సినీ పరిశ్రమకు విలన్‌లా కరోనా.. తర్వాతి సీన్ ఏంటి?

ABN , First Publish Date - 2020-04-24T22:41:47+05:30 IST

మంచి సబ్జెక్ట్‌ దొరికింది. కంటెంట్‌ అదిరింది. టైటిల్‌ రిజిస్టర్‌ చేసుకోవడమే తరువాయి. సెట్స్‌లోకి వెళ్లడమే ఆలస్యం.

సినీ పరిశ్రమకు విలన్‌లా కరోనా.. తర్వాతి సీన్ ఏంటి?

ఏబీఎన్‌ స్పెషల్‌ ఫోకస్‌కి స్వాగతం. మంచి సబ్జెక్ట్‌ దొరికింది. కంటెంట్‌ అదిరింది. టైటిల్‌ రిజిస్టర్‌ చేసుకోవడమే తరువాయి. సెట్స్‌లోకి వెళ్లడమే ఆలస్యం. బాక్సాఫీస్‌ రికార్డులు తిరగరాయడం ఖాయం. కానీ దర్శక- నిర్మాతలు ఎక్కడ? నటీనటులు ఏరి? ముహూర్తం షాట్‌ ఎప్పుడు? 24 క్రాఫ్ట్స్‌ సిబ్బంది చిరునామా ఏది? సినిమా ఇండస్ట్రీలో అనూహ్యమైన ఈ నిశ్శబ్దం ఎందుకు రాజ్యమేలుతోంది? కరోనా దెబ్బకి హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌ ఇండస్ట్రీలకి ఏ బొమ్మ కనిపిస్తోంది? తిరిగి పూర్వపు సందడి నెలకొనేది ఎప్పుడు?


2020 జనవరి మొదటి వారంలో చైనాలోని వూహాన్‌లో కరోనా కలకలం మొదలైంది. క్రమేపీ ఆ ప్రకంపన ప్రపంచమంతా పాకిపోయింది. లాక్‌డౌన్‌, ట్రావెల్‌బ్యాన్‌ వంటి ఆంక్షలతో దేశదేశాల్లో సకల కార్యకలాపాలు బందయ్యాయి. దీంతో ఫిల్మ్‌ ఇండస్ట్రీకి ప్యాకప్‌ తప్పలేదు. ఎక్కడి షూటింగ్‌లు అక్కడే బంద్‌. కొత్త చిత్రాల రిలీజ్‌లు లేవు! సెట్స్‌పైకి వెళ్లాల్సిన సినిమాలకి షాక్‌. ఇలా కరోనా దెబ్బకి చలనచిత్ర రంగమే చలనరహితంగా మారింది. జేమ్స్‌బాండ్‌ సినిమాకే బ్రేక్‌ పడితే.. ఇక లోకల్‌ బాండ్ల సంగతి ఓ లెక్కా చెప్పండి!


సినిమా అంటే కొందరికి వినోదం. కొందరికి పిచ్చి. కొందరికి కళ. కొందరికి ఉపాధి. ఇంకొందరికి అదే జీవిత సర్వస్వం. ఆ రంగాన్ని నమ్ముకున్న ట్వంటీఫోర్‌ క్రాఫ్ట్స్‌కి చెందిన ఎవరినైనా టచ్‌ చేసి చూడండి- "సినిమానే లైఫురా మామ... లైఫంటే సినిమా మామ..'' అన్న పాట వినిపిస్తుంది. అలాంటి చిత్రసీమకే కొత్త కష్టం వచ్చిపడింది. కరోనా కాటుతో నిర్జనంగా మారింది. లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్లు క్లోజ్‌. షాపింగ్‌ మాల్స్ బంద్‌. మల్టీఫ్లెక్స్‌లు బంద్‌. కలెక్షన్లు బంద్‌. 


హాలీవుడ్‌ తర్వాత ప్రపంచంలో అత్యధిక సినిమాలు విడుదలయ్యే ఫిల్మ్‌ ఇండస్ట్రీకి కేరాఫ్‌ అడ్రస్‌ భారతదేశం. బాలీవుడ్‌ ఆ తర్వాత వరుసలో టాలీవుడ్‌ది నెక్ట్స్‌ ప్లేస్‌! లాక్‌డౌన్‌ తర్వాత టాప్‌ స్టార్ల చిత్రాలు అనేకం విడుదలకి నోచుకోలేదు. భారీ బడ్జెట్‌ సినిమాల విడుదల వాయిదా పడితే ఆ మేరకు ఇండస్ట్రీ కూడా భారీగానే నష్టపోతుంది. మనీ జనరేషన్‌ లేకపోతే ఏ రంగానికైనా మనుగడ కనాకష్టమే కదా? గత నెల రోజుల్లోనే భారత చిత్రపరిశ్రమకు మూడువేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు సమాచారం! టాలీవుడ్‌ సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల నష్టపోయిందని లెక్క! తెలుగునాట సుమారు 1800 సినీ థియేటర్లు ఉన్నాయి. ఇవి మూతపడటంతో ఈ నెల రోజుల్లో సుమారు నాలుగు వందల కోట్ల మేరకు నష్టం జరిగినట్టు అంచనా!


