కొడుకు పెళ్లి కోసం పోరాడింది

ABN , First Publish Date - 2020-05-10T18:31:40+05:30 IST

తండ్రికి గుండె ధైర్యం ఎక్కువని ఎవరన్నారు? జ్యోత్స్న కథ వింటే ఆ మాటను విరమించుకుంటాం. హఠాత్తుగా భర్త పోయాడు. అయినా భయపడలేదు. ఒక పురుషుడిని పెళ్లి చేసుకుంటానని....

కొడుకు పెళ్లి కోసం పోరాడింది

తండ్రికి గుండె ధైర్యం ఎక్కువని ఎవరన్నారు? జ్యోత్స్న కథ వింటే ఆ మాటను విరమించుకుంటాం. హఠాత్తుగా భర్త పోయాడు. అయినా భయపడలేదు. ఒక పురుషుడిని పెళ్లి చేసుకుంటానని కొడుకు మొండికేసినా అవమానంగా భావించలేదు. అప్పులు తీర్చండని బ్యాంకులోళ్లు తలుపులు బాదినా వెరవలేదు. ఒక సాధారణ గృహిణి.. ఈ మూడు గండాలను గట్టెక్కి.. ఫైవ్‌స్టార్‌ హోటళ్ల అధిపతిగా విజయం సాధించడం అసాధారణం. మాతృదినోత్సవం రోజున జ్యోత్స్నా సూరి జీవితం గురించి తప్పక తెలుసుకోవాల్సిందే.. 


‘అమ్మా, నేనొకర్ని ప్రేమించానమ్మా. పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటున్నాను..’ ఎలాంటి నసుగుడు లేకుండా కుండబద్ధలు కొట్టినట్లు చెప్పాడు కేశవ్‌. 

‘అవునా కన్నా. ఎవరా అమ్మాయి? తనను ఒకసారి మన ఇంటికి పిలిపించు. అందరం చూశాక.. వాళ్ల పెద్దలతో మాట్లాడదాం’ అభయమిచ్చింది తల్లి జ్యోత్స్న. 

‘అమ్మా, నువ్వు ఊహించినట్లు ఆ వ్యక్తి అమ్మాయి కాదు, అబ్బాయి. నాకు చిన్నప్పటి నుంచి అబ్బాయిలంటేనే ఇష్టం. అతనికి కూడా నేనంటే చచ్చేంత ఇష్టం. ఇలా చెప్పి నిన్ను బాధపెడుతున్నందుకు సిగ్గుగా లేదు, అలాగని ఏ నుయ్యోగొయ్యో చూసుకునేంత తప్పుగానూ అనిపించలేదు. దేవుడు ఇలా పుట్టించినందుకు, నా తప్పేమీ లేదు’ అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు కొడుకు.

ఆ మాటలు విన్న తల్లి కాళ్ల కింద భూమి కంపించింది. ఏకైక వంశోద్ధారకుడు అనుకుంటే ఏమిటీ వింత వైఖరి? ఆశల సౌధం కుప్పకూలినట్లు అనిపించింది. ఎవరికీ చెప్పుకోలేని బాధ ఆవహించింది.


లాలిస్తుంది, కరుణిస్తుంది, ప్రేమిస్తుంది, ప్రోత్సహిస్తుంది, క్షమిస్తుంది.. ఆవిడే అమ్మ. సృష్టిలోకెల్లా అద్భుతమైన ఏకైక శక్తి. అల్లారుముద్దుగా పెంచిన తనయుడు ఇలా అంటున్నాడేమిటి? తమ వ్యాపార సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజుగా చూసుకోవాలనుకుంది అమ్మ. ఒక చక్కటి అందమైన అమ్మాయిని కోడలుగా తీసుకురావాల్సిన కొడుకు.. ఇలా మరొక కుర్రాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో.. ఆ తల్లి హృదయం ఎలా స్పందించింది?. ఆ సందర్భంలో ఆమె అల్లాటప్పా వ్యక్తి కాదు, పేరున్న వాణిజ్యవేత్త. 


ఇంటి నుంచే ప్రారంభం..

పచ్చటి పకృతికి పేరున్న సిమ్లాలోని ది లారెన్స్‌ స్కూల్‌లో చదువుకుని.. ఢిల్లీలోని మిరిండా హౌస్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తవ్వగానే లలిత్‌ సూరితో జ్యోత్స్నకు పెళ్లయింది. ఇంటర్‌ కాంటినెంటల్‌, హాలిడే ఇన్‌, హిల్టన్‌ వంటి అంతర్జాతీయ గొలుసుకట్టు హోటళ్లతో భాగస్వామ్యం చేసుకుని.. ఫైవ్‌స్టార్‌ హోటళ్లను ప్రారంభించాడు భర్త. ఒక పక్క గృహిణిగా నలుగురు పిల్లలను పెంచుతూ.. హోటళ్ల నిర్వహణ, పర్యాటక, ఆతిథ్యరంగాల గురించి అధ్యయనం చేసిందామె. భారత్‌ హోటల్స్‌ అనే సంస్థను నెలకొల్పి.. గ్రాండ్‌ ఢిల్లీ, గ్రాండ్‌ ఉదయపూర్‌, గ్రాండ్‌ గోవా పేరిట దేశవ్యాప్తంగా విస్తరించింది లలిత్‌సూరి కుటుంబం. భారత హోటళ్ల సమాఖ్యకు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు భర్త. 2002లో రాజ్యసభ సభ్యుడయ్యాడు. ఆయన రాజకీయాల్లో తలమునకలు కావడంతో భార్య జ్యోత్స్న రంగంలోకి దిగక తప్పలేదు. భారత్‌ హోటల్స్‌కు ఆమె జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించింది. కుటుంబ వ్యాపారం సవ్యంగానే సాగుతోంది. అయితే ఒకసారి లండన్‌లో హోటల్‌ను కొనేందుకు అక్కడికి వెళ్లిన లలిత్‌సూరి.. గుండెపోటుతో కన్నుమూశాడు.


