ఎగిరే కారు వస్తోంది
ABN , First Publish Date - 2020-10-04T14:29:24+05:30 IST
ఎంత పెద్ద రోడ్లు వేసినా ట్రాఫిక్ గోల తప్పేట్టు లేదు. రెండు మూడు గంటలు ట్రాఫిక్‌లో నరకం చూస్తున్నాం అనే నగర వాసుల కోసం త్వరలో ఎగిరే కార్లు రాబోతున్నాయి...
ఎంత పెద్ద రోడ్లు వేసినా ట్రాఫిక్ గోల తప్పేట్టు లేదు. రెండు మూడు గంటలు ట్రాఫిక్‌లో నరకం చూస్తున్నాం అనే నగర వాసుల కోసం త్వరలో ఎగిరే కార్లు రాబోతున్నాయి. వీటివల్ల ట్రాఫిక్‌జామ్‌లో చిక్కుకోకుండానే రయ్యిన ఆఫీసుకుగానీ, ఇంటికిగానీ చేరుకోవచ్చు.
పెట్రోలు, డీజిల్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతుండటంతో భవిష్యత్తులో ఎలక్ర్టిక్ కార్లు రాజ్యమేలబోతున్నాయి. అటువంటి ఓ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్టే ‘హెక్సా’. పద్దెనిమిది ఎలక్ట్రిక్ ప్రొపెల్లర్స్, మోటార్లతో గాల్లో నడిచే వాహనం ఇది. తక్కువ ఎత్తులో ఏకబిగిన పదిహేను నిమిషాల పాటు గాల్లో ఎగరగలదు.
లైసెన్స్ అవసరం లేదు...
ప్రసిద్ధ కార్ల కంపెనీ ఆస్టిన్‌కు చెందిన స్టార్ట్ అప్ ‘లిఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్’ హెక్సాను నిర్మిస్తోంది. దీని ధర సుమారు మూడున్నర కోట్లు. పూర్తిగా కార్బన్ ఫైబర్‌తో నిర్మించారు. కేవలం 196 కిలోల బరువుతో ఉన్న హెక్సాను అలా్ట్రలైట్ వాహనంగా అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. దీనిని నడపడానికి పైలెట్ లైసెన్సూ అవసరం లేదని తేల్చి చెప్పింది. పాసెంజర్ డ్రోన్‌గా పేరు తెచ్చు కుంటోంది హెక్సా.
పదిహేను వందల దరఖాస్తులు...
ఈ ఫ్లయింగ్ కార్లో ఎగరాలని ఉందని ఇప్పటికే పదిహేను వందల మంది దరఖాస్తు పెట్టుకున్నారట. భద్రత కోసం పారాచూట్, ఎయిర్‌బాగ్‌లనూ అమర్చారు. హెక్సాలో ఒక్కరు మాత్రమే కూర్చుని ప్రయాణం చేసే విధంగా రూపొందించారు. వీటిలో ప్రయాణించదలచుకున్న వ్యక్తికి కొద్దిపాటి శిక్షణను ఇస్తారు. గగన ప్రయాణాన్నంతా కూడా నేలమీద కేంద్రంలోని సిబ్బంది ఎప్పడికప్పుడు మానిటర్ చేస్తుంటారు.
కరోనా మహమ్మారి వల్ల కాస్త వెనుకబడ్డా త్వరలో హెక్సాను అందుబాటులోకి తేవడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేఘాలకి చేరువగా సాగే హెక్సా ప్రయాణంలో తప్పకుండా విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తుందనడంలో సందేహం లేదు.