మన దేశంలో ప్రతీ ఏటా అన్ని భాషలలో కలిపి సుమారు వేయి సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. అనువాద చిత్రాలూ ఇందులో భాగమే. అన్ని సినిమాల ద్వారా దాదాపు పదివేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని సినీట్రేడ్‌ వర్గాలు చెబుతాయి. గత ఏడాది భారతీయ సినీరంగ రాబడి 10,948 కోట్ల రూపాయలట! ఒక్క టాలీవుడ్‌ రాబడే వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల వరకూ ఉండొచ్చని చెబుతారు. ఒక సినిమా నిర్మాణం జరుగుతుందంటే దానిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 నుంచి 60 కుటుంబాలు జీవిస్తుంటాయి. భారీ బడ్జెట్‌ మూవీ అయితే సుమారు 30 నుంచి 60 కుటుంబాలకి ప్రత్యక్ష జీవనోపాధి లభిస్తుంది. సినిమా నిర్మాణం అయ్యాక బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, వారివద్ద పనిచేసే సిబ్బందికి చేతినిండా పని. వీరు కాకుండా థియేటర్ల వద్ద రెస్టారెంట్లు, టీ దుకాణాలు వంటివి నడిపేవారికీ ఉపాధి లభిస్తుంది. లాక్‌డౌన్‌ వల్ల వీరందరి జీవనాధారం ప్రశ్నార్థకంగా మారింది. కరోనా గ్రహణం వీడినా.. మునుపటి వేగంతో సినిమా నిర్మాణరంగం పుంజుకుంటుందా? అన్న సందేహాలు అందరినీ పట్టిపీడిస్తున్నాయి. 


ఉన్న పళంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో చిత్ర ప్రముఖులంతా ప్రస్తుతం ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటిపట్టునే ఉన్న ప్రేక్షకులకి మాత్రం టీవీల్లో, కంప్యూటర్లలో కాస్తయినా ఎంటర్‌టైన్‌మెంట్‌ దొరుకుతోంది. కరోనా వంటి సబ్జెక్ట్‌లతో వచ్చిన సినిమాల చిట్టాని వారంతా తెగ శోధించి ఆ మూవీలు వీక్షిస్తున్నారట. ఈ కోవలో కంటేజియన్, వైరస్, ప్లూ, బ్లైండ్‌నెస్, మంకీస్ వంటి చిత్రాలు ఉంటున్నాయట! లాక్‌డౌన్‌ పిరియడ్‌లో చాలామంది వీక్షకులు నెట్ ఫ్లిక్స్, అమేజాన్ వంటి ఓటీటీ మాధ్యమాలకి అలవాటుపడుతున్నారు. కొన్ని కొత్త సినిమాలు నేరుగా ఓటీటీలోనే విడుదలయ్యాయి కూడా! రేపటినాడు పరిస్థితులు చక్కబడినా.. థియేటర్లకి రావడానికి జనాలు అంత ఇష్టపడకపోవచ్చు. అప్పుడు ఈ ఓటీటీ అనేది ప్రత్యామ్నాయంగా మారుతుంది. అదే జరిగితే థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గిపోతుంది. ఫలితంగా.. ఫంక్షన్‌ హాల్స్‌గానో, కల్యాణమండపాలుగానో మారే థియేటర్ల సంఖ్య పెరగొచ్చు. 



లాక్‌డౌన్ కారణంగా భారత సినీ పరిశ్రమ ఆదాయం ప్రస్తుతం జీరోగా మారింది. స్టూడియో నిర్వాహకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకి ఇది తీవ్ర కష్టకాలం. అప్పులు తీసుకున్న నిర్మాతల ఆందోళన ఇంతాఅంతా కాదు. దేశంలో ఉన్న 10 వేల థియేటర్లకి తాళం పడింది. వీటిలో సుమారు అయిదు లక్షలమంది పనిచేస్తున్నారు. వీరంతా ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ముందు కరోనా- వెనుక కరోనా అన్నట్టుగా తయారైందన్న మాట!


