-
-
Home » Prathyekam » Jiddu Krishnamurti and Osho
-
సంచలనాలు సృష్టించిన జేకే, ఓషో
ABN , First Publish Date - 2020-03-23T20:38:23+05:30 IST
జిడ్డు కృష్ణమూర్తి , ఓషో రజనీష్ భారతదేశం నుంచి దూసుకువెళ్లి పెద్దఎత్తున ప్రపంచాన్ని ఆకర్షించిన వాళ్లు వీళ్లు.

|| ఒక వైవర్ణ్యం - ఒక విస్మయాన్విత వర్ణం ||
జిడ్డు కృష్ణమూర్తి , ఓషో రజనీష్ భారతదేశం నుంచి దూసుకువెళ్లి పెద్దఎత్తున ప్రపంచాన్ని ఆకర్షించిన వాళ్లు వీళ్లు. ప్రపంచంపై ప్రగాఢంగా తమ ప్రభావాన్ని చూపిన వాళ్లు వీళ్లు. గత 100 ఏళ్లలో ఈ ఇద్దఱిలా ప్రపంచాన్ని కదిలించిన వాళ్లు మఱెవరూ లేరేమో?
జిడ్డు కృష్ణ మూర్తి పుస్తకాలు 40 భాషల్లోకి అనువదించబడ్డాయి. ఓషో పుస్తకాలూ 40 భాషల్లోకి వెళ్లాయి. విడివిడిగా ఈ ఇద్దఱి పలుకులూ వందలాది పుస్తకాల రూపంలో ప్రపంచంలో పరిఢవిల్లుతున్నాయి.
జిడ్డు కృష్ణమూర్తి వందల కోట్ల ఆస్తిని వద్దనుకుని వదులుకున్నారు. ఓషో ఎన్నో వేల కోట్ల ఆస్తిని సంపాదించారు. తత్త్వశాస్త్రంపై ఒక దృక్పథాన్ని విరజిమ్మి వేలకోట్ల డబ్బును సంపాదించచ్చు అని ప్రపంచానికి తెలియజేశారు ఓషో. అమెరికాలో 6000 చదరపు కిలోమీటర్స్ విస్తరణలో రజనీష్ పుర వీరికి ఉండేది. వీరికి దాదాపుగా 90కి పైగా Rolls Royce కార్స్ ఉండేవి. ఓషో వైభోగాన్ని భరించలేక అప్పటి అమెరికా అధ్యక్షలు రీగన్ ఒక సందర్భంలో ఈ దేశానికి అధ్యక్షుణ్ణి నేనా ఓషోనా అని అన్నారు.
ఒకరు తన కొడుకును ఓషో దగ్గఱికి తీసుకెళ్లి "వీడు ఇప్పటీకి చాలాసార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు చేశాడు, వీడికి బతికేట్టు బుద్ధిచెప్పండి" అని కోరారు. ఓషో ఆ కొడుకుని చూసి "చాలాసార్లు నువ్వు ఆత్మహత్యా ప్రయత్నాలు చేశావంటే నీకు చావడం కూడా చేతకాలేదన్న మాట. నువ్వు ఇంక బతకడం అనవసరం" అని అన్నారట. (చావడం కూడా చేతకాని వాళ్లూ, పదేపదే తప్పులు చేసేవాళ్లూ, తప్పుల్ని దిద్దుకోని వాళ్లూ వృథా మాత్రమే కాదు అన్నిటికీ వాళ్లు హానికరమే) ఇలా ఉండేది వారి తీరు. గాంధీ ప్రవర్తన్ని విమర్శిస్తూ ఆయన మహాత్ముడు అవడేమిటి?అని ప్రశ్నించారు ఓషో.
ఓషో ఎంతో వివాదాస్పదమైనారు. దేశాలు కొన్ని వారిని తిరస్కరించాయి, కొన్ని నిరోధించాయి, కొన్ని బహిష్కరించాయి. ఓషో ఏ పదనుతో నడిచారో, ఎదిగారో, బ్రతికారో ఆ పదనుకే వారు తెగిపొయారు. వారిని అమెరికాలో ఖైదు చేశారు. ఆ దేశాన్ని వదిలి వెళ్లాలన్న నిర్బంధంతో విడుదలయ్యారు. అ తరువాత మనదేశం వచ్చి ఇక్కడ మరణించారు. అమెరికా కారాగారంలో వారిపై విషప్రయోగం జరిగిందన్న మాట ఉంది.
