మల విసర్జనకు స్పెషల్ టాయ్‌లెట్! ఖరీదు రూ. 170 కోట్లు!
ABN , First Publish Date - 2020-10-04T00:20:25+05:30 IST
మల విసర్జన కోసం వినియోగించే కమ్మోడ్ ఖరీదు.. ఎంత..? ఆ.. ఎంత ఉంటుంది..మహా అయితే వేలల్లో ఉండొచ్చు అంటారా..? మీరు అనుకున్నది కరెక్టే.. అయితే ఈ సమాధానం భూమ్మీద మాత్రమే వర్తిస్తుంది. అంతరిక్షంలో కాదు.
వాషింగ్టన్: మల విసర్జన కోసం వినియోగించే కమ్మోడ్ ఖరీదు.. ఎంత..? ఆ.. ఎంత ఉంటుంది..మహా అయితే వేలల్లో ఉండొచ్చు అంటారా..? మీరు అనుకున్నది కరెక్టే.. అయితే ఈ సమాధానం భూమ్మీద మాత్రమే వర్తిస్తుంది. అంతరిక్షంలో కాదు. అక్కడ మల విసర్జన అంటే రెండు వేళ్లు చూపించినంత ఈజీ కాదు! ఎన్నో వ్యవహారాలు ఉంటాయ్! ఇందులో మానవవ్యర్థాలను రీసైక్లింగ్ అనేది అన్నిటికంటే ముఖ్యమైన అంశం. కాబట్టే.. అమెరికా అంతరీక్ష సంస్థ నాసా ఓ కమ్మోడ్ తయారు చేసేందుకు ఏకంగా రూ. 170 కోట్లు ఖర్చు పెట్టింది.
స్పేస్‌లోని పరిస్థితులు ఇక్కడిలా ఉండవు. అక్కడ అంతా గాల్లో తేలుతూ ఉంటుంది. మల విసర్జనలో ఏమాత్రం తేడా వచ్చినా ఇక అంతే.. ముఖమంతా ఛండాలాన్ని పులుముకోవాల్సి వస్తుంది. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుంటూ నాసా అత్యాథునిక టెక్నాలజీ వినియోగించి కొత్త కమ్మోడ్ సిద్ధం చేసింది.
దాదాపు 45 కిలోల బరువుండే ఈ టాయ్‌లెట్..పూర్తిగా టైటానియంతో తయారైంది. రీసైక్లింగ్ పంపే మునుపే ఈ టాయ్‌లెట్‌లోని మానవ వ్యర్థాలను యాసిడ్‌లను వినియోగించి.. ఓ ప్రత్యేక ప్రక్రియకు గురిచేయవలసి ఉంటుంది. దీన్ని ప్రీ ట్రీట్‌మెంట్ అంటారు. ఈ క్రమంలో యాసిడ్‌ల ప్రభావాన్ని తట్టుకునేందుకే నాసా శాస్త్రవేత్తలు దీన్ని టైటానియం లాంటి లోహంతో తయారు చేశారు.
ఇక.. మునుపటి అంతరిక్ష టాయిలెట్‌లు పురుషులకు అనువుగా ఉండేలా రూపొందిస్తే..ఇది మాత్రం మహిళలను కూడా దృష్టిలో పెట్టుకుని శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా తయారు చేశారు. ఇప్పుడిప్పుడే అమెరికా అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలు వేళ్లూనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల సంఖ్య పెరగొచ్చు. ఈ నేపథ్యంలోనే నాసా కొత్త టాయ్‌లెట్ అవసరం ఏర్పడింది.
మరి అంతరిక్షంలో ఎలా పని చేస్తుందో పరిక్షించాల్సి అవసరం కూడా ఉందికదా.. అందుకే నాసా.. ఈ టాయ్‌లెట్‌ను గురువారం నాడు కార్గో నౌకపై ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు పంపించింది. అక్కడి ఆస్ట్రోనాట్లు దీన్ని పరీక్షించి..ఫ్లష్షింగ్ గట్రా అంతా సరిగా ఉందో లేదో చెక్ చేసి.. నాసాకు ఫీడ్ బ్యాక్ పంపిస్తారట. సో..అదండీ..కోట్ల ఖరీదు చేసే కమ్మోడ్ కథ!