నకిలీ తహసీల్దార్ అవతారంలో యువతి... కోవిడ్-19 పేరుతో....
ABN , First Publish Date - 2020-07-18T15:03:36+05:30 IST
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులు నకిలీ తహసీల్దార్‌గా చలామణీ అవుతున్న ఒక యువతిని పట్టుకున్నారు. సదరు మహిళ ఒక కర్మాగార యజమానికి రెండున్నర లక్షల రూపాయల చలానా విధించింది.

ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులు నకిలీ తహసీల్దార్‌గా చలామణీ అవుతున్న ఒక యువతిని పట్టుకున్నారు. సదరు మహిళ ఒక కర్మాగార యజమానికి రెండున్నర లక్షల రూపాయల చలానా విధించింది. ఈ నేపధ్యంలో ఆమె పోలీసులకు పట్టుబడింది. నకిలీ తహశీల్దార్‌గా మారిన ఆ యువతి ఇటీవల ఒక ఫుడ్ ఫ్యాక్టరీకి వెళ్లి, అక్కడ కోవిడ్ 19 నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ, సదరు ఫ్యాక్టరీ యజమానిని బెదిరించింది. ఇందుకు పరిహారంగా రెండున్నర లక్షల రూపాయల చలానా విధించింది. అయితే అంత డబ్బు తనదగ్గర లేదని ఫ్యాక్టరీ యజమాని చెప్పడంతో ఆ యువతి ఫ్యాక్టరీ పేపర్లు తీసుకుని వెళ్లిపోయింది. దీనిపై ఫ్యాక్టరీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు ఆ యువతిని ఆరెస్ట్ చేశారు. ఫ్యాక్టరీ యజమాని అన్షుల్ గుప్తా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో జూలై 14న నెమవర్ రోడ్‌లోని తన మిల్లార్క్ ఫుడ్ ఫ్యాక్టరీకి తారంగ్ అనే యువతి వచ్చిందని, తాను ఆ ప్రాంతానికి చెందిన తహసీల్దార్ అని చెప్పి కర్మాగారాన్ని తనిఖీ చేసిందని పేర్కొన్నారు. తరువాత ఫ్యాక్టరీలలో కోవిడ్ -19 జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పిందన్నారు. ఫ్యాక్టరీలో అనేక అవకతవకలను జరుగుతున్నాయని ఆ యువతి రూ. 2.5 లక్షల చలాన్‌ను విధించిందని వివరించారు.