జిడ్డు కృష్ణమూర్తి వివాదాస్పదం కాలేదు. కృష్ణమూర్తి ఒక ప్రశాంత వైప్లవ్యం. అశాంతికి అతీతంగా ఆవరించిన ఒక ఆలోచనా మేఘం. గురువులు ఉండకూడదనీ, ఎవరికి వారే గురువులని చెప్పేవారు. కృష్ణమూర్తి తమకు పూర్వమున్న ఏ గ్రంథాన్నీ , ఏ ఋషినీ , ఏ తాత్త్వికుణ్ణీ, ఏ పాఠాన్నీ వారు ఉటంకించలేదు. ఏ సిద్ధాంతం గుఱించీ చర్చ చెయ్యలేదు. ఏ వ్యాఖ్యానమూ చెయ్యలేదు. జిడ్డు కృష్ణమూర్తి చెట్లతో మాట్లాడుతూ చచ్చిపోబోతున్న చెట్లను బతికించారు. వారి పై వందలాది చిలకలు వచ్చి. వాలుతూండేవి. అనిబిసెంట్ దత్తపుత్రులు వారు. బాలుడు కృష్ణమూర్తి చుట్టూ ఉన్న పరివేశం (aura) ను చూసి ఆశ్చర్యపోయి వారిని తమ చేతుల్లోకి తీసుకున్నారు. 12 ఏళ్ల బాలుడుగా అనిబిసెంట్ మాతృత్వంలోకి వెళ్లారు. పెరిగి పెద్దయ్యాక కృష్ణమూర్తి ఒక నూతన మతం సృష్టిస్తారని అనుకుంటూండగా ఎదిగిన కృష్ణమూర్తి తాను ఏ మతాన్ని ప్రతిపాదించడం లేదని ప్రపంచానికి తెలియజేస్తూ సైద్ధాంతిక మతాలకు అతీతంగా స్వచ్ఛంగా బతకాలని అలా బతకడం ఎవరికి వారుగా అలవాటు చేసుకోవాలని తేల్చి తెలియజెప్పారు. "Pathless place" అని చెబుతారు వారు. నిర్దేశించబడ్డ మార్గంలో కాకుండా, మార్గమన్నదే లేకుండా చోటుకు చేరడం అభ్యసించమంటారు వారు. జిడ్డు కృష్ణమూర్తిని మైత్రేయుడి అవతారంగా పరిగణిస్తారు. మైత్రేయుడు గౌతమ బుద్ధ అవతారం. అంటే జిడ్డుకృష్ణమూర్తి బుద్ధుని ఆత్మ. రమణ మహర్షి చెప్పిన కొంత విషయానికొ పరోక్ష ప్రతిబింబం జిడ్డు కృష్ణమూర్తి.
ఓషోకు కృష్ణమూర్తి అంటే ఎంతో అభిమానం. రమణ మహర్షి అన్నా ఓషో కు అభిమానం. "Pathless path" అంటే దారిలేని దారిని తీసుకోమని ఓషో చైనా కవి-తాత్త్వికులు లావ్ ట్సూ (Lao tzu) చింతనల ఆనుగుణ్యంగా చెబుతారు. ఈ pathless place కు pathless path కు సామరస్యం ఉంది. ఈ రెండిటికీ ఆది శంకరాచార్యలో ఆది కనిపిస్తుంది.
Awareness, consciousness లు వేఱు వేఱు అంటూ ఒక పదనైన, విలక్షణమైన, నిశితమైన ఆలోచన, ప్రవర్తనలతో ఓషో పయనించారు. కృష్ణమూర్తి వీటికి భిన్నంగా విషయ విశ్లేషణకూ, వ్యాఖ్యానానికీ అతీతంగా తమదైన సరళిలో ఒక నూతన తాత్త్విక సత్వంగా సాగారు. "కృష్ణమూర్తి ఒక వైవర్ణ్యం. ఓషో ఒక విస్మయాన్విత వర్ణం".
ఈ ఇద్దఱూ కొన్ని సనాతన వైదిక ప్రతిపాదనల లేదా భావాల మూర్తిమత్వాలే అవడం విశేషం.
ఎంతో, ఎన్నో చెప్పుకోవచ్చు ఈ ఇద్దఱి గుఱించి. భారతదేశం ప్రపంచానికి అందించిన రెండు తాత్త్వికతారలు జిడ్డుకృష్ణమూర్తి, ఓషోలు.
రోచిష్మాన్
9444012279
rochishmon@gmail.com
