ఐదో అంతస్తు నుంచి పడిన బాలుడు... ఎలా పట్టుకున్నారంటే...
ABN , First Publish Date - 2020-07-18T11:42:44+05:30 IST
ఐదో అంతస్తులోని కిటికీ నుంచి బయటకు వచ్చి, పట్టుతప్పి, కింద పడిపోతున్న బాలుడిని చూసిన స్థానికులు కేకలు పెట్టారు. అయితే ఇంతలో ఒక వ్యక్తి ఆ బాలుడిని కాపాడాడు. ఈ సంఘటనకు...

జియాంగ్స్: ఐదో అంతస్తులోని కిటికీ నుంచి బయటకు వచ్చి, పట్టుతప్పి, కింద పడిపోతున్న బాలుడిని చూసిన స్థానికులు కేకలు పెట్టారు. అయితే ఇంతలో ఒక వ్యక్తి ఆ బాలుడిని కాపాడాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను నెటిజన్లు కన్నార్పకుండా చూస్తున్నారు. ఈ ఉదంతం తూర్పు చైనాలోని జియాంగ్స్ పరిధిలోని హుయాన్ నగరంలో చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఐదో అంతస్తులో ఉంటున్న ఒక కుటుంబానికి చెందిన బాలుడు స్టూల్ సాయంతో బెడ్ రూమ్ కిటికీ గుండా బయటకు వచ్చి, రూఫ్ దగ్గర పట్టుతప్పి, కిందకు వేలాడసాగాడు. ఆ బాలుడిని గమనించిన స్థానికులు సహాయం కోసం కేకలు పెట్టసాగారు. ఇంతలో అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఒక మందపాటి దుప్పటి తెచ్చి ఆ బాలుడిని పట్టుకునేందుకు నిలబడ్డాడు. ఆ బాలుడు ఆ దుప్పటిలో పడ్డాడు. వెంటనే ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్వల్ప చికిత్స పొందాక ఆ బాలుడు కోలుకున్నాడు. అయితే ఆ బాలుడిని కాపాడిన లిని అనే వ్యక్తి చేతికి స్వల్ప గాయాలయ్యాయి.