లైఫ్ ఆఫ్టర్ కరోనా: మైదానం మూగబోయింది.!

ABN , First Publish Date - 2020-05-13T20:40:43+05:30 IST

ఆట అనే మాట లేదు. మైదానాల్లో క్రీడాసంబురాల కేరింతలు లేవు. గ్యాలరీల్లో ప్రేక్షకుల ఉత్సాహపు వెల్లువ లేదు.

లైఫ్ ఆఫ్టర్ కరోనా: మైదానం మూగబోయింది.!

ఆట అనే మాట లేదు. మైదానాల్లో క్రీడాసంబురాల కేరింతలు లేవు. గ్యాలరీల్లో ప్రేక్షకుల ఉత్సాహపు వెల్లువ లేదు. మ్యాచ్‌లు, స్కోర్లు, కామెంటరీలు, ట్రోఫీల కబుర్లు లేవు. కాసులు కురిపించే టోర్నీలు లేవు. క్రీడా జగత్తే క్రీనీడలోకి జారుకుంది. విశ్వవేదికపై అంగరంగ వైభవంగా సాగే ఒలింపిక్స్ అనే అత్యద్భుత పండుగే వాయిదా పడింది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల సమయంలో మాత్రమే తలెత్తిన ఇలాంటి విచిత్ర పరిస్థితి మళ్లీ ఎందుకు సంభవించింది? అసలేం జరుగుతోంది? 


ఆటలకి అంతరాయం ఏర్పడింది. విశ్వక్రీడా వేదికపై ఎర్రజెండా ఎగురుతోంది. అంతటా మహా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. క్రీడాకారులు గడపదాటడం లేదు. మైదానాలన్నీ బోసిపోతున్నాయి. స్పోర్ట్స్‌ క్లబ్‌లలో యాక్టివిటీస్‌ అన్నీ బంద్‌. వందలాది మ్యాచ్‌లు, ఈవెంట్లు రద్దు. అసలు "ఆట'' అన్న రెండక్షరాల మాటే ఎక్కడా వినిపించడం లేదు. కనీవినీ ఎరుగని ఈ విచిత్ర పరిణామానికి కారణం కరోనా వైరస్సే! గతంలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు మాత్రమే ఒలింపిక్స్‌కి బ్రేక్‌పడింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితే పునరావృతమైంది. ప్రాణాంతక కరోనాపై ప్రపంచ దేశాలు చేస్తున్న పోరాటం నిజంగానే మూడో ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అన్ని రకాల ఆటలకీ తాత్కాలిక విరమణ ప్రకటించారు. దీంతో క్రీడాభిమానులు సైతం బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్నారు.  


అత్యంత ప్రమాదకరమైన "కరోనా'' మానవాళిపై పగబట్టింది. కొద్ది రోజుల వ్యవధిలోనే రెండు వందలకు పైగా దేశాలకు వ్యాపించింది. అనేక దేశాల్లో లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. అంతర్జాతీయ రాకపోకలకి బ్రేక్‌ పడింది. ఈ నేపథ్యంలో మానసిక ఉత్తేజానికీ, ఉల్లాసానికీ టానిక్‌లా పనిచేసే క్రీడారంగం కూడా స్తబ్దుగా మారిపోయింది. మనిషి ప్రాణాలతో కరోనా ఆడుతున్న చెలగాటం ఒక్కటే అందరినీ బెంబేలెత్తిస్తోంది..


క్రీడాప్రపంచానికి ఏడాదంతా సీజనే. సమ్మర్‌ వస్తే ఆనందపు వెల్లువే. కానీ ఈ వేసవి యెండలకి బదులు కరోనా సెగలు చిమ్ముతోంది. ఫలితంగా అనేక టోర్నమెంట్లు, మ్యాచ్‌లు, స్పోర్ట్స్‌ ఈవెంట్లు వాయిదా పడ్డాయి. మరికొన్ని పూర్తిగా రద్దయ్యాయి. క్రికెట్‌ అంటే మనవాళ్లకి ఎంత క్రేజో చెప్పనక్కరలేదు. అలాంటిది ఈసారి పిచ్‌పై కరోనానే రెచ్చిపోయి ఆడుతోంది. ఆ దెబ్బతో చిచ్చరపిడుగుల్లాంటి ఆటగాళ్లు సైతం గప్‌చుప్‌ అయిపోయారు. మన దేశంలో క్రికెటర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కనీసం నెట్‌ ప్రాక్టీస్‌ కూడా కరువైంది!