ఆయన లేకపోయినా.. 

అకస్మాత్తుగా భర్తను కోల్పోవడం, ఆ బాధ నుంచి బయటపడటం అంత సులభం కాదు. భర్త పోయి పది రోజులు గడిచిందో లేదో.. బ్యాంకుల వాళ్లొచ్చి జ్యోత్స్న ఇంటి తలుపులు కొట్టారు. ‘తీసుకున్న రుణాలను చెల్లించాలి, లేదంటే హోటళ్ల భవనాలను వేలం వేస్తాం’ అంటూ హుకుం జారీ చేశారు. మరోవైపు ఇంటికొచ్చిన బంధువులు ‘నీవు ఒంటరి మహిళవు. స్టార్‌ హోటళ్లను నడపడమంటే మాటలు కాదు. హోటళ్లను అమ్మేసి, ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి.. అప్పులు తీర్చుకుంటే చాలు..’ అన్నారు. యజమాని లేడు కాబట్టి.. హోటళ్లను అమ్మేస్తుందన్న పుకారు బయలుదేరింది. ఇలాంటి పరిస్థితుల నడుమ.. భర్త పెద్ద కర్మ జరిగిన మర్నాడే.. హోటళ్ల నిర్వహణ బాధ్యత తీసుకుంది జ్యోత్స్న. రావడం రావడంతోనే.. అంతర్జాతీయ సంస్థలైన ఇంటర్‌ కాంటినెంటల్‌, హాలిడే ఇన్‌, హిల్టన్‌లతో ప్రాంచైజ్‌ ఒప్పందం రద్దుచేసింది. తమ హోటళ్లను భర్త జ్ఞాపకార్థం ‘ది లలిత్‌’ గ్రూపుగా మార్చేసింది. ఆ సమయంలో చాలామంది ఆమె నిర్ణయాన్ని ప్రశ్నించారు. జ్యోత్స్న పెద్దగా పట్టించుకోలేదు. అనతికాలంలోనే హోటళ్లకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. 


భర్త కోరిక నెరవేరింది..

కశ్మీర్‌లో తీవ్రవాదం తారాస్థాయికి చేరిన సమయంలో.. శ్రీనగర్‌లోని గులాబ్‌ భవన్‌ హోటల్‌ను కొని, పునరుద్ధరణ చేపట్టింది. ఆమె నిర్ణయాన్ని చూశాక ముక్కున వేలేసుకున్నారు వ్యాపారులు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆ హోటల్‌కు గుర్తింపును తీసుకొచ్చింది.


రెండొందల ఏళ్ల కిందట.. బ్రిటిష్‌ సేనల కోసం కలకత్తాలో నిర్మించిన గ్రేట్‌ ఈస్టర్న్‌ హోటల్‌ను ‘జ్యువెల్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’గా అభివర్ణిస్తారు. క్వీన్‌ ఎలిజబెత్‌ 2, మార్క్‌ట్వైన్‌ వంటి ప్రముఖులు బసచేసిన చారిత్రక హోటల్‌ అది. దాన్ని రూ.52 కోట్లకు కొనుగోలు చేసి.. రూ.320 కోట్లతో రీమోడల్‌ చేయించింది. లండన్‌ మహానగరంలో తమకంటూ ఒక హోటల్‌ ఉండాలన్న భర్త కోరిక నెరవేరింది. ఆయన మీద ప్రేమతో భావోద్వేగ వ్యాపార నిర్ణయాలు తీసుకున్నాసరే.. వాటి అమలు, నిర్వహణలో మాత్రం కచ్చితమైన వ్యూహాలు పన్నేది జ్యోత్స్న. అందుకే ఆమె బాధ్యతలు స్వీకరించినప్పుడు కేవలం ఆరు హోటళ్లు మాత్రమే ఉండేవి, ఇప్పుడు వాటి సంఖ్య పదహారుకు చేరింది. అందులో లగ్జరీ హోటళ్లు, ప్యాలెస్‌లు, రిసార్ట్‌లు అనేకం.


