-
-
Home » Prathyekam » farmer protest small child sartaj got famous among protesters
-
రైతుల ఆందోళనలకు ఏడాది చిన్నారి మద్దతు
ABN , First Publish Date - 2020-12-27T15:17:15+05:30 IST
కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ...

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ నెల్లాళ్లుగా రైతులు ఢిల్లీలోని సింధు బోర్డర్ దగ్గర ఆందోళనలు నిర్వహిస్తూ వస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల రైతులు కూడా ఇక్కడకు చేరుకుని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనల్లో అన్ని వయసులవారూ పాల్గొంటున్నారు. చివరికి స్కూలు పిల్లలు కూడా మద్దతు పలుకుతున్నారు. అయితే గత రెండు రోజు రోజులుగా ఈ ఆందోళనల్లో ఏడాది బాలుడు పాల్గొంటున్నాడు.
ఇంత చిన్నవయసులో నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్న ఆ బాలుడిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ చిన్నారి సర్తాజ్‌తో సెల్ఫీలు దిగుతున్నారు. ఇప్పుడు సర్తాజ్‌కు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారుతున్నాయి. ఆ ముద్దులొలికే బాలుడు ధరించిన టీ షర్టుపై ‘రైతుల భూములు లాక్కోవద్దు’ అనే నినాదం ఉంది. ఆందోళనల్లో పాల్గొంటున్న రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా, చిన్నారి సర్తాజ్ వారికి మద్దతు పలుకుతూ తన చిన్ని చేతులను పైకి ఎత్తుతున్నాడు. పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్‌కు చెందిన సర్తాజ్ తండ్రి డాక్టర్ రవదీప్ సింగ్ సంథూ మాట్లాడుతూ తాను ఒక రైతు కుమారుడినని, తన తండ్రి వ్యవసాయం చేస్తూనే తనను చదివించాడని తెలిపారు. రెండు రోజుల క్రితం తన కుమారునితోపాటు రైతులకు మద్దతు పలికేందుకు తాను ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా సర్తాజ్ తల్లి, డాక్టర్ నవదీప్ కౌర్ మాట్లాడుతూ నూతన వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ బిల్లులను వెనక్కి తీసుకోకపోతే మోదీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.