-
-
Home » Prathyekam » Jupiter and Saturn To Come Very Close On December 21 After Nearly 400 Years
-
400 సంవత్సరాల తర్వాత ఆకాశంలో అద్భుతం!
ABN , First Publish Date - 2020-12-07T01:37:02+05:30 IST
కరోనా మహమ్మారి రాకతో ఈ ఏడాది ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది. ప్రజల జీవితాల్లోని సరదాలు, సంతోషాలను కరోనా వైరస్ అమాంతం

కోల్‌కతా: కరోనా మహమ్మారి రాకతో ఈ ఏడాది ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది. ప్రజల జీవితాల్లోని సరదాలు, సంతోషాలను కరోనా వైరస్ అమాంతం లాగేసుకుంది. అందరినీ ఇళ్లకే పరిమితం చేసింది. ప్రస్తుతం 2020 చివరి అంకంలో ఉన్నాం. అయితే, ఈ నెల 21న ఆకాశంలో ఓ అద్భుతం జరగబోతోంది. దాదాపు 400 సంవత్సరాల తర్వాత సాక్షాత్కారం కాబోతున్న ఈ ఖగోళ అద్భుతం ఒక్కటే జనాలకు ఓ మరిచిపోలేని మధురానుభూతిగా మిగిలే అవకాశం ఉంది. మిగతా 11 నెలలూ చేదు గుళికలే.
ఈ నెల 21న గురు, శనిగ్రహాలు అత్యంత దగ్గరగా రాబోతున్నాయి. రెండూ కలిసి ఓ పెద్ద నక్షత్రంలా దర్శనమివ్వనున్నాయి. దాదాపు 400 సంవత్సరాల క్రితం అంటే 1623న ఈ రెండు గ్రహాలు అత్యంత సమీపానికి వచ్చాయి. ఇదో గొప్ప సంయోగమని ఎంపీ బిర్లా ప్లానెటోరియం డైరెక్టర్ దేబీ ప్రసాద్ డుయారీ పేర్కొన్నారు. ‘‘రెండు ఖగోళ వస్తువులు ఒకదానికొకటి దగ్గరగా వచ్చి దానిని భూమి నుంచి చూడగలిగితే దానిని సంయోగమని అంటారు. అదే శని, గురు గ్రహాలు ఇలా దగ్గరికి వస్తే దానిని ‘గొప్ప సంయోగమని’ అంటారు’’ అని దేబీ ప్రసాద్ వివరించారు. ఇప్పుడు కనుక ఈ గొప్ప సంయోగాన్ని చూడడం మిస్సయితే మళ్లీ 15 మార్చి 2080 నాటికి గానీ చూడలేమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 21న రాత్రి ఈ రెండు గ్రహాల మధ్య భౌతిక దూరం 735 మిలియన్ కిలోమీటర్లు ఉంటుందని తెలిపారు. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల వారు సూర్యాస్తమయం తర్వాత ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించవచ్చని దేబీ ప్రసాద్ వివరించారు. కాబట్టి డోంట్ మిస్ ఇట్!