కంటాను. అంతమాత్రాన నా సంతోషం దానిపైనే ఆధారపడి ఉండబోదు’’అని డియాగో వివరించాడు.

Updated Date - 2020-11-07T00:04:03+05:30 IST