నిజానికి కొత్త సినిమా విడుదలైతే ఆ సందడే వేరు. థియేటర్ల దగ్గర టిక్కెట్ల కోసం అభిమానులు దండెత్తే దృశ్యాలు అసంఖ్యాకం. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూడటం కోసం పోటీపడే అభిమానులకి లెక్కలేదు. కిటకిటలాడే ప్రేక్షకులతో థియేటర్లు జాతర చేసుకునేవి. అయితే ఇలాంటి దృశ్యాలు ఇకపై కనిపించే అవకాశం లేదని సినీపండితులు చెబుతున్నారు. కరోనా కష్టం నుంచి ఫిల్మ్‌ ఇండస్ట్రీ బయటపడినా.. గత సన్నివేశాలు పునరావృతం కాకపోవచ్చునని అంటున్నారు. కరోనా వంటి అంటువ్యాధులు మళ్లీ ప్రబలవన్న గ్యారంటీ లేదు. కనుక.. సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం అనేది అనివార్యం అవుతుందట. ప్రజలు గుమిగూడే ప్రదేశాలపై ప్రభుత్వాలు ఆంక్షలు కొనసాగించే ఛాన్స్‌ ఉందట. అందువల్ల లాక్‌డౌన్‌ ఎత్తివేసినా.. మరికొన్నాళ్లపాటు థియేటర్లు, షాపింగ్‌మాల్స్‌ వంటివి తెరుచుకోకపోవచ్చునని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మల్టీపెక్సులు సహా మామూలు థియేటర్లలో మార్పులు- చేర్పులు చేయక తప్పదంటున్నారు. ఒక సీటుకీ మరో సీటుకీ మధ్య స్పష్టమైన గ్యాప్‌ ఉండేలా అరేంజ్‌మెంట్‌ చేస్తారట. లేదా ఒక టిక్కెట్‌కీ మరో టిక్కెట్‌కీ మధ్య ఒకటీ లేదా రెండు సీట్లను ఖాళీగా వదిలిపెట్టే విధంగా చర్యలు తీసుకుంటారట. ప్రతి షో తర్వాత థియేటర్‌ని శానిటైజ్‌ చేయాలన్న ప్రతిపాదనలు సైతం పరిశీలనలో ఉన్నాయట. ఇలాంటివి చేస్తే ఆరోగ్య పరిరక్షణ మాటేమో గానీ.. థియేటర్ల యాజమాన్యాలకి ఆర్ధిక భారం పడుతుంది! ఒకవైపు నిర్వహణ ఖర్చులు పెరిగి, మరోవైపు ఆక్యుపెన్సీ తగ్గితే ఆ మేరకు నష్టపోయేది వారే కదా! ఈ నష్టాన్ని భరించడానికి టిక్కెట్‌ ధరలు పెంచాలన్న డిమాండ్‌ తెరపైకి రావచ్చు. అదే జరిగితే.. థియేటర్లకి వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గవచ్చు. 


లాక్‌డౌన్‌ వల్ల హీరోహీరోయిన్ల ఆదాయానికి కూడా గండిపడింది. చిత్ర నిర్మాణం ఆగిపోవడం వల్ల వెంటనే వారికొచ్చే నష్టం ఏమీలేదు. కానీ షాపుల ఓపెనింగ్‌లు, కొత్త ఎండార్స్‌మెంట్లు, ఫోటోషూట్‌లు, యాడ్స్‌ వంటివి లేవు. ఈ రకంగా వారికీ కరోనా దెబ్బ తగిలినట్టే లెక్క! కరోనా వల్ల ఫారిన్‌ షూటింగ్‌లు కూడా బందయ్యాయి. అందువల్ల ఆయా బ్యాక్‌డ్రాప్‌లతో అల్లిన కథాంశాల్లో మార్పులు చేసుకుని లోకల్‌ లోకేషన్స్‌తో సరిపెట్టుకోక తప్పదు. అంటే ఫారిన్‌లో షూటింగ్‌ అనే మాట ఇప్పట్లో వినబడకపోవచ్చన్న మాట! 


కరోనా తర్వాత.. సినిమా షూటింగ్‌లు మునుపటి తరహాలో జరిగే అవకాశం లేదంటున్నారు. సోషల్‌ డిస్టెన్స్‌ అనే మాట ఈ రంగంపై గట్టి ప్రభావమే చూపుతుందట. ఉదాహరణకి వందమందితో చిత్రీకరించవలసిన ఒక సన్నివేశం పాతికమందితోనే పూర్తిచేసే ఛాన్స్‌ ఉందట. ఆ తర్వాత ఆ సీన్‌లో అధిక జనం ఉన్నట్టుగా గ్రాఫిక్స్‌తో మాయ చేస్తారట. ఇలాంటి పరిణామాల వల్ల చిత్రనిర్మాణం ఆలస్యం కావడంతోపాటు, ఆర్థిక భారం కూడా పడొచ్చు. ఈ నేపథ్యంలో రెమ్యూనరేషన్‌లు తగ్గించుకోమని టాప్‌ స్టార్లను నిర్మాతలు కోరే అవకాశం ఉంది. దీనితోపాటు లోకల్ టాలెంట్‌కి పెద్దపీట వేసే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఈ ఒక్క పరిణామం మాత్రం చిత్రసీమకి ఎంతోకొంత మేలు చేస్తుందని సినీపండితులు వ్యాఖ్యానిస్తున్నారు. 


