లారెన్స్ ‘కాంచన’ స్టోరీకీ.. ఈమె రియల్ లైఫ్ స్టోరీకీ ఒక్కటే తేడా..!

ABN , First Publish Date - 2020-12-29T01:08:54+05:30 IST

హిజ్రాల పట్ల సమాజంలో ఉండే చిన్నచూపు అందరికీ తెలిసిందే. కొందరు హిజ్రాలు రైళ్లలో, అక్కడాఇక్కడా భిక్షాటన చేసుకుంటూ..

లారెన్స్ ‘కాంచన’ స్టోరీకీ.. ఈమె రియల్ లైఫ్ స్టోరీకీ ఒక్కటే తేడా..!

హిజ్రాల పట్ల సమాజంలో ఉండే చిన్నచూపు అందరికీ తెలిసిందే. కొందరు హిజ్రాలు రైళ్లలో, అక్కడాఇక్కడా భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తుంటే.. మరికొందరు మాత్రం లింగ భేదంతో సంబంధంతో లేకుండా వారి కలలను నిజం చేసుకుంటున్నారు. తద్వారా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన వీఎస్ ప్రియ ఒకరు. లారెన్స్ తెరకెక్కించిన ‘కాంచన’ సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో సమాజంతో పాటు కన్నవారు కూడా ఇంటి నుంచి గెంటేసిన ఓ హిజ్రా.. తన కలను మరో హిజ్రాను వైద్యురాలిని చేయడం ద్వారా నిజం చేసుకుంటుంది. సరిగ్గా.. ఈ కథకు దగ్గరగానే ప్రియ జీవితం ఉండటం విశేషం. అయితే.. ప్రియ తల్లిదండ్రులు ఆమెను అర్థం చేసుకుని.. ‘అతడు’ ‘ఆమె’గా మారేందుకు అంగీకరించారు. ప్రియ అనే ఈ ఆయుర్వేదిక్ డాక్టర్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...


కేరళలోని త్రిసూరుకు చెందిన జిను శశిధరన్‌కు చిన్నప్పటి నుంచి స్త్రీ లక్షణాలున్నాయి. ఊహ తెలిసే వయసు వచ్చేసరికి అతనికి ఈ విషయం తెలిసింది. స్త్రీ లక్షణాలతో పురుషుడి శరీరంతో జీవించడం చాలా ఇబ్బందిగా అనిపించేదని శశిధరన్ చెప్పాడు. అయితే.. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పేందుకు భయపడ్డానన్నాడు. దీంతో.. తాను శారీరకంగా ఎదుర్కొంటున్న సమస్యలను డెయిరీలో రాసుకున్నానని తెలిపాడు. తొలుత ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పగానే మానసిక వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారని.. అయితే ఆయన తనకు ఎలాంటి మానసిక సమస్య లేదని చెప్పడంతో తన బాధను తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారని శశిధరన్ చెప్పాడు. తన తల్లిదండ్రులిద్దరూ నర్సింగ్ వృత్తిలో ఉండటంతో తమ పిల్లలు వైద్యులు కావాలని కలలు కనేవారని తెలిపాడు. అనుకున్నట్టుగానే తన సోదరుడు ఎంబీబీఎస్ పూర్తి చేసి బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడని చెప్పాడు. తాను కూడా వైద్యరత్నం ఆయుర్వేద కళాశాల‌లో ‘బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద’ పూర్తి చేశానని తెలిపాడు.


2018లో తను సీతారామ్ ఆయుర్వేద ఆసుపత్రిలో వైద్యురాలిగా చేరానని, అంతా బాగానే ఉన్నప్పటికీ తన ఐడెంటిటీ తనను వెంటాడేదని.. ఇక సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకుని తల్లిదండ్రులతో ఈ విషయాన్ని చెప్పినట్లు పేర్కొన్నాడు. సాధారణంగా లింగ మార్పిడి చేయించుకునేందుకు 3 లక్షల వరకూ ఖర్చవుతుందని.. అయితే.. తాను పరిపూర్ణ లింగ మార్పిడి చేయించుకోవాలని భావించడంతో సర్జరీకి 8 లక్షల వరకూ ఖర్చయిందని తెలిపాడు. అతను భావించినట్టుగానే ఆపరేషన్ పూర్తయింది. ‘అతను’గా ఉన్నప్పుడు ఆమె పనిచేసిన ఆసుపత్రి కూడా ‘ఆమె’గా మారడం పట్ల ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఆపరేషన్ పూర్తయ్యాక తన పేరును ప్రియగా మార్చుకున్నానని ఆమె తెలిపింది.

Updated Date - 2020-12-29T01:08:54+05:30 IST