వృద్ధ జంటను విడదీసిన కరోనా.... ఆప్యాయతను పంచిన ప్లాస్టిక్ షీట్!
ABN , First Publish Date - 2020-06-25T11:28:50+05:30 IST
భార్యాభర్తల మధ్య ఉండే అన్యోన్యత వారికి మాత్రమే తెలుస్తుంది. అయితే కరోనా వైరస్ కొంతమంది దంపతుల ఎడబాటుకు కారణంగా నిలిచింది. కరోనా బారిన పడకుండా ఉండాలంటే సామాజిక దూరం తప్పనిసరి.

మాడ్రిడ్: భార్యాభర్తల మధ్య ఉండే అన్యోన్యత వారికి మాత్రమే తెలుస్తుంది. అయితే కరోనా వైరస్ కొంతమంది దంపతుల ఎడబాటుకు కారణంగా నిలిచింది. కరోనా బారిన పడకుండా ఉండాలంటే సామాజిక దూరం తప్పనిసరి. అయితే కరోనా బారిపడిన భార్య లేదా భర్తకు ఆ నర్సింగ్ హోం వరంగా మారింది. అక్కడి ప్లాస్టిక్ తెరలు వైరస్‌లను అడ్డుకుని, భార్యాభర్తలను కలుపుతున్నాయి. ఈ నర్సింగ్ హోం స్పెయిన్‌లో ఉంది. స్పెయిన్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చెందిన నేపధ్యంలో అగస్టినా కాసామెరో భర్తకు దూరంగా ఉండాల్సివచ్చింది. ఆమె 102 రోజుల పాటు తన 83 ఏళ్ల భర్తకు దూరంగా ఉంది. అయితే ఆ భార్యాభర్తలు ప్లాస్టిక్ షీట్ అడ్డుగా పెట్టుకుని కావలించుకున్న క్షణాన వారిలో ప్రేమ ఉప్పొంగింది. కరోనా భయం క్షణాల్లో మటుమాయమైంది. కరోనా బారిన పడిన ఆమె భర్త పాస్కల్ పెరెజ్ బార్సిలోనాలోని ఒక నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతున్నాడు. కరోనా వైరస్ కారణంగా ప్రియమైనవారికి దూరమై ప్రేమకోసం అలమటిస్తున్నవారిలో పాస్కల్ కూడా ఒకడు. 81 ఏళ్ల అగస్టినా లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో భర్తకు దూరంగా ఉంది. వారికి వివాహమై 59 సంవత్సరాలైంది. అయితే ఈ జంట వారి వైవాహిక జీవితంలో ఒకరినొకరు విడిచి ఎప్పుడూ దూరంగా ఉండలేదు. ఆ నర్సింగ్ హోమ్ తమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారికి రక్షిత తెరలతో వారి ప్రియమైనవారిని కలుసుకునేందుకు అనుమతినిచ్చింది. విషయం తెలుసుకున్న అగస్టినా నర్సింగ్ హోంనకు చేరుకుంది. ఈ జంట ఒకరినొకరు కలుసుకున్నప్పుడు వారి మధ్య ప్లాస్టిక్ షీట్ అడ్డుగా ఉంది. ఒకరినొకరు చూసుకున్నవెంటనే వారి కళ్ళు చమర్చాయి. ఇద్దరూ ఒకరినొకరు ఒక నిమిషం పాటు ముద్దు పెట్టుకున్నారు. వారి భావోద్వేగాలకు ప్లాస్టిక్ షీట్ అడ్డుకాలేదు. ఈ విధంగా ఈ నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు ప్లాస్టిక్ షీట్ల మధ్య తమ ప్రియతములను కలుసుకుని, అంతులేని అప్యాయతను పొందుతున్నారు.