సమ్మర్‌ సీజన్‌ సినీ పరిశ్రమకి పండుగతో సమానం. పిల్లలకి వేసవి సెలవుల కారణంగా థియేటర్లకి వచ్చేవారి సంఖ్య పెరుగుతుంది. అందుకే.. పెద్ద హీరోలు కూడా ఈ సీజన్‌లో తమ చిత్రాలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంటారు. అయితే కరోనా ప్రభావం ఈ వేసవిని పూర్తిగా మింగేసింది. దీంతో బాలీవుడ్‌, టాలీవుడ్‌ రంగాలకు చెందిన ఎన్నో చిత్రాల విడుదలకి సడెన్‌బ్రేక్‌ పడింది. టాప్‌ హీరో చిత్రం విడుదలైతే రెండు వారాల్లోనే వంద నుంచి రెండువందల కోట్లు రాబట్టే అవకాశముంది. ఈ మేరకు ఇండస్ట్రీ రొటేషన్‌కి దెబ్బ పడినట్టే కదా! 


సినీ ప్రముఖులు తమ వంతు బాధ్యతగా విరాళాలు ఇవ్వడం పరిపాటి. అయితే ఈసారి కరోనా దెబ్బకి ఫిల్మ్‌ఫీల్డే అల్లాడే పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో పరిశ్రమకి చెందిన పెద్దలు, నటీనటులు ప్రభుత్వానికి భారీ విరాళాలు అందించారు. అంతేకాదు- తమ ఇండస్ట్రీని కూడా కాపాడుకునేందుకు నడుంకట్టారు. మెగాస్టార్‌ చిరంజీవి 'కరోనా క్రైసిస్ ఛారిటీ' పేరిట సేవాకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిద్వారా ఇబ్బందుల్లో ఉన్న వేలమంది సినీ కార్మికులు, సాంకేతిక సిబ్బందిని ఆదుకుంటున్నారు. ఈ కోవలో మరెందరో సేవలందిస్తున్నారు. పెద్ద మనసున్న వీరందరికీ వందనాలు చెప్పడం మన విధి! 


పెద్దతెరకే కాదు.. బుల్లితెరకీ కరోనా సోకింది. కమర్షియల్‌ టీవీ ఛానెల్స్‌ కూడా ఈ నెల రోజుల్లో ప్రభ కోల్పోయాయి. సీరియల్స్‌, గేమ్‌షోలు, రియాలిటీ షోల షూటింగ్‌లు నిలిచిపోయాయి. దీంతో పాత సీరియల్స్‌నే పునఃప్రసారం చేస్తున్నారు. ఆ మేరకు యాడ్‌ రెవిన్యూ తగ్గిపోయినట్టే కదా! లాక్‌డౌన్‌ ఎత్తివేసినా.. టీవీ కార్యక్రమాలను స్పాన్సర్‌ చేసే కంపెనీల సంఖ్య తగ్గవచ్చని మీడియా నిపుణులు విశ్లేషిస్తున్నారు. 


చివరిగా.. ఈ కరోనా కష్టాలు తీరి.. సినీపరిశ్రమ మళ్లీ తారల తళుకులతో మెరవాలంటే ఇందుకు ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా ఎంతో అవసరం. విద్యుత్‌ ఛార్జీలు తగ్గించడం, టాక్స్‌ మినహాయింపులు ప్రకటించడం, టిక్కెట్‌ రేట్లను పెంచుకునే అవకాశం కల్పించడం వంటి వెసులుబాట్లు కల్పించాలని ఫిల్మ్‌ఇండస్ట్రీ ప్రముఖులు కోరుతున్నారు. ఈ దిశగా పాలకులు తగిన చర్యలు తీసుకుంటారనే ఆశిద్దాం. 


కరోనా అనే గ్రహణం తొలగిపోక తప్పదు. ఆ పీడ విరగడయ్యాక తప్పకుండా చిత్రసీమలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఎందుకంటే దేశంలో అతిపెద్ద ఉపాధి రంగాలలో ఇది కూడా ఒకటి. ఈ రంగం సుభిక్షంగా ఉండటం అవసరం. అదే జరగాలని మనసారా కోరుకుందాం. 

Updated Date - 2020-04-24T22:41:47+05:30 IST