2008లో ఆర్థిక మాంధ్యం వచ్చినప్పుడు పర్యాటకులు తగ్గిపోయారు. హోటళ్లలో గదులన్నీ ఖాళీగా దర్శనమిచ్చేవి. నష్టాలను తగ్గించుకోవాలంటే ఉద్యోగులపై వేటు వేయక తప్పదు. కానీ, మానవతా హృదయంతో ఆలోచించి.. ఒక్క ఉద్యోగిని కూడా తొలగించలేదు. అయితే ఖర్చులను మాత్రం తగ్గించింది. గదుల్లో బస చేసిన అతిథులకు ఇచ్చే పూలు, పండ్లు వంటి వాటిని మినహాయించడం వల్ల.. సుమారు పది కోట్ల రూపాయల అదనపు భారం తగ్గించింది.


కొడుకు మాటకు..

సవాలక్ష అడ్డంకుల్ని అధిగమించి ఇక్కడి వరకు వచ్చింది. అయితే తనకు కొరకరాని కొయ్యగా మారిన కొడుకు వాలకం ఆమెను భయపడింది. ‘నేను అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను’ అంటూ ఆ రోజు కొడుకు చెప్పిన మాటకు కుప్పకూలిపోయింది జ్యోత్స్న. వెంటనే తేరుకుని.. తనకు తన సంతోషం కన్నా కొడుకు సంతోషమే ముఖ్యమని ఓ కఠిన నిర్ణయానికి వచ్చింది. కుటుంబ గౌరవం, సమాజంలో చిన్నచూపులకు తిలోదకాలు ఇచ్చి.. కొడుకు నిర్ణయాన్ని గౌరవించింది. అతని పెళ్లికి అంగీకారం తెలిపింది. తన కూతుళ్లకు నచ్చజెప్పింది. బంధుమిత్రుల సూటిపోటి మాటలను కడుపులోనే దాచుకుంది. సాటి వ్యాపారవేత్తల అవమానకర వ్యాఖ్యలను విని, తన కొడుకు చిన్నబుచ్చుకోకుండా కంటికి రెప్పలా చూసుకుంది. సుప్రీంకోర్టు సెక్షన్‌ 377ను రద్దుచేసిన వెంటనే తన తనయుడు కోరుకున్న ఫ్రెంచ్‌ దేశీయుడు సిరిల్‌తో గోవాలో ఆడంబరంగా పెళ్లి చేయించింది. కేశవ్‌ సూరి లలిత్‌ హోటల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నాడు.


కోర్టులో గెలిచి..

స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న రోజులివి. జ్యోత్స్న కూడా నైతిక మద్దతు ప్రకటించింది. అప్పట్లో స్వలింగ సంపర్కుల వివాహం భారతీయ చట్ట ప్రకారం అనైతికం, అసహజం. ఆ చర్యలు నేరమని భారతీయ శిక్షాస్మ ృతిలోని 377వ సెక్షన్‌ పేర్కొనడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుంది. ఆ చట్టం రాజ్యాంగ విలువలకు, మనిషి గౌరవ మర్యాదలకు విరుద్ధంగా ఉందని సుప్రీంకోర్టులో కొడుకు చేత రిట్‌ పిటీషన్‌ వేయించింది తల్లి. ఆ సెక్షన్‌ను రద్దు చేసే వరకు పోరాటం ఆపలేదు. తమ హోటళ్లలో స్వలింగ సంపర్కులను, లింగమార్పిడి చేసుకున్న వారికి ఉద్యోగాలను ఇచ్చి, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించింది జ్యోత్స్న. వాళ్ల భద్రత కోసం బీమా కూడా చేయించింది. ఆమెకు నలుగురు పిల్లలు. వాళ్లంతా ఇప్పుడు హోటళ్ల నిర్వహణలో బిజీగా ఉంటున్నారు. భర్త మరణంతో కూలిపోయిందనుకున్న వ్యాపార సామ్రాజ్యాన్ని ఒంటిచేత్తో తిరిగి నిలబెట్టి, ఇంట్లో పిల్లల మనసును గెలిచిన అమ్మగా, వ్యాపారంలో తిరుగులేని వాణిజ్యవేత్తగా పేరుతెచ్చుకుంది.


స్వలింగ సంపర్కుడైన కొడుకు.. మరొక అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటే.. ఏ తల్లి అయినా వినడానికే భరించలేదు. కంపరం పుట్టినట్లు విలవిల్లాడుతుంది. కానీ జ్యోత్స్న కొడుకులోని విపరీత మనస్తత్వాన్ని, శారీరకతత్వాన్ని అర్థం చేసుకుంది. ఈ రోజు ప్రపంచం స్వలింగసంపర్కుల స్వేచ్ఛ గురించి మాట్లాడుకుంటోంది. వ్యక్తి లైంగిక స్వేచ్ఛ, లింగ సమానత్వం వంటి సున్నిత హక్కుల కోసం పోరాటాలు జరుగుతున్నాయి.. 


- సునీల్‌ ధవళ, 97417 47700 సీయీవో, ద థర్డ్‌ అంపైర్‌ మీడియా అండ్‌ అనలిటిక్స్‌

Updated Date - 2020-05-10T18:31:40+05:30 IST