గూగుల్ యాప్‌.. దొంగను పట్టించింది.. ఎలాగంటే?

ABN , First Publish Date - 2020-12-17T14:07:00+05:30 IST

ఇంగ్లీష్ భాష రాకపోవడం ఓ దొంగను..

గూగుల్ యాప్‌.. దొంగను పట్టించింది.. ఎలాగంటే?

ఇంగ్లీష్ భాష రాకపోవడం ఓ దొంగను పట్టించింది. జైల్లో ఊచలు లెక్కపెడుతూ చిన్నప్పుడు బాగా చదువుకొని ఉంటే బాగుండేది అని అతను చాలా బాధ పడి ఉంటాడు. ఎందుకంటే అతనికి ఎదురైన ఘటన అలాంటిది మరి. ఈ ఘటన ఇంగ్లండ్‌లో జరిగింది. లండన్ మహానగరంలో ఆ రోజు కూడా ఎప్పట్లాగే పోలీసులు పెట్రోల్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ కారు వారి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే దానిలో నుంచి గంజాయి వాసన చాలా ఘాటుగా వస్తోంది. అనుమానం వచ్చిన పోలీసులు ఆ వాహనాన్ని అడ్డగించారు. కారు మొత్తం తనిఖీ చేశారు. అయినా వారికి ఏమీ దొరకలేదు.


కారులో ఏమీ లేకపోయినా పోలీసుల అనుమానం తీరలేదు. ఎందుకైనా మంచిదని కారులోని ఇద్దరు వ్యక్తులను కూడా చాలా జాగ్రత్తగా సెర్చ్ చేశారు. వారి దగ్గర కూడా కనీసం గంజాయి ఆకు కూడా దొరకలేదు. దీంతో తామే పొరబడ్డామని వాళ్లు ఓ నిశ్చయానికి వచ్చేశారు. ఆ సమయంలోనే పోలీసు అధికారులు.. కారులోని వారికి క్షమాపణ చెప్పి, తమకు ఏదో అనుమానం కలిగించిందని చెప్తూ తమ చర్యలను వివరించే ప్రయత్నం చేశారు. అదిగో అప్పుడే సరిగ్గా ఆ దొంగలే కాదు, పోలీసులు కూడా ఊహించని ఘటన జరిగింది.


కారులోని ఇద్దరు వ్యక్తుల్లో ఒకరికి అసలు ఇంగ్లీష్ రాదు. దీంతో పోలీసుల మాటలు అర్థం చేసుకోవడం కోసం టెక్నాలజీ వాడుకుందామని అతను అనుకున్నాడు. అంతే వెంటనే ఫోన్ తీసి గూగుల్ ట్రాన్స్‌లేషన్ యాప్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు. అదిగో అక్కడే అతని అదృష్టం మొఖం చాటుచేసింది. అతను నొక్కిన బటన్ పొరబాటున ఓ వీడియో ప్లే చేసింది. దానిలో ఆ తోడుదొంగలిద్దరూ కలిసి పెంచుతున్న గంజాయి తోట వీడియో ప్లే అయిపోయింది. ఆ వీడియో పోలీసుల కంట పడక ముందే ఆఫ్ చేయడానికి అతను నానా ప్రయత్నాలూ చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజి జరిగిపోయింది. అతని ఫోన్ లాక్కున్న పోలీసులు వారు ఉంటున్న అపార్ట్‌మెంటుపై దాడి చేశారు. అక్కడ పెంచుతున్న 300 గంజాయి మొక్కలను సీజ్ చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు  చేశారు. అందుకే అంటారు పెద్ద పెద్ద దొంగలు కూడా చిన్న చిన్న పొరబాట్లతో దొరికిపోతారని.

- పి.ఫణీంద్ర

Updated Date - 2020-12-17T14:07:00+05:30 IST