సౌతాఫ్రికాతో భారత్‌ సిరీస్‌ అర్థాంతరంగా ముగిసిపోయింది. క్రికెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కి తలమానికంగా చెప్పుకునే ఐపీఎల్‌ పండగకే కరోనా గ్రహణం పట్టింది. ఈ ఒక్క లీగ్‌ రద్దయితే బీసీసీఐకి 3 వేల కోట్ల రూపాయల నష్టమట! అంటే ఊహించండి కరోనా స్ట్రోక్‌ ఏ స్థాయిలో ఉందో! ఈ సీజన్‌లో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలతో భారత్‌ తలపడాల్సిన మ్యాచ్‌లు కూడా డౌటే అంటున్నారు. ఇయర్‌ ఎండ్‌ టోర్నీలు సైతం ఎండ్‌ కార్డ్‌ వేసినట్టే! ఐసీసీ ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌, ఆసియా కప్‌ పోటీలపై ఆభిమానులు ఆశలు వదిలేసుకున్నారు. ఆస్ట్రేలియా నిర్వహించ తలపెట్టిన పురుషుల టీ20 ప్రపంచకప్‌ మెగా టోర్నీపైనా క్రీడాపండితులు పెదవి విరుస్తున్నారు. ప్రేక్షకులు లేని స్టేడియాలలో మ్యాచ్‌లు నిర్వహించాలన్న ప్రతిపాదనలు కూడా వచ్చాయి. అయితే గ్యాలరీలు ఖాళీగా ఉంటే ఇక కిక్కేముందీ అని పలువురు నో చెప్తున్నారు. 


టెన్నిస్‌ కోర్టులను కూడా కరోనా వైరస్‌ ఖాళీ చేయించింది. ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్‌ ఈసారి రద్దయ్యింది. సెకండ్‌ వాల్డ్‌వార్‌ తర్వాత ఈ పోటీ నిలిచిపోయిన తొలి సందర్భం ఇదే! ఫ్రెంచ్‌ ఓపెన్‌కీ ఓపెనింగ్‌ కొరవడింది. ఇండియా ఓపెన్‌, సింగపూర్‌ ఓపెన్‌, మలేషియా ఓపెన్‌, జర్మన్‌ ఓపెన్‌ టోర్నీలు వాయిదా పడ్డాయి. బ్యాడ్మింటన్‌ టోర్నీలు, ఫార్ములా వన్‌ కిక్‌ కూడా కరువైంది. హాకీ మ్యాచ్‌ల ప్రసక్తే లేదు. బాస్కెట్‌బాల్‌ లీగ్‌లు, చెస్‌ ఒలింపియాడ్‌లు సహా ఎన్నో రకాల మ్యాచ్‌లు, లీగ్‌లు వాయిదా బోర్డులు పెట్టేశాయి! చైనాలో జరగాల్సిన ప్రపంచ అథ్లెటిక్స్‌ ఇండోర్‌ ఛాంపియన్‌షిప్‌, పోలెండ్‌లో జరగాల్సిన ప్రపంచ అథ్లెటిక్స్‌ హాఫ్‌ మారథాన్‌ ఛాంపియన్‌షిప్‌, బోస్టన్‌ మారథాన్‌, లండన్‌ మారథాన్‌, రోమ్‌ మారథాన్‌, గ్రాంట్స్‌ మారథాన్‌, హాంకాంగ్‌ మారధాన్‌, కౌలాలంపూర్‌ మారథాన్‌, త్రీపీక్స్‌ రేస్‌ వంటివి కొన్ని రద్దయితే మరికొన్ని వాయిదా పడ్డాయి.  




