యాచకులకు రూ. 30 వేలు పంపిణీ... అజ్ఞాత వ్యక్తుల కోసం పోలీసుల గాలింపు!
ABN , First Publish Date - 2020-05-24T11:01:07+05:30 IST
దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో పేదలు ఉపాధి కోల్పోయి పలు అవస్థలు పడుతున్నారు. ఈ నేపధ్యంలో వారికి సాయం అందించేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్లో...

సత్నా: దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో పేదలు ఉపాధి కోల్పోయి పలు అవస్థలు పడుతున్నారు. ఈ నేపధ్యంలో వారికి సాయం అందించేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఎంపీలోని సత్నాలో యాచకులకు ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు డబ్బు పంపిణీ చేయడం సంచలనంగా మారింది. జగతేదేవ్ చెరువు శివాలయం దగ్గర కూర్చున్న యాచకులకు రూ. 500, 200, 100 నోట్లను పంపిణీ చేశారు. ఇది సుమారు 30 వేల రూపాయల వరకూ ఉంటుంది. ఈ డబ్బు పంపిణీ చేసిన తరువాత వారు మాయమయ్యారు. అయితే ఇలా డబ్బు పంపిణీ చేయడానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ వీడియోలో ఉన్నదాని ప్రకారం ఇద్దరు వ్యక్తులలో ఒకరు తన జేబులో నుండి నోట్లను తీసి లెక్కించడం కనిపిస్తోంది. పెట్రోల్ పంప్ ఆపరేటర్ ఈ విషయం తెలుసుకుని, యాచకుల దగ్గనున్న నోట్లను శానిటైజ్ చేశారు. ఈ విషయం పోలీసుల వరకూ చేరడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపద్యంలో ఎవరో ఇలా నోట్లను పంపిణీ చేయడంపై సత్నా పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసు అధికారి సంతోష్ తివారీ మాట్లాడుతూ ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు...యాచకులకు డబ్బు పంపిణీ చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇది నేరంకాకపోయినా, కరోనా వ్యాపిస్తున్న సమయంలో పలు అనుమానాలకు తావిస్తున్నదని అన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.