అమ్మకు అవమానం... కుమారునికి లిప్‌స్టిక్... ఫొటో వైరల్!

ABN , First Publish Date - 2020-11-15T17:50:10+05:30 IST

ఎర్రని లిప్‌స్టిక్ పెట్టుకున్న తన తల్లిని అవమానించారని ఒక యువకుడు తన...

అమ్మకు అవమానం... కుమారునికి లిప్‌స్టిక్... ఫొటో వైరల్!

కోల్‌కతా: ఎర్రని లిప్‌స్టిక్ పెట్టుకున్న తన తల్లిని అవమానించారని ఒక యువకుడు తన బంధువులకు విచిత్ర రీతిలో దిమ్మతిరిగిపోయే సమాధానం చెప్పాడు. ఈ ఉదంతం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో చోటుచేసుకుంది. 54 ఏళ్ల మహిళ తన పెదాలకు ఎర్రని లిప్‌స్టిక్ రాసుకోవడంతో బంధువులు ఆమెను ఎగతాళి చేస్తూ, రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. ఈ వయసులో ఇలాంటి లిప్‌స్టిక్ రాసుకోవద్దని సలహా కూడా ఇచ్చారు. ఈ ఉదంతం వారి బంధువుల ఇంటిలో వేడుక జరుగుతుండగా చోటుచేసుకుంది. ఈ సమయంలో ఆమె కుమారుడు పుష్పక్ కూడా అక్కడే ఉన్నాడు. తల్లిని బంధువులు అవమానించడాన్ని పుష్పక్ ఏమాత్రం తట్టుకోలేకపోయాడు. అదేరోజు సాయంత్రం పుష్పక్ ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటోలో పుష్పక్ గడ్డంతో కనిపిస్తున్నాడు. అలాగే కళ్లకు కాటుక, పెదాలకు ఎర్రని లిప్‌స్టిక్ పెట్టుకున్నాడు. ఒక చేతిలో లిప్‌స్టిప్ పట్టుకున్నాడు. ఈ ఫొటో చూసిన పుష్పక్ బంధువర్గంలో కలకలం చెలరేగింది. 


తల్లిని అవమానించిన వారికి సరైన సమాధానం ఇచ్చిన పుష్పక్‌ను నెటిజన్లు అభినందించారు. పుష్పక్ ఈ ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా, దీనికి 17 వేలకు మించిన లైక్‌లు వచ్చాయి. కాగా ఈ ఫొటోను పోస్ట్ చేసిన పుష్పక్  దానిలో... ‘మా అమ్మకు 54 ఏళ్లు, మా బంధువుల ఇంట జరిగే వేడుకకు అమ్మ ఎర్రని లిప్‌స్టిక్ పెట్టుకుని రావడంతో కొందరు బంధువులు అవమానకరంగా మాట్లాడారు. దీంతో మా అమ్మ బాధపడింది. వారికి సమాధానం చెప్పేందుకే నేను ‘గుడ్ మార్నింగ్, త్వరగా మంచిగా మారండి’ అంటూ ఈ ఫొటో షేర్ చేశాను. ఆ వేడుక సందర్బంలో ఒక విషయం నాకు అర్థం కాలేదు. అక్కడ మా బంధువుల పిల్లలంతా ఉన్నారు. మా అమ్మను కొంతమంది అవమానిస్తున్నా... వారెవరూ నోరు మెదపలేదు. ఇప్పుడు నేను గడ్డంతో ఉంటూ ఎర్రని లిప్‌స్టిక్ పెట్టుకున్నాను. తల్లులు, సోదరీమణులు, మహిళలందరికీ నా రూపాన్ని చూపిస్తున్నాను. ఈ భద్రతలేని సమాజంలోని కొన్ని విషశక్తుల కారణంగా మన అభీష్టాలను అణచి వేసుకోవాల్సివస్తోంది’ అని రాశారు. 

Updated Date - 2020-11-15T17:50:10+05:30 IST