ఎప్పుడెప్పుడా అని ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠతో ఎదురుచూసే ఆటల పెద్దపండుగ "ఒలింపిక్స్‌''! జపాన్‌లోని టోక్యోలో ఈ ఏడాది జులై 24 నుంచి ఆగస్ట్‌ 9వ తేదీ వరకూ ఈ పోటీలు జరగాల్సి ఉంది. నాలుగేళ్లకి ఒకసారి జరిగే ఈ వేడుకపైనా కరోనా పంజా విసిరింది. ఫలితంగా వచ్చే ఏడాది జులై 23కి ఈ ఒలింపిక్స్‌ పోస్ట్‌పోన్‌ అయ్యాయి. విశ్వక్రీడలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న 11 వేలకు పైగా అథ్లెట్లు తీవ్ర నిరాశకి గురయ్యారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల సమయంలోనే ఒలింపిక్స్‌ రద్దయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ వార్త వింటున్నాం. కరోనా ప్రభావం ఇప్పట్లో మానవాళిని వదిలిపెట్టే అవకాశం లేదని వైద్యనిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. అదే జరిగితే.. వచ్చే ఏడాది కూడా ఒలింపిక్స్‌ జరుగుతాయా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇదే సమయంలో అథ్లెట్లలో ఆందోళన పెరుగుతోంది. ఒలింపిక్స్‌లో విజేత కావాలన్న ఆశ ఆటగాళ్లందరిలో ఉంటుంది. అయితే వచ్చే ఏడాది అయినా ఒలింపిక్స్‌ జరుగుతాయన్న గట్టి హామీ లేదు. పైగా కరోనా వల్ల అథ్లెట్లు మునుపటిలా ప్రాక్టీస్‌ కూడా చేయలేకపోతున్నారు. 


ఒలింపిక్స్‌ వాయిదా పడటంతో భారత్‌లోని కొన్ని క్రీడా సమాఖ్యలు కలవరపడుతున్నాయి. దీనికి ఓ కారణం ఉంది. ఒలింపిక్స్‌లో భాగమైన వివిధ క్రీడల పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ తమ సమాఖ్యలకు ఆదాయాన్ని పంపిణీ చేస్తుంటుంది. ఇందులో భాగంగా గరిష్టంగా 302 కోట్ల నుంచి కనిష్టంగా 53 కోట్ల వరకూ అందుతుంటాయి. టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా పడటంతో ఈ చెల్లింపులను ఐఓసీ నిలిపివేసింది. భారత్‌లో క్రికెట్‌ మినహా ఇతర క్రీడలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. 


ఆటల్లో ఫుట్‌బాల్‌ కథే వేరు. మైదానంలో ఇరు జట్ల మధ్య జరిగే యుద్ధం పేరే ఫుట్‌బాల్‌. సాకర్‌ సీజన్‌లో అభిమానుల పిచ్చి చూస్తే మతిపోతుంది. ఐరోపా దేశాల్లో ఏడాదంతా మారథాన్‌ లీగ్‌లు జరుగుతూనే ఉంటాయి. అలాంటి ఫుట్‌బాల్‌కి కూడా కరోనా స్పాట్‌ పెట్టింది. స్పానిష్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్లకి వైరస్‌ సోకడంతో భయాందోళనలు మిన్నంటాయి. ఆ షాక్‌తో అన్ని స్థాయిల్లో మ్యాచ్‌లను రద్దుచేస్తున్నట్టు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య ప్రకటించింది. అనేక ఫుట్‌బాల్‌ క్లబ్బులు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఆర్థిక కష్టాల కారణంగా పలు క్లబ్బులు మూతపడవచ్చునని అంటున్నారు. మన దేశంలో జరగాల్సి ఉన్న అండర్‌ 17 మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ కూడా వాయిదా పడింది.


