ఇది రైలా? విమానమా?.. ఇండియన్ రైల్వే కొత్త బోగీలు చూశారా?

ABN , First Publish Date - 2020-12-30T17:06:51+05:30 IST

మన దేశంలో దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఉపయోగించేది రైలు మార్గాలే. సాధారణ, మధ్యతరగతి వాళ్లు ఎక్కువగా రైలు ప్రయాణాలే చేస్తారు.

ఇది రైలా? విమానమా?.. ఇండియన్ రైల్వే కొత్త బోగీలు చూశారా?

ఇంటర్నెట్ డెస్క్: మన దేశంలో దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఉపయోగించేది రైలు మార్గాలే. సాధారణ, మధ్యతరగతి వాళ్లు ఎక్కువగా రైలు ప్రయాణాలే చేస్తారు. కానీ మన రైల్వే వ్యవస్థ అంత అద్భుతంగా ఉండదని, ఇతర దేశాలతో పోల్చుకుంటే మన రైళ్లు, వాటి హైజీనిటీ చాలా తక్కువని విమర్శలు ఉన్నాయి.  అయితే ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో ఇండియన్ రైల్వేస్ కూడా ఒకటి. దీనిలో 13 లక్షల మందికిపైగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంత మందికి ఉద్యోగావకాశాలు కల్పించే మరో రంగం లేదనడం అతిశయోక్తి కాదు.


కరోనా కారణంగా చాలా రైళ్లు ఆపేశారు కానీ, మన దేశంలో సుమారు లక్షా పదిహేను వేల మైళ్ల పొడవున రైలు మార్గాలున్నాయి. అలాగే 13వేలపైగా రైళ్లు కూడా ఉన్నాయి. కానీ ప్రయాణికులకు సౌకర్యం మాత్రం అంత గొప్పగా ఉండదనే విమర్శలు ఉన్నాయి. వీటన్నింటికీ సమాధానం ఇవ్వడానికి అన్నట్లుగా కొత్తగా రైలు బోగీలను డిజైన్ చేస్తోంది ఇండియన్ రైల్వేస్. ఈ బోగీలు, వాటిలో సదుపాయాలు చూస్తే.. ఇది రైలా? లేక విమానమా? అని ఆశ్చర్యపోక తప్పడం లేదు. 


రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. దీనిలో నూతనంగా తయారు చేస్తున్న రైలు బోగీల మోడల్‌ను ఆయన చూపించారు. ‘‘ప్రయాణాన్ని జ్ఞాపకాల్లో కొలవాలికానీ, మైళ్లలో కాదు’’ అనే సూక్తిని ప్రస్తావించిన పీయూష్ గోయల్.. ‘‘ఇండియన్ రైల్వేస్ తయారు చేస్తున్న కొత్త విస్తాడోమ్ బోగీలను మీరు కూడా చూడండి. వీటిలో ప్రయాణిస్తే మీరు కచ్చితంగా మర్చిపోలేని అనుభవాన్ని పొందుతారు’’ అని పేర్కొన్నారు. ఈ విస్తాడోమ్ బోగీల్లో సీట్ల మధ్య గ్యాప్ కానీ, సీట్లు కానీ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉన్నాయి. అంతే కాదు, సీట్ల ఫేసింగ్‌ను కూడా మనకు అనుగుణంగా మార్చుకోవచ్చు. ప్రతి బోగీలో సీసీ కెమెరాలు కూడా అమర్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇది రైలేనా? లేక విమానమా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.Updated Date - 2020-12-30T17:06:51+05:30 IST