కరోనా తర్వాత జీవితం ఎలా ఉండబోతోంది?
ABN , First Publish Date - 2020-04-21T22:09:50+05:30 IST
ఒకవేళ కరోనా పీడ విరగడయ్యే రోజు వచ్చినా.. ఈ పరిణామం మాత్రం చాలాకాలం వెంటాడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో లైఫ్ ఆఫర్ట్ కరోనా గురించి సింహావలోకం చేసుకోవడం అవసరం!

కరోనా వైరస్ మానవాళిని ఇంకా వణికిస్తూనే ఉంది.. చరిత్ర పుటల్లో ఇదొక విషాదశకంగా చోటుచేసుకుంది. ప్రగతికి ప్రమాణంగా మనం నిర్దేశించుకున్న అన్ని సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. ఆర్థిక రంథచక్రాలు ఊబిలో కూరుకుపోతున్నాయి. ఈ మందగమనం తరతమ భేదాలు లేకుండా అన్ని దేశాలను అతలాకుతలం చేస్తోంది. బహుళజాతి సంస్థలు మొదలు చిన్నాచితకా సంస్థల వరకూ అన్నీ బిక్కుబిక్కుమంటున్నాయి. కోట్లాది మందికి ఉపాధి కరువయ్యే రోజులొచ్చాయి.. ఒకవేళ కరోనా పీడ విరగడయ్యే రోజు వచ్చినా.. ఈ పరిణామం మాత్రం చాలాకాలం వెంటాడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో లైఫ్ ఆఫర్ట్ కరోనా గురించి సింహావలోకం చేసుకోవడం అవసరం!
కరోనా దెబ్బకి ప్రపంచమే ముసుగేసుకుంది. మార్కెట్‌లో అమ్మేవాళ్లు లేరు. కొనేవాళ్లు లేరు. ఉత్పత్తికి ఊతమిచ్చే డిమాండ్ లేదు. ఇప్పటికే గొడౌన్లలో ఉన్న సరుకుకి గిరాకీ లేదు. రవాణా చేసే వ్యవస్థ లేదు. పోదామంటే మాల్స్ లేవు. చూద్దామంటే సినిమా లేదు. ఇలా గొలుసుకట్టు వ్యవస్థలో ఒకదాని ప్రభావం మరో రంగంపై పడి సర్వం కుదేలవుతున్న వింత పరిణామం. ఈ నేపథ్యంలో "కరోనాకి ముందు- కరోనా తర్వాత'' అనే కొత్త దృష్టికోణంతో మన దేశంలో వివిధ రంగాల పరిస్థితి ఎలా ఉందో, ఎలా ఉండబోతున్నదో చూద్దాం.
అదొక ప్రమాదకర వైరస్! ఆ పేరు చెప్తే ప్రపంచానికే టెర్రర్!! చైనాలోని వూహాన్‌లో బయటపడిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. వంద రోజుల్లో రెండు వందలకు పైగా దేశాలకు వ్యాపించింది. లక్షకు పైగా ప్రాణాలను హరించింది. భారత్‌లోనూ మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా కారణంగా మార్చి 24 నుంచి మన దేశంలో లాక్‌డౌన్ అమల్లో ఉంది. మే 3వ తేదీ వరకూ ఇదే పరిస్థితి. ప్రపంచంలోని అత్యధిక దేశాల్లోనూ హెల్త్ ఎమర్జెన్సీ కొనసాగుతోంది. భారత్ విషయానికే వస్తే.. లాక్‌డౌన్ అనేది ఒక విచిత్రమైన అనుభవం. కనీవినీ ఎరుగని రీతిలో సాగుతోన్న భారత్ బంద్. వంద రోజుల క్రితం మన దేశంలో మహానగరాలు మొదలు గ్రామసీమల వరకూ ఎక్కడ చూసినా మానవ పరిమళమే. రోడ్లపై జనం. చౌరస్తాల్లో జనం. పార్కుల్లో జనం. మాల్స్‌లో జనం. బస్సుల్లో జనం. ఆఫీసులు, థియేటర్లు, హోటళ్లు, విద్యాసంస్థలు- ఇలా ఏ దక్కుకి చూసినా జనమే.. ఇప్పుడు ఎటుచూసినా మనిషి అలికిడి లేదు. బోసిపోతున్న రోడ్లు. తెరుచుకోని ఆఫీసులు. మాల్స్ క్లోజ్. ధియేటర్లు, విద్యాసంస్థలు, హోటళ్లకి తాళం. వాహనాల జాడలేదు. హారన్ల మోత లేదు. అన్నిచోట్లా ఇదే దృశ్యం. కరోనా వైరస్సే ఈ పరిస్థితి కారణం!