ఆటల పోటీలకి గ్రహణం పట్టడంతో క్రీడాసంఘాలు దీనావస్థలో చిక్కుకున్నాయి. నిజానికి క్రీడా సమాఖ్యలకు టీవీ ప్రసార హక్కుల అమ్మకాల ద్వారానే ఆదాయం వస్తుంటుంది. ప్రస్తుతం క్రీడలకే ఆస్కారం లేకపోతే.. ఇక ప్రసార హక్కులకి ఆస్కారమేది? స్పాన్సర్లు కూడా కరువయ్యే పరిస్థితి! ఆటల్లో రాణించాలంటే నిరంతర ప్రాక్టీస్‌ లేదా శిక్షణ వంటివి అవసరం. ఔత్సాహిక క్రీడాకారులకు సమ్మర్‌ క్యాంప్‌లు నిర్వహించి శిక్షణ ఇప్పించే తరుణం ఇది. కరోనా కారణంగా ఈ క్యాంప్‌లన్నీ రద్దు కావడం వారిని నిరాశపరిచింది. వివిధ ఆటలకి సంబంధించి స్పోర్ట్స్‌ కిట్ల అమ్మకాలు కూడా స్తంభించాయి. 


కబడ్డి, రెజ్లింగ్‌ వంటి ఆటల్లో ప్రత్యర్థులతో తలపడటం అనివార్యం. అలాగే క్రికెట్‌, ఫుట్‌బాల్‌ వంటి ఆటల్లో విజయం సాధించినప్పుడో, గోల్‌ చేసినప్పుడో ఆనందంతో జట్టు సభ్యులంతా ఆలింగనాలు చేసుకునే దృశ్యాలు కనిపిస్తాయి. ఇకపై ఇలాంటి సన్నివేశాలు కనిపిస్తాయా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆ స్థాయిలో మనుషుల మధ్య అడ్డుగోడలు కట్టింది కరోనా! 


ఆటలంటేనే సందడి. మైదానాల్లో ఇరు జట్ల మధ్య కొనసాగే హోరాహోరీ! ఆ చుట్టూ చేరి క్రీడాభిమానులు చేసే కేరింతల ఝరి!! ఇవన్నీ లేకపోతే మజా ఎక్కడుంటుంది? గతంలో మాదిరిగా ప్లేగ్రౌండ్స్‌ గేలరీల్లో భారీ జనసమీకరణ జరిపితే కరోనా వ్యాపిస్తుందన్న భయం ఏర్పడింది. అందువల్ల ఇకపై ప్రేక్షకుల సంఖ్యను కుదించే నిర్ణయాలు తీసుకోవచ్చునని అంటున్నారు. ఇలా అయితే క్రీడల నిర్వహణలో మునుపటి పండుగ వాతావరణం కనిపించకపోవచ్చు. 


కరోనా తర్వాత క్రీడల నిర్వహణ పూర్వంలా ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఆయా రంగాల క్రీడారంగ దిగ్గజాలు, సంస్థలు.. సంబంధిత అధికారులతో సమాలోచనలు జరిపి స్పష్టమైన ప్రణాళికలు రూపొందించడం అవసరం. మైదానాల్లో భౌతికదూరం పాటించడానికి వీలుగా ఎలాంటి మార్పులు చేయాలో ఒక అవగాహనకి రావడం సముచితం. ఈ విషయాలపై క్రీడాభిమానులకి కూడా పూర్తి అవగాహన కల్పించడం ఉత్తమం. లేనిపక్షంలో ఖాళీ స్టేడియాల్లో ఈవెంట్స్‌ నిర్వహించాల్సి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. చూద్దాం.. వచ్చే రోజుల్లో క్రీడారంగ స్వరూపం ఎలా ఉండబోతున్నదో! 


ఏ క్రీడల పరమార్థమైనా వినోదాన్ని పంచడమే. ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని మనలో నింపడమే. శారీరక, మానసిక ఆరోగ్యానికి అవసరమైన వ్యాయామ స్ఫూర్తిని అందించడమే. అందువల్ల ఈ రంగం ఎంత త్వరగా కరోనా ప్రభావం నుంచి కోలుకుంటే అంత మంచిది. అదే జరగాలని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం. 

Updated Date - 2020-05-13T20:40:43+05:30 IST