ఆరు నెలల్లో 34 కిలోలు త‌గ్గి, ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న‌ డీఐజీ

ABN , First Publish Date - 2020-06-22T15:01:01+05:30 IST

ఊబ‌కాయం క‌లిగిన‌వారు బరువు త‌గ్గేందుకు ర‌క‌రాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. కొంత‌మంది జిమ్‌కు వెళ్లి, క‌స‌ర‌త్తులు చేస్తూ, చెమ‌ట చిందిస్తూ...

ఆరు నెలల్లో 34 కిలోలు త‌గ్గి, ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న‌ డీఐజీ

ఛ‌త‌ర్‌పూర్‌: ఊబ‌కాయం క‌లిగిన‌వారు బరువు త‌గ్గేందుకు ర‌క‌రాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. కొంత‌మంది జిమ్‌కు వెళ్లి, క‌స‌ర‌త్తులు చేస్తూ, చెమ‌ట చిందిస్తూ, బ‌రువు త‌గ్గాల‌ని త‌ప‌న ప‌డుతుంటారు. అయితే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఛతర్‌పూర్ పరిధిలో ప‌నిచేస్తున్న ఒక డీఐజీ కేవ‌లం న‌డ‌క ద్వారా బరువు తగ్గి, అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఆయన‌ 34 కిలోల బరువును ఆరు నెలల్లో తగ్గారు. ఛతర్‌పూర్ రేంజ్ డీఐజీ వివేక్‌రాజ్ సింగ్‌ను బాల్యంలో అత‌నికి ఉన్న ఊబ‌కాయం కార‌ణంగా స్నేహితులు ఎగతాళి చేసేవారు. ఈ విష‌యాన్ని ఆయ‌న వ‌య‌సు పెరిగిన త‌రువాత కూడా సీరియ‌స్‌గా తీసుకోలేదు. అయితే పోలీసు విధుల్లో ఊబ‌కాయం కార‌ణంగా ఇబ్బందులు ఎదుర‌య్యాయి. దీంతో వివేక్‌రాజ్ సింగ్ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు. 130 కిలోల బ‌రువున్న ఆయ‌న ఆరు నెల‌ల్లో 96 కిలోల‌కు త‌గ్గారు. ఇందుకోసం న‌డ‌క‌ను ఎంచుకున్నాన‌ని, ప్ర‌తిరోజూ 6 నుండి 7 గంటలు వాకింగ్ చేస్తూ, బ‌రువు త‌గ్గాన‌ని డీఐజీ తెలిపారు. ఇంకో  రెండు కిలోల బ‌రువు త‌గ్గాల్సి ఉంద‌ని, అందుకోసం ప్ర‌యత్నిస్తున్నాన‌ని పేర్కొన్నారు. కాగా ఆరునెల‌ల్లో పూర్తిస్థాయిలో ఫిట్‌గా మారిన డీఐజీని చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతూ, బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి స్పూర్తి దాయకుడ‌ని అంటున్నారు. 

Updated Date - 2020-06-22T15:01:01+05:30 IST