ఆటోమొబైల్ రంగం
వంద రోజుల క్రితం ఆటోమొబైల్ రంగం జోరుమీద ఉంది. అక్కడక్కడా రోడ్ బ్రేకర్ల వంటి పదనిసలున్నా.. ప్రయాణం సజావుగానే ఉంది. కార్లు, బైక్‌లు, కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలకి ఢోకాలేదు. ప్రజల కొనుగోలుశక్తి పెరుగుతున్న దృష్ట్యా వాహన తయారీరంగం తీరికలేకుండా ఉండేది.. కరోనా దెబ్బతో వాహన పరిశ్రమలు డీలాపడ్డాయి. కార్ల షోరూముల షెట్టర్లు క్లోజయ్యాయి. మెకానిక్ షెడ్లు తెరుచుకోవడం లేదు. ఆటోమొబైల్ షాపులు బందయ్యాయి. పెట్రోలు బంకుల్లో రోజువారీ రద్దీ కనిపించడం లేదు. టైర్ల అమ్మకాలకి బ్రేక్ పడింది. కొత్త వాహనాలు కొనాలన్న ఆసక్తే కొనుగోలుదారుల్లో కొడిగట్టిపోతోంది..
సినిమా రంగం..
వంద రోజులకి ముందు ఫిల్మ్ ఇండస్ట్రీ వైభవమే వేరు! తారల గురించి ఎడతెగని కబుర్లు, కొత్త సినిమా రిలీజ్‌లు, ఆడియో ఫంక్షన్లు, టీజర్ లాంచింగ్‌లు, సెట్స్‌పైకి వెళ్లబోతున్న మూవీ ముచ్చట్లు, అనునిత్యం ధియేటర్లు, మాల్స్ వద్ద ప్రేక్షకుల కిటకిటలు.. అబ్బో! చిత్రసీమది నిత్య సంబరం- పచ్చ తోరణం. మరి ఇప్పుడో.. వెండితెరకి వెలుగే లేదు. దేశంలో ధియేటర్లన్నింటికీ తాళం. సినిమా షూటింగ్‌లు బంద్. కొత్త సినిమా విడుదలలు వాయిదా. ఇంటికే పరిమితమైన నటీనటులు, దర్శకులు. నిర్మాతలు. అనూహ్యమైన ఈ పరిణామంతో దిగాలుపడిన సాంకేతిక నిపుణులు, చిన్నాచితకా నటులు, డిస్ట్రిబ్యూటర్లు, ధియేటర్ల యాజమాన్యాలు! సినిమా పరిశ్రమే కాదు- కమర్షియల్ టీవీ ఛానెళ్ల పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. సీరియళ్లు, రియాల్టీషోలు, వినోద కార్యక్రమాల షూటింగ్‌లన్నీ రద్దయ్యాయి. ఇది కూడా కరోనా కొట్టిన దెబ్బే!
మీడియా రంగం..
నూరు రోజుల క్రితం మీడియారంగంలో ఎటుచూసినా సందడే. ప్రచార- ప్రసార మాధ్యమాల్లో ఉత్సాహపు వెల్లువే.. క్షణక్షణం ఉత్కంఠభరిత వార్తలతో, బ్రేకింగ్ న్యూస్‌లతో న్యూస్ పేపర్లు, న్యూస్ ఛానెళ్లు ప్రతిరోజూ పండుగ చేసుకునేవి.. ఇప్పుడు.. కరోనా ఎఫెక్ట్ మీడియా రంగంపైన.. ముఖ్యంగా దినపత్రికలపై పడింది. లాక్‌డౌన్ వల్ల పత్రికల సర్క్యూలేషన్ బాగా డౌన్ అయ్యింది. పత్రికల లూజ్ సేల్స్ దాదాపుగా స్తంభించిపోయాయి. పత్రికల ద్వారా కరోనా వస్తుందన్న దుష్ప్రచారాలు కూడా కొందరు మొదలుపెట్టారు. మరోవైపు రవాణా వ్యవస్థ స్తంభించి న్యూస్‌ప్రింట్ కొరత ఏర్పడింది. ఫలితంగా.. పత్రికల పేజీల సంఖ్య కుదించాల్సి వచ్చింది. దీనికితోడు పత్రికలకు ప్రధాన ఆదాయ వనరు అయిన వాణిజ్య ప్రకటనలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో న్యూస్ ఛానెళ్లకి వచ్చే కమర్షియల్ యాడ్స్ కూడా తగ్గిపోవడం గమనార్హం! ఇది కూడా కరోనా మహమ్మారి ప్రభావమే!!
