-
-
Home » Prathyekam » durgam cheruvu boating
-
దుర్గం చెరువులో మరో అద్భుతం..!
ABN , First Publish Date - 2020-10-31T17:05:22+05:30 IST
శరద్‌రుతువులో.. వెండి వెన్నెల కనువిందు చేసేవేళ.. ‘‘లాహిరి లాహిరి లాహిరిలో..’’ అంటూ జల విహారం చేస్తుంటే..! కాలంతోపాటు పరుగులు తీస్తూ.. క్షణం తీరిక లేకుండా యాంత్రిక జీవనం గడిపే వారికి అదో గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. వారం రోజులపాటు తాము పడ్డ శ్రమ, కష్టం అంతా..

హైదరాబాద్ : శరద్‌రుతువులో.. వెండి వెన్నెల కనువిందు చేసేవేళ.. ‘‘లాహిరి లాహిరి లాహిరిలో..’’ అంటూ జల విహారం చేస్తుంటే..! కాలంతోపాటు పరుగులు తీస్తూ.. క్షణం తీరిక లేకుండా యాంత్రిక జీవనం గడిపే వారికి అదో గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. వారం రోజులపాటు తాము పడ్డ శ్రమ, కష్టం అంతా.. వారాంతంలో ఒక్క పూట.. కుటుంబంతో కలిసి జరిపే బోటు షికారుతో ‘‘హుష్ కాకి’’ కాకమానదు. పర్యాటకుల కోసం ఈ సేవలు దుర్గం చెరువులో అందుబాటులోకి వచ్చాయి. ఓ వైపు కేబుల్ బ్రిడ్జి.. మరోవైపు బోట్ షికారు.. ఇంకోవైపు కాంతులీనుతూ మిరుమిట్లు గొలిపే విద్యుత్తు దీపాల కాంతులతో పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించడానికి దుర్గం చెరువును రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు సిద్ధం చేశారు.
‘రహస్య తటాకం’గా పేరున్న ఈ చెరువుకు ఇప్పటికే రూ.184 కోట్లతో అందుబాటులోకి తెచ్చిన కేబుల్ బ్రిడ్జి ప్రత్యేక ఆకర్షణ కాగా.. రూ.65 లక్షలతో కొనుగోలు చేసిన నాలుగు బోట్లు ఇప్పుడు పర్యాటకులకు కనువిందును పంచుతున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో బోట్‌షికారుకు హుస్సేన్‌సాగర్ కేంద్రం కాగా.. ఇప్పుడు అందుకు దీటుగా దుర్గంచెరువును అభివృద్ధి చేస్తున్నారు. కరోనా అన్‌లాక్‌ల తర్వాత.. గత నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని.. టూరిస్టు స్పాట్‌లలో పర్యాటకులను అనుమతించిన విషయం తెలిసిందే. కరోనా భయాందోళన, భారీ వర్షాల తర్వాత ఇప్పుడిప్పుడే పర్యాటకులు టూరిస్టు, ఆర్కియాలజీ ప్రదేశాలకు వస్తున్నారు. హుస్సేన్‌సాగర్‌లో బోటింగ్ ప్రారంభమైంది. గోల్కొండ సందర్శనకు ఆన్‌లైన్ టికెట్లు జారీ చేస్తున్నారు. ఇతర పర్యాటక ప్రదేశాల్లోనూ సందర్శకుల తాకిడి పెరుగుతోంది.