బాణసంచా కర్మాగారంలో అగ్నిప్రమాదం.. నింగికెగసిన వేలాది రాకెట్లు!

ABN , First Publish Date - 2020-12-08T03:07:47+05:30 IST

రష్యాలోని ఓ బాణసంచా కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించడంతో వరుస పేలుళ్లు సంభవించాయి. తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో

బాణసంచా కర్మాగారంలో అగ్నిప్రమాదం.. నింగికెగసిన వేలాది రాకెట్లు!

న్యూఢిల్లీ: రష్యాలోని ఓ బాణసంచా కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించడంతో వరుస పేలుళ్లు సంభవించాయి. తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో ఆకాశం వెలుగులీనింది. వేలాది రాకెట్లు నింగికెగశాయి. నింగిలోకి వేలాదిగా దూసుకొస్తున్న రాకెట్లును చూసి ఏం జరుగుతుందో అర్థం కాక జనాలు బుర్రలు బాదుకున్నారు. దక్షిణ రష్యాలోని పోర్టు సిటీ అయిన రోత్సోవ్-ఆన్-డాన్‌లో ఈ నెల 6న తెల్లవారుజామున జరిగిందీ ఘటన.


రాకెట్ల వెలుగులతో ఆకాశం దేదీప్యమానంగా వెలుగుతున్నట్టున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్టరీ నుంచి రాకెట్లు నలువైపులకూ దూసుకెళ్లాయి. గులాబి, ఆకుపచ్చ, ఎరుపు, బంగారం రంగులో ఆకాశం మిరుమిట్లు గొలిపింది. రాకెట్లు అయితే కొన్ని నిమిషాలపాటు ఆగకుండా ఆకాశంలోకి దూసుకెళ్తూనే ఉన్నాయి. 


రాకెట్లు అన్ని వైపులకు దూసుకొస్తుండడంతో ఏదో పెద్ద పేలుడు జరిగిందని భయపడి పరుగులు తీసిన జనం ఆ తర్వాత నెమ్మదిగా బయటకు వచ్చి వీడియోలు తీసుకున్నారు. మరోవైపు, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. చివరికి 400 మంది సిబ్బంది రంగంలోకి దిగితే కానీ మంటలు అదుపులోకి రాలేదు.


కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రి తయారు చేస్తుండడంతోనే ఇంత పెద్ద ప్రమాదం సంభవించినట్టు పోలీసులు తెలిపారు. రెండస్తుల్లో సరుకును నిల్వ చేసినట్టు తెలిపారు. కాగా, ప్రమాదం తెల్లవారుజామున సంభవించడం, జనసంచారం లేకపోవడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు.   



Updated Date - 2020-12-08T03:07:47+05:30 IST