గూడ్సు రైళ్ల కప్లింగ్‌లపై బాలిక ప్రయాణం... దారిలో ఏం జరిగిందంటే...
ABN , First Publish Date - 2020-12-13T17:58:58+05:30 IST
యూపీలోని లలిత్‌పూర్‌నకు చెందిన 14 ఏళ్ల బాలిక గ్రామ సమీపంలోని...

లలిత్‌పూర్: యూపీలోని లలిత్‌పూర్‌నకు చెందిన 14 ఏళ్ల బాలిక గ్రామ సమీపంలోని రైలు పట్టాలపై ఆగివున్న గూడ్సు రైలు కప్లింగ్‌పైకి ఎక్కికూర్చుంది. ఇదే విధంగా 10 రోజుల పాటు వివిధ రైళ్ల కప్లింగ్‌లపైకి ఎక్కుతూ ఇటూ, అటూ రాకపోకలు సాగించింది. అయితే శుక్రవారం కాన్పూర్ స్టేషన్ వద్ద ఆర్పీఎఫ్ సిబ్బందికి గూడ్సు రైలు కప్లింగ్ పైన కూర్చున్న ఈ బాలిక కనిపించింది. ఆమె దగ్గరకు వెళ్లిన సిబ్బందితో ఆ బాలిక తాను గత 10 రోజుల నుంచి ఇదేవిధంగా వివిధ రైళ్ల కప్లింగ్‌లపై కూర్చుని ఇటునటు తిరుగుతున్నానని చెప్పింది. తరువాత ఆ బాలిక తన తండ్రి ఫోన్ నంబరు వారికి చెప్పింది. దీంతో వారు ఆ బాలిక తండ్రికి సమాచారం అందించారు. ఫోనులో మాట్లాడిన తండ్రి తన కుమార్తె మానసిక స్థితి సరిగా లేదని తెలిపారు.
డిసెంబరు ఒకటవ తేదీ నుంచి కుమార్తె కనిపించడం లేదని తెలిపారు. ఇప్పుడు కుమార్తె గురించిన సమాచారం అందడంతో వారు ఆనందంగా కాన్పూర్ చేరుకుని, తమతో పాటు కుమార్తెను తీసుకువెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గణెష్‌పూర్ గ్రామానికి చెందిన రామ్‌జీవన్ కుమార్తె నేహ(14) డిసెంబరు ఒకటిన గ్రామ సమీపంలోని రైలు పట్టాలపై నిలిచివున్న గూడ్సురైలు కప్లింగ్‌లపైకి ఎక్కికూర్చుంది. ఇంతలో ఆ గూడ్సు రైలు ముందుకు కదిలింది. కుమార్తె కనిపించకపోవడంతో ఇంటిలోని వారు ఈ విషయమై డిసెంబరు 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఆ బాలిక కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద ఆర్పీఎఫ్ సిబ్బందికి కనిపించింది. ఆ బాలిక వారికి తాను ఎక్కడ గూడ్సు రైలు ఎక్కిందీ, ఆ తరువాత ఏం జరిగిందనే విషయాలను తెలిపింది. తాను ఎక్కిన గూడ్సు ఆగిపోగానే మరో గూడ్సు రైలు కప్లింగ్ ఎక్కికూర్చున్నానని, ఇలా అనేక గూడ్సు రైళ్ల కప్లింగ్‌లు ఎక్కుతూ ఇక్కడకు చేరుకున్నానని తెలిపింది. ఏదైనా స్టేషన్ కనిపించినపుడు ప్రయాణికులను ఆహారం అడిగి తినేదానినని పేర్కొంది.