పర్యాటకరంగం
వంద రోజుల క్రితం పర్యాటకరంగం వైభవం ఇంతా అంతా కాదు. దర్శనీయ స్థలాలు, చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, బీచ్‌లు, జలపాతాలు, విహారకేంద్రాలు, రిసార్టులు... ఇవన్నీ సందర్శకుల రద్దీతో కళకళలాడుతూ కనిపించేవి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన ఎన్నో సంస్థలు ప్రత్యేక ప్యాకేజీలతో టూరిస్టులకు నిత్యం సేవలందించే పనిలో బిజీబిజీగా ఉండేవి.. ఇప్పుడు పర్యాటకరంగం పూర్తిగా కళతప్పింది. బయటికి అడుగుపెట్టే అవకాశమే లేదు. బస్సులు, రైళ్లు, విమానాలు, నౌకాయానాలు బంద్. పర్మిషన్ లేకుండా ఎవరైనా రోడ్డెక్కితే చాలు- పోలీసులు బడితపూజ చేస్తున్నారు! ఇలాంటి సమయంలో ఎవరు మాత్రం విహారయాత్రలు చేస్తారు చెప్పండి? అందుకే సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాలు సహా దర్శనీయ ప్రదేశాలన్నీ పూర్తిగా బోసిపోయాయి. ఇది కూడా కరోనా ఎఫెక్టే!
పారిశ్రామిక రంగం
వంద రోజుల క్రితం దేశంలో అన్ని పరిశ్రమలు మూడు షిఫ్టుల్లో పనిచేశాయి. ఉత్పాదకతలో పోటీపడ్డాయి. కార్మికలోకం శ్రమలోనే ఆనందాన్ని వెతుక్కుంది. పారిశ్రామిక పురోగతి ఉపాధిరంగానికి ఆశాదీపంలా భాసిల్లింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారీ లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతోంది.. ఈ క్రమంలోనే కారోనా మహమ్మారి ఆ రంగాన్ని కూడా కాటేసింది. దెబ్బకి పరిశ్రమలన్నీ షట్టర్లు మూసేయక తప్పని స్థితి!
ఐటీ రంగం..
నూరు దినాల కిందట ఐటీరంగం పరిస్థితే వేరు. ఆ రంగంలో ఉద్యోగం చేయడం అంటే ఒక దర్పం. చిన్నసైజు సెలబ్రిటీ స్టేటస్. ఏ లోటు లేని లగ్జరీ లైఫ్. కంపెనీలు ఇచ్చిన టార్గెట్లను పూర్తిచేసి ఇన్సెన్టీవ్‌లు పొందాలని ఒకటే తహతహ.. ఒక ప్రాజెక్ట్ పూర్తిచేసే లోగా సిద్ధంగా ఉండే కొత్త కొత్త అసైన్‌మెంట్లు.. ఇలా ఉండేది ఆ స్పీడు.. కరోనా దెబ్బతో ఇప్పుడు ఐటీరంగంలో భారీ కుదుపు. రేపటికి ఉద్యోగం ఉంటుందో లేదోనని బెంగ. కొత్త ప్రాజెక్టులు వస్తాయో రావోనని సందిగ్ధం. పెద్ద పెద్ద సంస్థలు కూడా ఉద్యోగులను తగ్గిస్తున్నాయంటూ వార్తలు. ఐటీరంగంపై ఆధారపడిన, ఆ వైపుగా ఆశగా చూస్తున్న భారతీయ యువతలో తీవ్ర నిరాశ- నిస్పృహలు!
రియల్ ఎస్టేట్..
వంద రోజుల క్రితం మన దేశంలో రియల్‌ఎస్టేట్ బిజినెస్ గ్రాఫ్ పైపైకి ఎగబాకింది. నిర్మాణరంగం బాగా పుంజుకుంది. వ్యవసాయరంగం పచ్చపచ్చగా ఉంది. ఫుడ్ ఇండస్ట్రీకి ఏ ఢోకా లేదు. హెల్త్ సెక్టార్ లాభాల్లో ఉంది. విమానయాన రంగం ఆకాశమే హద్దు అన్నట్టుగా ఉంది.. ఇప్పుడా రంగాలన్నీ నేలచూపులు చూస్తున్నాయి. రియల్‌ఎస్టేట్‌తోపాటు నిర్మాణరంగం కుదేలవడంతో మన దేశంలో కోట్లమంది ఉపాధికి దూరమయ్యారు. వ్యవసాయ సంక్షోభాన్ని మాటల్లో చెప్పలేం. రైతుల బాధ వర్ణనాతీతం. పక్వానికొచ్చిన పంటని కోయిద్దామంటే కూలీలు దొరకని పరిస్థితి. పండ్లతోటల్లో ఫలసాయం చేతికందే యోగం లేదు. ఈ దుస్థితికి కూడా కరోనాయే అసలు కారణం..
మన దేశంలో అనేక రంగాలు ఇప్పుడు కరోనా బారిన పడ్డాయి. ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కో రంగంలోని పరిస్థితిని సమీక్షించుకుందాం. ఆయా రంగాలు మళ్లీ పుంజుకుని పూర్వవైభవం సంతరించుకోవాలంటే సమయం పడుతుంది. ప్రభుత్వాలు అందించే ఉద్దీపనలు ఆ దిశగా ఊతం ఇస్తాయని ఆశిద్దాం.