లాక్‌డౌన్ ఎఫెక్ట్: హృషికేశ్ గుహలో ఫ్రెంచ్ బాబా

ABN , First Publish Date - 2020-04-26T01:22:34+05:30 IST

గంగానది సమీపంలో ఓ గుహలో ఫ్రాన్స్‌కు చెందిన 28 ఏళ్ల లాదిస్లస్ లూకాస్ అనే వ్యక్తి ముని ఓం బాబా పేరుతో...

లాక్‌డౌన్ ఎఫెక్ట్: హృషికేశ్ గుహలో ఫ్రెంచ్ బాబా

డెహ్రాడూన్: గంగానది సమీపంలో ఓ గుహలో ఫ్రాన్స్‌కు చెందిన 28 ఏళ్ల లాదిస్లస్ లూకాస్ అనే వ్యక్తి ముని ఓం బాబా పేరుతో నివశిస్తున్నాడు. ఇతడితో పాటు మరో ఐదుగురు విదేశీయులు కూడా కలిసి ఉంటున్నారు. అయితే ఏప్రిల్ 18న లక్ష్మన్ ఝూలా పోలీసులు వీరిని గుర్తించారు. కరోనా నేపథ్యంలో వైద్యులను తీసుకుని వచ్చి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సమీపంలోని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. లూకాస్‌తో పాటు ఉక్రెయిన్‌కు చెందిన ఓ జంట, ఓ అమెరికన్‌, ఓ టర్కీ వాసి, ఓ నేపాల్ దేశస్థుడు క్వారంటైన్‌కు తరలించిన వారిలో ఉన్నారు. లూకాస్ మాట్లాడుతూ, ఆత్మ దర్శనం కోసం తాను సన్యాసం స్వీకరించానని, స్వామి రమణమహర్షిని గురువుగా స్వీకరించానని చెప్పుకొచ్చాడు. ‘నేను ఇక్కడ ఏడాదిగా నివశిస్తున్నాను. పోలీసులు మమ్మల్ని గుర్తించి తీసుకువచ్చే సమయానికి ఓ నేపాలీ బాబాతో కలిసి నేను ఉంటున్నాను. ఆయన ఈ మధ్యనే కేదార్‌నాథ్ నుంచి తిరిగి వచ్చారు. మిగిలిన వారందరూ ఎప్పటినుంచో ఇక్కడే ఉంటున్నారు. లాక్‌డౌన్ ఉన్నా మేము ప్రతిరోజూ లక్ష్మణ్ ఝూలా ప్రాంతానికి వచ్చి నిత్యావసరాలను కొనుగోలు చేసుకుని వెళ్లేవాళ్లం’ అంటూ లూకాస్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఇండియాకు వచ్చే ముందు తాను న్యూజిలాండ్, స్పెయిన్, పోర్చుగల్,  అర్మేనియా, జార్జియా, టర్కీ, నార్వే, స్వీడన్,  ఫిన్‌లాండ్, జర్మనీ, రొమేనియా, బల్గేరియా, మొరాకో దేశాలలో పర్యటించానని చెప్పాడు. భారత్‌ చేరుకున్నాక హృషికేశ్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్నానని, అల్మోరా, జమ్మూ-కాశ్మీర్, ధర్మశాల వంటి అనేక ప్రాంతాల్లో పర్యటించానని, లాక్‌డౌన్ అమలుకాకపోతే మరిన్ని ప్రాంతాలను సందర్శించేవాడినని తెలిపాడు. తన భవిష్యత్తు గురించి తానేమీ ఆలోచించుకోలేదని, అయితే మిగిలిన జీవితమంతా సన్యాసిగానే ఉండాలనుకుంటున్నానని, దేవుడు ఎలా నిర్ణయిస్తే అలాగే నా జీవితం సాగుతుందని లూకాస్ వివరించాడు.

Updated Date - 2020-04-26T01:22:34+05:30 IST